కంగనపై పోటీకి హిమాచల్‌ మంత్రి విక్రమాదిత్య

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాలుగు రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థుల పేర్లతో తాజా జాబితాను కాంగ్రెస్‌ పార్టీ శనివారం రాత్రి విడుదల చేసింది.

Updated : 14 Apr 2024 05:42 IST

16 మందితో కాంగ్రెస్‌ తాజా జాబితా

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాలుగు రాష్ట్రాల నుంచి 16 మంది అభ్యర్థుల పేర్లతో తాజా జాబితాను కాంగ్రెస్‌ పార్టీ శనివారం రాత్రి విడుదల చేసింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వీరిని ఖరారు చేసింది. దీని ప్రకారం.. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా ఉన్న బాలీవుడ్‌ తార కంగనా రనౌత్‌పై ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్‌ పోటీ చేయనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌, హిమాచల్‌ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌ దంపతుల తనయుడైన విక్రమాదిత్య ఇప్పటికి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈసారి మండీలో యువనేతనే రంగంలో దించాలని సీనియర్‌ నేతలు భావించడంతో ఆయన పేరు ఖరారైంది. కేంద్ర మాజీమంత్రి మనీశ్‌ తివారీ.. చండీగఢ్‌ నుంచి బరిలో దిగనున్నారు. పంజాబ్‌లో ఏడెనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినా వారిపేర్లు వెల్లడికావాల్సి ఉంది. ఎన్నికల కమిటీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగనా, విక్రమాదిత్యల మధ్య ఇటీవల మాటల యుద్ధం పెరిగింది. ‘‘కంగన వివాదాల రాణి. ఆమెకు బుద్ధి ప్రసాదించాలని రాముణ్ని ప్రార్థిస్తున్నా. హిమాచల్‌ ప్రజల గురించి ఏమాత్రం తెలియని ఆమె మళ్లీ బాలీవుడ్‌కు వెళ్తుందని ఆశిస్తున్నా’’ అని విక్రమాదిత్య వ్యాఖ్యానించారు.  దీనికి కంగనా దీటుగా బదులిచ్చారు. ‘‘ఈ రాష్ట్రం ఆయన తాతల జాగీరేమీ కాదు. నన్ను బెదిరించి వెనక్కి పంపలేరు. రాహుల్‌, విక్రమాదిత్య.. ఇద్దరూ ‘పప్పూ’లే’’ అని ఆమె విమర్శించారు.

విపక్ష కూటమికి 55 సంఘాల మద్దతు

దిల్లీ: సామాజిక న్యాయం, ఓబీసీ హక్కుల కోసం పనిచేస్తున్న 55 సంఘాల ప్రతినిధులు శనివారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తామంతా విపక్ష కూటమి (ఇండియా)కి మద్దతు ఇస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాడుతున్నామని, దీనికి అన్నివర్గాలూ అండగా నిలవాలని ఖర్గే కోరారు. ఆరోగ్యం సహకరించకపోయినా సోనియాగాంధీ ఈ పోరులో పాల్గొంటున్నారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని