వైకాపాలో వైఎస్‌ఆర్‌ ఎక్కడ?

‘వైకాపాలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నారా? ఏదీ ఎక్కడా కనిపించడం లేదేం? చివరికి ప్రభుత్వ పథకాల్లోనూ వైఎస్‌ఆర్‌ను కనుమరుగు చేసేస్తున్నారేం? ఇప్పుడు మీ పార్టీలో వైఎస్‌ఆర్‌ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అయిపోయింది.

Published : 14 Apr 2024 05:26 IST

ప్రభుత్వ పథకాల్లోనూ కనుమరుగు చేస్తున్నారు
మీలా కాదు నేను వైఎస్‌ పేరుతోనే పార్టీ పెట్టాను
వివేకా హత్యపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి
సొంత జిల్లా బస్సు యాత్రలో షర్మిల డిమాండు

ఈనాడు, కడప: ‘వైకాపాలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్నారా? ఏదీ ఎక్కడా కనిపించడం లేదేం? చివరికి ప్రభుత్వ పథకాల్లోనూ వైఎస్‌ఆర్‌ను కనుమరుగు చేసేస్తున్నారేం? ఇప్పుడు మీ పార్టీలో వైఎస్‌ఆర్‌ అంటే వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అయిపోయింది. వీళ్లు నా గురించి పెద్ద.. పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి మూసేశానట. ఆంధ్ర నాకు పుట్టినిల్లు. తెలంగాణ మెట్టినిల్లు. తెలంగాణలో కేసీఆర్‌ నియంత పాలనకు వ్యతిరేకంగా పార్టీ పెట్టా. అక్కడ వైఎస్‌ఆర్‌ పేరుతోనే స్థాపించా. మీలాగా ‘యువజన శ్రామిక రైతు పార్టీని’ వైఎస్‌ఆర్‌ అని చెప్పుకోవడం లేదు’ అని పీసీసీ అధ్యక్షురాలు, ఆ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల వివరించారు. వైయస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సభల్లో షర్మిల ప్రసంగించారు. తెలంగాణలో పోటీ చేసే పక్షంలో కేసీఆర్‌ లబ్ధి పొందుతారని అంచనా వేశా.. అందుకే కాంగ్రెస్‌లో విలీనం చేశాను. ఆ పార్టీ బతికి ఉన్నంత కాలం వైతెపా బతికే ఉంటుంది. అధికారం, ముఖ్యమంత్రి పీఠం కోసం ఇక్కడికి రాలేదు. కాంగ్రెస్‌కు ఊపిరి పోయాలనే వచ్చాను’ అని వివరించారు. ప్రజల కోసం, విభజన హామీల సాధన కోసం ఇక్కడ అడుగుపెట్టానని, జగనన్న మోసాలపై పోరాటానికి వచ్చానని తెలిపారు. ‘కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా హామీ పట్టుకుని ఇక్కడ అడుగుపెట్టా.. రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి జగన్‌ హత్యా రాజకీయాలు చేస్తున్నారు. హంతకులకు కంచె వేసి కాపాడుతున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా?’ అని ప్రశ్నించారు. వివేకా హత్యపై రాష్ట్ర ప్రజలకు జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ఇక మీదట కడపలో హత్యల వాతావరణం లేకుండా ఉండేందుకే పోరాటం సాగిస్తున్నామని, హంతకులకు శిక్ష పడేవరకు విశ్రమించబోమని స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రాంతానికి చేరుకుని, పరిశీలించిన షర్మిల.. ఈ పరిశ్రమ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తన ప్రచారంతో జగన్‌కు వణుకు పుట్దిందని.. అవినాష్‌రెడ్డి స్థానంలో మరొకరని నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.

విమలారెడ్డి మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో!

వివేకా హంతకులపై పోరాటం ఆగదని ఆయన కుమార్తె సునీత స్పష్టం చేశారు. నిందితులకు శిక్షపడే వరకు విశ్రమించనని తెలిపారు. కడపలో ఇకపై ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తావుండరాదని, వివేకా ఘటన ఓ గుణపాఠంగా చేస్తానని వివరించారు. హంతకులు చట్టసభల మెట్లెక్కకుండా చేద్దామని.. అందుకే షర్మిలను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. ‘కొత్తగా మా మేనత్త విమలారెడ్డి తెరపైకి వచ్చారు. ఆమెకు ఏమైందో తెలియదు.. మాపై ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు’ అని అన్నారు.


కాంగ్రెస్‌లో చేరిన పి.గన్నవరం వైకాపా ఎమ్మెల్యే

వైకాపాకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. ముద్దనూరు సభలో షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్‌ వ్యవహార శైలి నచ్చకనే పార్టీని వీడినట్లు ఎమ్మెల్యే తెలిపారు.


అమెరికా వెళ్లిపోయిన విజయమ్మ

రాష్ట్రంలో కీలకమైన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం జగన్‌ తల్లి వై.ఎస్‌.విజయమ్మ అయిదు రోజుల క్రితం అమెరికాకు వెళ్లిపోయారు. ఇది రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాశమైంది. అక్కడ ఉన్న షర్మిల తనయుడు రాజారెడ్డి దగ్గరకు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ఉంటే కుమారుడు జగన్‌ నుంచి ఎన్నికల ప్రచారానికి ఒత్తిడి వస్తుందనే ఉద్దేశంతో వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.


వివేకా హత్యపై మరోసారి మాటలయుద్ధం

ఈనాడు, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు జిల్లాలో మరోమారు తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన హత్యతో అంతిమంగా లబ్ధి పొందిన జగన్‌.. నేరస్థులను కాపాడుతున్నారంటూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీతలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్‌కు మద్దతుగా ఆయన మేనత్త వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరి విమలారెడ్డి రంగంలోకి దిగారు. బహిరంగ సభల్లో షర్మిల, సునీతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమలారెడ్డి శనివారం ఓ వీడియో విడుదల చేశారు. షర్మిల, సునీతలు చేస్తున్న పనులతో తమ కుటుంబ సభ్యులంతా ఏడుస్తున్నారన్నారు. వివేకాను అవినాష్‌రెడ్డి హత్య చేయడాన్ని వారు చూశారా అంటూ ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో వీళ్లే ఖరారు చేసేస్తే.. ఇక కోర్టులు, జడ్జిలు ఎందుకని ప్రశ్నించారు.

ఆర్థిక లబ్ధితోనే అనుకూలంగా మాట్లాడుతున్నారు: షర్మిల

విమలారెడ్డి వ్యాఖ్యలపై షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ మేనత్త విమలారెడ్డి కుమారుడికి జగన్‌ రూ.కోట్లల్లో కాంట్రాక్టు పనులు ఇవ్వడంతో వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమ మేనత్త విమలారెడ్డికి వయసు పైపడి, ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. సీబీఐ అన్ని ఆధారాలూ చూపినందునే అవినాష్‌రెడ్డి నిందితుడని తాము ఆరోపిస్తున్నామని చెప్పారు. విమలారెడ్డికి వివేకానందరెడ్డి ఎంత మేలు చేశారో గుర్తుకు రాలేదా అంటూ నిలదీశారు. తాను, సునీత ఎందుకు పోరాటం చేస్తున్నామో ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు