ఖర్చులిస్తేనే కదులుతాం!

లోక్‌సభ ఎన్నికల ప్రచారం పెద్దఎత్తున చేపట్టాలంటే అందుకయ్యే వ్యయం ఇవ్వాలంటూ అభ్యర్థులను స్థానిక నేతలు అడుగుతున్నారు.

Updated : 14 Apr 2024 05:49 IST

ప్రచార వ్యయం అడుగుతున్న స్థానిక నేతలు
తమ వద్ద సొమ్ము లేదంటున్న ఎమ్మెల్యేలు
పార్టీ నిధుల కోసం పలువురు ఎంపీ అభ్యర్థుల ఎదురుచూపు
నియోజకవర్గం మొత్తం తిరగాలంటే రూ.50 కోట్లకు పైగా అవసరమని అంచనా

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం పెద్దఎత్తున చేపట్టాలంటే అందుకయ్యే వ్యయం ఇవ్వాలంటూ అభ్యర్థులను స్థానిక నేతలు అడుగుతున్నారు. గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలంతా పైసలిస్తేనే ఎన్నికల కదనరంగంలోకి దూకుదామని ఎదురుచూస్తున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు, దాదాపు 40-50 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కలిపి వంద మందికిపైగా ఉంటారు. వీరందరూ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటేనే అభ్యర్థికి కలిసివస్తుంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే భారీగా వ్యయం కావడంతో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు మళ్లీ ఖర్చు పెట్టేందుకు సుముఖంగా లేరని లోక్‌సభ అభ్యర్థి ఒకరు తెలిపారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారానికి కనీసం రూ.10 కోట్ల దాకా అవసరమని అభ్యర్థుల అంచనా.

వచ్చే నెల 11వ తేదీ వరకు ప్రచార గడువు ఉంది. అప్పటివరకు లోక్‌సభ నియోజకవర్గం మొత్తం అలుపెరగకుండా తిరగాలంటే కనీసం రూ.50 కోట్లకు పైగా అవసరమవుతుందని నేతలు భావిస్తున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఏసీ వాహనాలు, మంచినీరు, మజ్జిగ, భోజనాలు, బిర్యానీలు, మద్యం, ప్రచార పత్రాలు, ఫ్లెక్సీలు.. ఇలా అన్నింటికీ భారీగా డబ్బు అవసరం. ఏదైనా చిన్న గ్రామానికి ప్రచారానికి వెళ్లినా ఖర్చులు ఇవ్వాలని కార్యకర్తలు, అక్కడి ఛోటామోటా నేతలు అడుగుతున్నారని అభ్యర్థులు చెబుతున్నారు. ఒక్కో కార్యకర్త రోజుకు రూ.వెయ్యి దాకా అడుగుతున్నారు. భోజనం, మద్యం అదనం. మండలస్థాయి నేతలకు రూ.లక్షల్లో చెల్లిస్తేనే ప్రచారానికి ముందుకొస్తున్నారు. ఇవి కాకుండా ఆయా సామాజికవర్గ సంఘాలు, కాలనీ సమూహాల విజ్ఞప్తుల మేరకు సామూహిక అవసరాల కోసం అక్కడక్కడా గుండుగుత్తగా సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. స్థానికులకు అవసరమైన కొన్ని పనులకు కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

రోజుకు రూ. కోటి ఖర్చు తప్పదా!

ఖర్చులకు సొమ్ము ఇచ్చేదెవరో తేలక కొందరు నేతలు ప్రచారానికి రావడం లేదు. ప్రతి పార్టీకి ప్రచారంలో నియోజకవర్గ నేతలు కీలకం. వారు ముందుండి నడిపిస్తేనే కార్యకర్తలు, స్థానిక నేతలు కదులుతారు. వారే చేతులెత్తేస్తుండటంతో అడిగినంత ఇచ్చి ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో ఒకరోజు ప్రచారానికి రూ.కోటి వరకూ ఖర్చవుతోందని అనధికారిక సమాచారం. పార్టీ విజయం ప్రధానమైనందున ఎమ్మెల్యేలు కూడా కొంత వ్యయం భరిస్తారని లోక్‌సభ అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కానీ, తాము నెగ్గి నాలుగు నెలలే అయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చులతో తమ వద్ద ఇప్పుడు సొమ్ముల్లేవని కొందరు ఎమ్మెల్యేలు తెగేసి చెపుతున్నట్లు అభ్యర్థులు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినవారిదీ అదే పరిస్థితి.

అప్పులు చేసైనా సరే..

కొన్ని స్థానాల్లో లోక్‌సభ అభ్యర్థులు పార్టీ నిధుల కోసం చూస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న నేతలకే పార్టీలు టికెట్లు ఇవ్వడంతో.. వారు పార్టీ సొమ్ము కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. వీరిలో కొందరు టికెట్‌ ఖరారైనప్పటి నుంచి ఇప్పటికే భారీగా ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని కీలక నియోజకవర్గాల్లో నెగ్గాలంటే రూ.100 కోట్ల దాకా అవసరమవుతుందని అనధికార అంచనా. ‘ఎంపీగా నెగ్గితేనే రాజకీయంగా పేరు, పలుకుబడి వస్తాయి. ఎలాగైనా నెగ్గి తీరాలని.. ఉన్న ఆస్తులన్నీ అమ్మడం లేదా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ప్రచారానికి ఖర్చుపెడుతున్నాను. గెలిస్తే ఎంపీ అవుతా. ఓడితే ఆస్తులు పోతాయి’ అని ఓ పార్టీ అభ్యర్థి ‘ఈనాడు’కు తెలిపారు. భారీగా ఖర్చు పెట్టకుంటే గెలిచే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని