బరిలో భారీగా బంధుగణం

లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, కుమార్తెలు, సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు దాదాపు 34 మంది వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు.

Updated : 14 Apr 2024 05:38 IST

లోక్‌సభ సమరంలో మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రుల కుటుంబసభ్యులు

ఈనాడు, దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రుల కుమారులు, కుమార్తెలు, సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు దాదాపు 34 మంది వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు నలుగురు ఉండగా, మాజీ సీఎంల కుటుంబ సభ్యులు 30 మంది ఉన్నారు. ఇప్పటికే 31 మంది పేర్లను అధికారికంగా ప్రకటించగా.. ముగ్గురి పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకూ ప్రకటించిన వారిలో దిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్‌ కుమార్తె భాంసురీ స్వరాజ్‌, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్‌ షర్మిల, లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమార్తె రోహిణీ ఆచార్య, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ కుమారుడు వీరేంద్ర రావత్‌ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుండగా మిగతా వారంతా ఇదివరకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి గెలుపోటములను చవిచూశారు.

లాలు కుమార్తెలిద్దరు..

తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు కిడ్నీ దానంచేసి ప్రాణం నిలబెట్టి ఆయన అసలైన వారసురాలిగా గుర్తింపు పొందిన రోహిణీ ఆచార్య ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం సారణ్‌ నుంచి భాజపా బలమైన ప్రత్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీతో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాప్రా నుంచి సారణ్‌గా మారిన ఈ స్థానం నుంచి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అన్నే సార్లు గెలిచిన రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ ఇప్పుడు ఐదోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లాలూ మరో కుమార్తె, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మీసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గంలో ఐదుసార్లు ఎంపీగా గెలిచిన రామ్‌ కృపాల్‌ యాదవ్‌తో తలపడుతున్నారు. రామ్‌ కృపాల్‌ ఒకప్పుడు ఆర్జేడీ సభ్యుడే. ఆ పార్టీ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో లాలూ ప్రసాద్‌ ఆ స్థానాన్ని కుమార్తె మీసా భారతికి కేటాయించడంతో ఆయన భాజపాలో చేరి గెలిచారు. 2019లో మళ్లీ వారే ప్రత్యర్థులుగా తలపడినా రామ్‌ కృపాలే పైచేయి సాధించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. రెండు సార్లు ఓడిపోయినా మీసా భారతి ధైర్యంగా మూడోసారి రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యుల్లో 10 మంది భాజపా తరఫున పోటీ చేస్తుండగా, 8 మంది కాంగ్రెస్‌ నుంచి, ఏడుగురు వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి రంగంలోకి దిగారు.

గాంధీల కుటుంబం నుంచి..

మాజీ ప్రధానుల్లో ఇద్దరు గాంధీ పరివారానికి సంబంధించినవారే. ఇందులో భాజపా తరఫున సుల్తాన్‌పుర్‌ నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ ఇదివరకు పీలీభీత్‌ నుంచి ఆరు సార్లు, సుల్తాన్‌పుర్‌ నుంచి ఒకసారి గెలుపొంది లోక్‌సభలో అత్యంత సీనియర్‌గా పేరు గడించారు. జనతాదళ్‌ నుంచి రెండు సార్లు, ఇండిపెండెంట్‌గా రెండు సార్లు, భాజపా తరఫున మూడు సార్లు ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి వరుసగా ఆమె గెలుస్తూ వస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ కుమారుడైన రాహుల్‌ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి గెలుపొందారు. 2019లో అక్కడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అక్కడ ఓటమిని ముందే పసిగట్టిన ఆయన అదే ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. మధ్యలో మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కొన్ని రోజులు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినా సుప్రీంకోర్టు జోక్యంతో పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు ఆయన మళ్లీ వయనాడ్‌ నుంచి నామినేషన్‌ వేశారు. అమేఠీ నుంచి పోటీ చేస్తారా.. లేదా.. అన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

సీఎంల బంధువుల పోటీ

మాజీ ముఖ్యమంత్రుల పిల్లల్లో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్‌ సింగ్‌ ఠాకుర్‌తోపాటు, ముఖ్యమంత్రిగా పని చేసిన బసవరాజ్‌ బొమ్మై, ఇదివరకే ఎంపీగా, ముఖ్యమంత్రిగా పని చేసిన కుమార స్వామి, 2004, 2009 ఎన్నికల్లో గెలిచి యూపీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేసి, తర్వాత భాజపాలో చేరి 2014, 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, ఆరు సార్లు కటక్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్‌ కుమారుడు భర్తృహరి మెహతాబ్‌, దేశంలోనే 29 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా పని చేసిన అగాథా సంగ్మా ఉన్నారు. అందరూ వారివారి రాష్ట్రాల్లో బలమైన ముద్ర వేసిన నాయకులే. పురందేశ్వరి, వైఎస్‌ షర్మిల, మెహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, ప్రణీతి శిందేలు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులు/కార్యనిర్వాహక అధ్యక్షులుగా పని చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో యడియూరప్ప తనయుడు బీవై రాఘవేంద్ర, బంగారప్ప తనయ గీతా శివరాజ్‌ కుమార్‌ శివమొగ్గ నియోజకవర్గం నుంచి పరస్పరం తలపడుతుండగా, మిగతా వారంతా ఇతర అభ్యర్థులతో పోటీ పడుతున్నారు.


చంద్రశేఖర్‌ తనయుడు

మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడైన నీరజ్‌ శేఖర్‌ 2007 నుంచి లోక్‌సభ, రాజ్యసభల్లో ఏదో ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం భాజపా తరఫున బలియా నుంచి పోటీ పడుతున్నారు.


మండ్య నుంచి కుమారస్వామి.. 

మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు కుమారస్వామి 1996లో కనకపుర నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998లో మళ్లీ అక్కడి నుంచే పోటీచేసి డిపాజిట్లు కోల్పోయారు. 2009లో బెంగుళూరు రూరల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు తన ఒక్కలిగ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న మండ్య నుంచి ఎన్డీయే కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఆయన కుమారుడు నిఖిల్‌ కుమార స్వామి పోటీచేసి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన సినీ నటి సుమలత చేతిలో ఓటమి చవిచూశారు. ఆ ఎన్నికల్లో సుమలతకు భాజపా మద్దతివ్వడంతో జేడీఎస్‌ ఓటమిపాలైంది. ఇప్పుడు ఆ పార్టీకి భాజపా మద్దతు ఇస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని