భాజపాదే ఐపీఎల్‌ కప్‌

ఐపీఎల్‌ క్రికెట్‌ మాదిరిగానే దేశ రాజకీయాల్లో ‘ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌’ నడుస్తోంది. ఒక వైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని భాజపా జట్టు బరిలో దిగగా మరోవైపు ఇండియా కూటమి పేరుతో పార్టీలన్నీ కలిసి జట్టుగా తలపడుతున్నాయని కరీంనగర్‌ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు.

Updated : 14 Apr 2024 05:55 IST

హామీలతో మోసగించిన కాంగ్రెస్‌ లైసెన్స్‌ రద్దుకు ప్రజలు సిద్ధం
రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలుస్తాం
బండి సంజయ్‌

తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: ఐపీఎల్‌ క్రికెట్‌ మాదిరిగానే దేశ రాజకీయాల్లో ‘ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌’ నడుస్తోంది. ఒక వైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని భాజపా జట్టు బరిలో దిగగా మరోవైపు ఇండియా కూటమి పేరుతో పార్టీలన్నీ కలిసి జట్టుగా తలపడుతున్నాయని కరీంనగర్‌ ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ఆ కూటమిని ఓడించి మోదీ 400 సీట్లతో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ విజయసంకల్ప్‌ అభియాన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్‌ లీగ్‌(టీపీఎల్‌) మొదలైంది. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 17 మంది సభ్యుల జట్టు బరిలో ఉంది. అటు వైపు కాంగ్రెస్‌, భారాస జట్లు పోటీపడుతున్నాయి. టీపీఎల్‌ కప్‌(మొత్తం 17 సీట్లు) గెలిచి మోదీకి కానుకగా ఇస్తాం. కాంగ్రెస్‌కు ఆటగాళ్లే(అభ్యర్థులు) దొరకడంలేదు. భారాస సభ్యులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. అన్నదాతను మోసం చేస్తే మిల్లర్ల, వ్యాపారుల లైసెన్స్‌లను రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీ లైసెన్స్‌ను ప్రజలు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వడ్లకు మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి రాగానే అన్నదాతకు మొండిచేయి చూపుతోంది.

గుండెలో స్టెంట్‌ ఉన్నా: కాంగ్రెస్‌, భారాస నేతలు ఒక్కటై నన్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయి.కేసీఆర్‌ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నా గుండెలో స్టెంట్‌ ఉన్నా అన్ని వర్గాల పక్షాన ఉద్యమాలు చేశా. గత అయిదేళ్లలో కాంగ్రెస్‌ నేతలు ఏనాడైనా ప్రజల పక్షాన పోరాటాలు చేశారా?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని