అమరుల త్యాగం.. కేసీఆర్‌ పోరాటం వల్లే రేవంత్‌కు సీఎం పదవి

అమరుల త్యాగం.. తెలంగాణ కోసం నాడు కేసీఆర్‌ చేసిన పోరాటం వల్లే నేడు రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోగలిగారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 14 Apr 2024 05:30 IST

భాజపాకు కాంగ్రెస్‌ సహకారం
అందుకే 3 చోట్ల బలమైన అభ్యర్థులను పెట్టలేదు: హరీశ్‌రావు

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: అమరుల త్యాగం.. తెలంగాణ కోసం నాడు కేసీఆర్‌ చేసిన పోరాటం వల్లే నేడు రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోగలిగారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారాస యువజన సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అమరుల త్యాగం వల్ల వచ్చిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌, వారి త్యాగాలను గుర్తించాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనపై 350 కేసులు ఉన్నాయని, జైల్లో పెట్టినా వెనక్కి తగ్గలేదని చెప్పారు. ఉద్యమ సమయంలో తాము జై తెలంగాణ అని నినాదాలు చేస్తుంటే.. జై తెలంగాణ అంటే కాల్చేస్తా అంటూ రేవంత్‌రెడ్డి కారులో తుపాకీ పెట్టుకుని తిరిగారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా జై తెలంగాణ అనడంలేదని, అమరుల స్తూపం వద్ద పూలు కూడా పెట్టడం లేదన్నారు. ఇప్పటికైనా స్తూపం వద్ద నివాళులు అర్పిస్తే అమరుల ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం పట్టించారని, మరో నాలుగేళ్లు ఈ ప్రభుత్వాన్ని భరించగలమా అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. భాజపాకు కాంగ్రెస్‌ సహకరిస్తోందని.. ఈ రెండు పార్టీలు కలిసి భారాసను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, చేవెళ్ల స్థానాల్లో కాంగ్రెస్‌ బలమైన అభ్యర్థులను పెట్టకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో భారాస మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని