హామీ ఇచ్చినా.. మంత్రదండంతో పనులు చేయలేం కదా!

‘హామీ ఇచ్చిన వెంటనే విఠలాచార్య సినిమాలో మాదిరి మంత్రదండంతో అభివృద్ధి పనులు చేయలేం. ప్రాధాన్యం బట్టి చేస్తుంటాం’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అసహనం వెలిబుచ్చారు.

Published : 14 Apr 2024 05:26 IST

వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘హామీ ఇచ్చిన వెంటనే విఠలాచార్య సినిమాలో మాదిరి మంత్రదండంతో అభివృద్ధి పనులు చేయలేం. ప్రాధాన్యం బట్టి చేస్తుంటాం’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అసహనం వెలిబుచ్చారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులోని వైకాపా కార్యాలయంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. కందుకూరు నియోజకవర్గంలో రాళ్లపాడు ఎడమ కాలువ, ఉత్తర బైపాస్‌ ఏర్పాటుచేస్తామని విజయసాయిరెడ్డి పేర్కొనడంతో.. విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. 22 నెలల కిందట ముఖ్యమంత్రి జగన్‌ రామాయపట్నం పోర్టు భూమి పూజకు వచ్చినప్పుడు ఇవే హామీలిచ్చారని, నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తుచేశారు. నేటికీ నిధులు విడుదల కాలేదని.. మళ్లీ అవే హామీలిస్తున్నారని వివరించారు. దీంతో ఉలిక్కిపడిన విజయసాయిరెడ్డి.. హామీ ఇచ్చిన వెంటనే మంత్రదండంతో చేయలేమని సమాధానమిచ్చారు. విలేకరులు వెంటవెంటనే ప్రశ్నలు వేస్తుండడంతో సహనం కోల్పోయిన ఆయన సమావేశానికి విఘాతం కల్పించడానికి వచ్చారా? అంటూ నిట్టూర్చారు. హామీలు 99 శాతం పూర్తి చేశామని, కొందరు విలేకరులు కావాలనే ఇలా మాట్లాడుతున్నారని పేర్కొంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని