జగన్‌ ఓటును పులివెందులలో ఎలా కొనసాగిస్తారు?

సొంత నియోజకవర్గంలో కాకుండా వేరేచోట నిద్రిస్తున్నందుకు ఓట్లు తొలగించాల్సి వస్తే... అయిదేళ్లుగా పులివెందులను వదిలేసి తాడేపల్లిలో ఉంటున్న సీఎం జగన్‌, ఆయన భార్య భారతిరెడ్డి ఓట్లే ముందు తొలగించాలని తెదేపా నేతలు కోరారు.

Published : 14 Apr 2024 05:23 IST

వాలంటీర్లను కించపరిచిన ధర్మానపై చర్యలు తీసుకోండి
సీఈఓకు తెదేపా నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సొంత నియోజకవర్గంలో కాకుండా వేరేచోట నిద్రిస్తున్నందుకు ఓట్లు తొలగించాల్సి వస్తే... అయిదేళ్లుగా పులివెందులను వదిలేసి తాడేపల్లిలో ఉంటున్న సీఎం జగన్‌, ఆయన భార్య భారతిరెడ్డి ఓట్లే ముందు తొలగించాలని తెదేపా నేతలు కోరారు. విద్యార్థులతో వైకాపా కోసం ఎన్నికల సర్వేలు చేయిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాదరెడ్డిని సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. వాలంటీర్లను కించపరిచేలా మాట్లాడిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కేసు నమోదు చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కేఎస్‌ జవహర్‌ తదితరులు శనివారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. ‘‘విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీచేస్తున్న బొండా ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యుల ఓట్లను తొలగించాలని కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పోటీచేస్తున్న నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గంలో నిద్రించడమే ఓట్ల తొలగింపునకు కారణంగా వారు చెబుతున్నారు. వాస్తవానికి ఆయనకు విజయవాడ సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గాల్లో ఇళ్లు ఉన్నాయి. ఓట్లు తొలగించాల్సి వస్తే మొదట జగన్‌ దంపతులవే తొలగించాలి’’ అని వర్ల రామయ్య స్పష్టంచేశారు. ‘‘కొందరు వాలంటీర్లు వైకాపాపై బురద జల్లుతున్నారు. వాళ్లను రాజీనామా చేయాలని చెప్పండి. లేకపోతే ఉద్యోగాల్లోంచి మనమే తీసేద్దాం’’ అంటూ మాట్లాడిన ధర్మాన ప్రసాదరావుపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరినట్టు వర్ల రామయ్య తెలిపారు. పొన్నూరులో సీఎం సహాయనిధి చెక్కుల్ని పంచుతున్న వైకాపా అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండు చేశారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని కేఎస్‌ జవహర్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని