నీట్‌ ..పేదలకు వ్యతిరేకం

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. విపక్ష ఇండియా కూటమి పెరియార్‌ ఆలోచనలతో, సామాజిక న్యాయం, ఐకమత్యం నినాదంతో ముందుకెళ్తుంటే.. తమకు ప్రత్యర్థిగా ఆరెస్సెస్‌, మోదీ విధానాలున్నాయని చెప్పారు.

Published : 13 Apr 2024 05:19 IST

‘ఇండియా’ అధికారంలోకి వస్తే దాని నిర్వహణ అధికారం రాష్ట్రాలకే
ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ గెలుపు ఖాయం
తిరునెల్వేలి సభలో రాహుల్‌ గాంధీ

ఈనాడు-చెన్నై: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరిగే పోరని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. విపక్ష ఇండియా కూటమి పెరియార్‌ ఆలోచనలతో, సామాజిక న్యాయం, ఐకమత్యం నినాదంతో ముందుకెళ్తుంటే.. తమకు ప్రత్యర్థిగా ఆరెస్సెస్‌, మోదీ విధానాలున్నాయని చెప్పారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. ‘‘నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) పేదలకు వ్యతిరేకం. ఆ పరీక్షతో తమిళనాడు పేదలు క్షోభ అనుభవిస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చాక నీట్‌ నిర్వహణ నిర్ణయం బాధ్యతను రాష్ట్రాలకే అప్పగిస్తాం. ఆ పరీక్షను నిర్వహించాలా, వద్దా అనేది వారే నిర్ణయం తీసుకోవచ్చు. ఒకే దేశం, ఒకే నేత, ఒకే భాష అంటూ మోదీ చెబుతున్నారు. తమిళ భాష మీద, ఇక్కడి ప్రజలపై  దాడి జరుగుతోంది. ఇండియా కూటమి విభిన్న భాషల్ని, సంస్కృతుల్ని సమానంగా చూస్తున్నాం. వాటిని ఏ శక్తీ తాకకుండా చేస్తాం. మోదీ విధానాలతో 83 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రతి రోజుకు 30మంది రైతులు చనిపోతున్నా మోదీకి పట్టింపులేదు. రైతుల రుణాలు మాఫీ చేయకుండా తన సన్నిహితుల గుప్పిట్లో కాంట్రాక్టులు, పరిశ్రమల్ని ఉంచారు. గతంలో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భారతదేశాన్ని విదేశీయులు భావించేవారు. ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని అనుకుంటున్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం తథ్యం. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు మోదీలాగా కాలయాపన చేయకుండా అధికారంలోకి రాగానే అమలుచేస్తాం. రైతుల్లాగే మత్స్యకారులూ దేశానికి ఆహారాన్నిస్తున్నారు. వారికోసం ప్రత్యేక మేనిఫెస్టో తయారుచేస్తాం. వారి బోట్లకు బీమాతో పాటు డీజిల్‌లో రాయితీ, క్రెడిట్కార్డు, ప్రత్యేక గుర్తింపు ఇస్తాం’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. తిరునెల్వేలి సభలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై, ఎంపీ కనిమొళి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని