ఈడీ కేసుల్లో 3 శాతమే రాజకీయ నాయకులవి: మోదీ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3 శాతమే రాజకీయ నాయకులవి ఉన్నాయని, మిగిలిన 97% కూడా అధికారులు, నేరగాళ్లవేనని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.

Published : 13 Apr 2024 05:34 IST

దిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో కేవలం 3 శాతమే రాజకీయ నాయకులవి ఉన్నాయని, మిగిలిన 97% కూడా అధికారులు, నేరగాళ్లవేనని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. అవినీతి వ్యవస్థ ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నవారే నానా రాద్ధాంతం చేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. ‘‘అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేందుకు మా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోంది. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ మా చర్యలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు సంస్థలు రాజకీయ నాయకులనే లక్ష్యంగా చేసుకుంటున్నాయని కొందరు కావాలనే తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారు. మళ్లీ ఎన్డీయే సర్కారే రాబోతోందని ప్రతిపక్షాలూ నమ్ముతున్నాయి. అందుకే చాలామంది విపక్ష నేతలు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు’’ అని ఓ హిందీ దినపత్రికకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. కాంగ్రెస్‌కు దశాబ్దాలపాటు మెజార్టీ ఉన్నా దానిని ఉపయోగించి ఓ కుటుంబాన్ని బలోపేతం చేయడానికే ప్రయత్నించిందని విమర్శించారు. పదేళ్లపాటు తాము అధికారంలో ఉన్నా ప్రజలు అదే ఉత్సాహంగా మరోసారి భాజపా సర్కారును కోరుకుంటున్నారని చెప్పారు. చేసిన వాగ్దానాలను భాజపా నెరవేరుస్తుందనేది ప్రజలకు తెలుసునన్నారు.

వసంత నవరాత్రుల్లో మాంసాహారం తినడమా..

ఓ పార్టీ నేత వసంత నవరాత్రుల్లో మాంసాహారాన్ని తింటూ ఆ వీడియోను బహిర్గతపరచడం ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగమేనని మోదీ పేర్కొన్నారు. ఎవరు దేనినైనా తినకుండా తాను గానీ, చట్టంగానీ అడ్డుకోవడం లేదన్నారు. రాజుల్ని ఓడించడం ద్వారా కాకుండా ఆలయాలను కొల్లగొట్టి మొఘలులు సంతృప్తి చెందేవారని, అలాగే కొందరు నాయకులు ఇలాంటి వీడియోలతో ఆనందిస్తున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని