ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైకాపా కుట్ర

ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, ఏం చేసినా కూటమిదే ఘన విజయమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Published : 14 Apr 2024 05:27 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, ఏం చేసినా కూటమిదే ఘన విజయమని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కుంచనపల్లి వద్ద ఉన్న అపార్ట్‌మెంట్‌వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అయిదేళ్ల అరాచక పాలనలో నరకం చూసిన ప్రజలు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అలజడి సృష్టించి పోలింగ్‌ ఆలస్యం అయ్యేలా చేస్తారని, ఇలాంటి కుట్రలను ప్రజలు గమనించి ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. అప్పులు చేసి ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కియా, హెచ్‌సీఎల్‌ వంటి పరిశ్రమలు రప్పించడంతో లక్షలమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. విశాఖలో రూ.500 కోట్లతో నిబంధనలకు విరుద్ధంగా జగన్‌ విలాసవంతమైన ప్యాలెస్‌ నిర్మించుకున్నారని, ఆ నిర్మాణానికి అనుమతులు లేని కారణంగా కేంద్రం రూ.200 కోట్లు జరిమానా విధించిందన్నారు. ఈ డబ్బుతో మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చన్నారు. ప్రతి జిల్లాలో ఉన్న వనరుల ఆధారంగా పలు రకాల పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తామని, విశాఖలో ఐటీ, శ్రీకాకుళంలో ఫార్మా, గోదావరి జిల్లాల్లో ఆక్వా, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్‌, అనంతపురంలో ఆటోమొబైల్స్‌, డిఫెన్స్‌ పరికరాల పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీనిద్వారా రాష్ట్రంలో సంపద రెండున్నర రెట్లు పెరుగుతుందన్నారు. ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని పేదలకు అందిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని