ఆ పాతిక సీట్లపై అందరి కళ్లు!

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా 25 నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ స్థానాల్లో పోటీకి దిగిన అభ్యర్థుల ప్రాముఖ్యత అందుకు ప్రధాన కారణం కాగా, స్థానిక పరిస్థితులూ కొన్నిచోట్ల పోటీని రసవత్తరంగా మారుస్తున్నాయి.

Updated : 13 Apr 2024 06:16 IST

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా 25 నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ స్థానాల్లో పోటీకి దిగిన అభ్యర్థుల ప్రాముఖ్యత అందుకు ప్రధాన కారణం కాగా, స్థానిక పరిస్థితులూ కొన్నిచోట్ల పోటీని రసవత్తరంగా మారుస్తున్నాయి. ప్రధాని మోదీ మరోసారి బరిలో నిలిచిన వారణాసి సహా కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న సీట్లు ఈ జాబితాలో ఉన్నాయి.


దాయాదుల పోరు!

మహారాష్ట్రలోని బారామతిలో ప్రస్తుతం ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) వర్గం నుంచి సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ నుంచి అజిత్‌ భార్య సునేత్రా పవార్‌ రూపంలో ఆమెకు గట్టి ప్రత్యర్థి ఎదురవుతున్నారు. ఇది దాయాదుల పోరులా మారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఝార్ఖండ్‌లోని దుమ్కాలో సీతా సోరెన్‌, నళిన్‌ సోరెన్‌ల మధ్య పోరు కూడా భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ తరహాలో ఉత్కంఠ రేపుతోంది. కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌గాంధీ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా సతీమణి అన్నీ రాజా పరస్పరం తలపడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.


చౌహాన్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ..

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ 1991 నుంచి 2004 వరకు వరుసగా అయిదుసార్లు విదిశా ఎంపీగా ఎన్నికయ్యారు. 20 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు అదే స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అదే రాష్ట్రానికి చెందిన రాజకుటుంబికుడు జ్యోతిరాదిత్య సింధియా తన సొంత నియోజకవర్గం గుణలో ఈసారి భాజపా తరఫున తొలిసారి బరిలో ఉండటమూ ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్‌ను వీడి సొంత కుంపటిని ఏర్పాటుచేసుకున్న మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ జమ్మూకశ్మీర్‌లో తొలిసారి అనంతనాగ్‌ నుంచి తన డీపీఏపీ పార్టీ తరఫున బరిలో ఉన్నారు.


పోటీలో లాలూ కుమార్తెలు

బిహార్‌లోని పాటలీపుత్రలో లాలూప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమార్తె మీసా భారతి వరుసగా రెండుసార్లు పరాజయం పాలయ్యారు. అయినా పట్టు వీడకుండా పాత ప్రత్యర్థి రామ్‌కృపాల్‌ యాదవ్‌తో మరోసారి ఇప్పుడు పోటీకి సిద్ధమయ్యారు. లాలూ మరో కుమార్తె రోహిణీ ఆచార్య సారణ్‌లో భాజపా నుంచి రాజీవ్‌ప్రతాప్‌ రూడీ రూపంలో బలమైన ప్రత్యర్థిని ఢీకొంటున్నారు. డబ్బు తీసుకొని పార్లమెంటులో ప్రశ్నలు అడిగారన్న అభియోగాలతో ఎంపీ పదవిని పోగొట్టుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకురాలు మహువా మొయిత్రాకు పోటీగా కృష్ణానగర్‌లో భాజపా బలమైన రాజవంశానికి చెందిన రాజమాత అమృతారాయ్‌ను పోటీకి నిలపడం వాతావరణాన్ని వేడెక్కించింది. కుకీ-మైతేయ్‌ తెగల అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న మణిపుర్‌లోని అవుటర్‌ మణిపుర్‌ నియోజకవర్గంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని రెండు దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తుండటం అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దంపడుతోంది.


అన్నామలై గట్టెక్కుతారా?

ఐపీఎస్‌కు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన అన్నామలై.. తమిళనాడులో భాజపా ప్రాభవాన్ని పెంచేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కృషిచేస్తూనే.. కోయంబత్తూరు నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. అక్కడి ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. నవజోత్‌సింగ్‌ సిద్ధూ తమ పార్టీని వీడిన తర్వాత పంజాబ్‌లోని అమృత్‌సర్‌ను భాజపా మళ్లీ చేజిక్కించుకోలేకపోయింది. అక్కడ కమలదళం తరఫున గత రెండు ఎన్నికల్లో పోటీ చేసిన అరుణ్‌ జైట్లీ, హర్‌దీప్‌ సింగ్‌లకు నిరాశే ఎదురైంది. అమెరికాలో భారత రాయబారిగా గతంలో పనిచేసిన తరణ్‌జీత్‌సింగ్‌ సంధూను ప్రస్తుతం అక్కడ భాజపా బరిలో దించింది. గత ఎన్నికల్లో దేశంలోనే రెండో అత్యధిక మెజార్టీ హరియాణాలోని కర్నాల్‌లో నమోదైంది. అలాంటిచోట కాషాయ పార్టీ తమ సిట్టింగ్‌ ఎంపీని మార్చి మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు టికెట్‌ ఇచ్చింది. అక్కడ ఫలితం, మెజార్టీ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని