ఉనికి కోల్పోతున్న రాజరికం

స్వాతంత్య్రం తర్వాత తమ సంస్థానాలను భారత్‌లో విలీనం చేసిన రాజ కుటుంబాలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. ఎన్నికల్లో రాణించేందుకు వారు సొంతంగా పార్టీలను పెట్టినా మనలేకపోయారు.

Updated : 14 Apr 2024 05:41 IST

రాజస్థాన్‌లో సొంత పార్టీలు పెట్టినా ప్రయోజనం శూన్యం
చివరకు ఏదో ఒక పార్టీలో చేరి పదవుల కోసం ఆరాటం
(జైపుర్‌ నుంచి ప్రకాశ్‌ భండారీ)

స్వాతంత్య్రం తర్వాత తమ సంస్థానాలను భారత్‌లో విలీనం చేసిన రాజ కుటుంబాలు క్రమంగా ఉనికిని కోల్పోతున్నాయి. ఎన్నికల్లో రాణించేందుకు వారు సొంతంగా పార్టీలను పెట్టినా మనలేకపోయారు. దీంతో ఏదో ఒక పార్టీలో చేరి పదవుల కోసం ఆరాటపడే స్థాయికి వారి స్థితి చేరింది.

తొలి రోజుల్లో మినహాయింపులు

దేశంలోని పలు సంస్థానాలను సర్దార్‌ పటేల్‌.. భారత్‌లో విలీనం చేసిన తర్వాత రాజ కుటుంబాలకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను కొనసాగించారు. వారికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపు, ఏటా గౌరవ వందనం, విదేశీ మద్యం దిగుమతికి అనుమతి వంటివి కొనసాగాయి. అయితే సింహాసనాలు పోయాక వారంతా ఒంటరిగా మిగిలారు. కొంత మంది ప్రజాస్వామిక రాజకీయాల్లో భాగమై ప్రజల్లో ఉండగా.. మరి కొంత మంది ఉనికిలో లేకుండాపోయారు.

22 సంస్థానాలు

రాజస్థాన్‌లో చిన్నాపెద్దా కలిపి 22 సంస్థానాలు ఉన్నాయి. అందులో జైపుర్‌, జోధ్‌పుర్‌, బీకానేర్‌, ఉదయ్‌పుర్‌, కోటా, అలవర్‌, భరత్‌పుర్‌, కరౌలీ, జైసల్మేర్‌, దుంగార్‌పుర్‌, బాంస్‌వాడా, సీకర్‌, ఖేతడీ ముఖ్యమైనవి.

పార్టీలు పెట్టినా పరాజయమే

  • స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జోధ్‌పుర్‌ మహారాజు హన్వంత్‌ సింగ్‌ రామరాజ్య పరిషత్‌ అనే పార్టీని పెట్టారు. 1957 తర్వాత ఆ పార్టీ అంతరించిపోయింది.
  •  జైపుర్‌ మహారాణి గాయత్రీ దేవి స్వతంత్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో రాజ్‌పూత్‌లు, అనుయాయులు భారీగా చేరారు. పదేళ్లపాటు కాంగ్రెస్‌కు ఆ పార్టీ సవాలు విసిరింది. చివరకు 1972 నాటికి పార్టీ అంతరించిపోయింది.
  • బీకానేర్‌ రాజవంశీకుడు కర్ణి సింగ్‌ లోక్‌సభకు ఐదుసార్లు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.
  • భరత్‌పుర్‌ రాజవంశ వారసుడు బచ్చు సింగ్‌ లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు.
  • భరత్‌పుర్‌లో మరో రాజవంశ వారసుడు విశ్వేంద్ర సింగ్‌ పోటీ చేసి విజయం సాధించారు.

    ప్రధాన పార్టీల్లోకి..

పార్టీలు పెట్టినా విజయం సాధించలేకపోవడంతో రాజ వంశీకులు చివరకు ప్రధాన పార్టీల్లో చేరాల్సి వచ్చింది.

  •  ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజె కుమారుడు దుశ్యంత్‌ సింగ్‌, ఉదయ్‌పుర్‌ రాజ వంశీకుడు విశ్వరాజ్‌ సింగ్‌ సతీమణి మహిమా కుమారి ఉన్నారు. మహిమా కుమారి రాజ్‌సమంద్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 2019లో జైపుర్‌ మాజీ యువరాణి దియా కుమారి గెలిచారు.
  • దుశ్యంత్‌ సింగ్‌ ఝాలావాడ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పటికే నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు.
  • భరత్‌పుర్‌, ధోల్‌పుర్‌, బీకానేర్‌లు రిజర్వుడు నియోజకవర్గాలు కావడంతో అక్కడి నుంచి రాజ కుటుంబీకులు పోటీ చేయడం లేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని