హైదరాబాద్‌కు కేసీ వేణుగోపాల్‌.. నేడు మిగతా అభ్యర్థుల ఖరారు!

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మిగిలిన మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆదివారం ఖరారుచేసే అవకాశాలున్నాయి.

Updated : 14 Apr 2024 08:30 IST

సీఎం రేవంత్‌రెడ్డితో దీపా దాస్‌మున్షీ, భట్టి భేటీ

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో మిగిలిన మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఆదివారం ఖరారుచేసే అవకాశాలున్నాయి. ఈ విషయమై పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు శనివారం ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇంతవరకు 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా ఆదివారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు రానున్నారు. అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానం సూచనలతో ఆయన వస్తున్నారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముగ్గురు కీలక నేతలు శనివారం చర్చించినట్లు సమాచారం. ఖమ్మం టికెట్‌ను భట్టి సతీమణి నందిని కూడా ఆశిస్తున్నారు. అయితే ఆయన సోదరుడు మల్లు రవికి ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ టికెట్‌ను పార్టీ ఖరారు చేసినందున ఖమ్మం స్థానాన్ని కూడా ఆయన కుటుంబానికే ఇస్తారా అనేది సందేహమేనని నేతలు భావిస్తున్నారు. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డితో పాటు రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు తదితరులు కూడా ఈ టికెట్‌ను ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి కేటాయిస్తారనేదాన్ని బట్టి కరీంనగర్‌ టికెట్‌ను కూడా నిర్ణయిస్తారని సమాచారం. ఈ అంశంపై చర్చించిన ముగ్గురు నేతలు ఆదివారం కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అనంతరం అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నేటి సమావేశంలో..

కేసీ వేణుగోపాల్‌ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో సమావేశమవుతారు. రేవంత్‌రెడ్డి, భట్టి, దీపా దాస్‌మున్షీలతో పాటు మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జులు, ఇంతవరకు ప్రకటించిన ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థుల ఖరారుతో పాటు అనేక అంశాలపై సమావేశంలో చర్చిస్తారని పార్టీ వర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచారం, ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలు తదితర అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రంలో అగ్రనేతలతో ఎక్కడెక్కడ బహిరంగ సభలు, రోడ్‌ షోలు నిర్వహించాలి.. ఏ సభకు ఏఐసీసీ అగ్రనేతల్లో ఎవరిని భాగస్వాములను చేయాలనే అంశాలపై వేణుగోపాల్‌ రాష్ట్ర నాయకత్వంతో చర్చించనున్నారు. రాష్ట్ర నాయకత్వం వ్యూహాలు, ప్రణాళిక, అభిప్రాయాలను కూడా తెలుసుకుని మార్గనిర్దేశం చేస్తారు. జాతీయ కాంగ్రెస్‌ ప్రకటించిన గ్యారంటీలు, హామీలతో కూడిన ‘న్యాయపత్రం’పై విస్తృత ప్రచారం, ఇంటింటికీ కార్డుల చేరవేతకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 14 తర్వాత నుంచి మే 11వ తేదీ వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసుకున్నారు. దాదాపు 50 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సీఎం సభలు, అటు ఏఐసీసీ అగ్రనేతలు పాల్గొనే సభలపై కేసీ వేణుగోపాల్‌ ఈ సమావేశంలో చర్చించి బహిరంగ సభలు, రోడ్‌ షోలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని