ప్రజాప్రభుత్వ ఏర్పాటే కూటమి ఎజెండా

తెదేపా, జనసేన, భాజపాల జెండాలు వేరైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడమే కూటమి ఎజెండా అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

Published : 14 Apr 2024 05:27 IST

‘నిజం గెలవాలి’ ముగింపు సభలో నారా భువనేశ్వరి

తిరువూరు, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపాల జెండాలు వేరైనా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడమే కూటమి ఎజెండా అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో శనివారం జరిగిన ‘నిజం గెలవాలి ప్రజాప్రభుత్వం రావాలి’ పేరుతో జరిగిన ముగింపు సభలో ఆమె మాట్లాడారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ప్రతి ఒక్కరూ కూటమితో నడవాలన్నారు. ఒక సైనికుడిలా రాష్ట్రాన్ని నడిపించేందుకు చంద్రబాబు లాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓటు అనే ఆయుధంతో వైకాపాను ఓడించాలని, తెదేపా విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్రమ అరెస్టు అనంతరం చంద్రబాబు తనకు ‘నిజం గెలవాలి’ కార్యక్రమ బాధ్యత అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెదేపా కుటుంబాలను కలిసే అవకాశం కల్పించారని తెలిపారు. సెప్టెంబరు 9వ తేదీని తన జీవితంలో మరచిపోలేనని, అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లిన విషయాన్ని తమ పెళ్లిరోజైన 10న లోకేశ్‌ ఫోన్‌ చేసి చెప్పడంతో తనకేమీ అర్థం కాలేదన్నారు. రాజమహేంద్రవరం జైలుకు ములాఖత్‌ కోసం వెళ్లిన సమయంలో అక్కడ చంద్రబాబును చూసిన తన కళ్లు చెమర్చాయని తెలిపారు. జైలు శిక్ష అనుభవిస్తూ కూడా ప్రజల గురించే ఆలోచించారని, మృతుల కుటుంబాలను కలిసి భరోసా ఇవ్వాలని ఆయన చేసిన సూచన మేరకు ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమం చేపట్టానన్నారు. రాజమహేంద్రవరం వెళ్లగానే తమకు ఇంటిని ఇచ్చిన దాతకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమం ద్వారా లక్షలమందికి ఉపాధి కల్పించారన్నారు. తానున్నా లేకున్నా తాను చేసిన అభివృద్ధి శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకునే ఏకైక నాయకుడు ఆయన ఒక్కరే అన్నారు. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల్లో కూడా పోలవరం, అమరావతి, పట్టిసీమ, కియా సంస్థ ఏర్పాటు వంటి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే భరోసా ఉంటుందన్న నమ్మకంతోనే అక్రమ అరెస్టు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతోపాటు 80 దేశాల్లోని తెలుగువారు మద్దతు తెలిపారన్నారు. మహిళలను లాఠీలతో కొట్టినా చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు తెలిపారని, వారందరికీ రుణపడి ఉంటానన్నారు. లోకేశ్‌ యువగళం పాదయాత్ర చేపడతానని చెబితే..ఈ రాక్షస ప్రభుత్వం ఏదైనా చేస్తుందని భయపడ్డానని, తాను ఇంట్లో ఉన్నా చంపాలనుకుంటే చంపేస్తారని ప్రజల మధ్యలో ఉంటానని బయల్దేరిన తన కుమారుడిని ఆశీర్వదించినట్లు తెలిపారు. నిజం గెలవాలి కార్యక్రమం సందర్భంగా ఆయావర్గాల ప్రజలను కలిసిన సందర్భంలో.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలు చెబుతుంటే ఆశ్చర్యమేసిందన్నారు.  పథకాల పేరు చెప్పి వైకాపా నాయకులు ప్రజల సొమ్ము దోచుకుని జేబులు నింపుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ముందుచూపుతో ఐటీ రంగం గురించి చెబితే నవ్వారని, ఈరోజు హైటెక్‌ సిటీ ద్వారా లక్షలమంది ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. అన్నదాతలు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి 30 వేల ఎకరాలు రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇస్తే వైకాపా ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని దుయ్యబట్టారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా తనను కించపరిచేలా ఈ ప్రభుత్వం మాట్లాడిందని, దేవాలయం లాంటి శాసనసభలో ఒక స్త్రీ గురించి హేళనగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. నిమిషంపాటు తాను బాధపడినా..తాను ఎలాంటి వ్యక్తినో ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. తన తల్లిదండ్రుల సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగానని, తన తల్లి కుటుంబ విలువలు నేర్పించారన్నారు. ఇటీవల విశాఖలో 20 వేల కిలోల డ్రగ్స్‌ దిగుమతి చేసిన వైకాపా ప్రభుత్వం యువతను మత్తుకు బానిసలుగా చేయాలని చూసిందన్నారు. కార్యకర్తల సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని, ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా 60,449 మంది కార్యకర్తల పిల్లలు విద్యనభ్యసించారని భువనేశ్వరి పేర్కొన్నారు.


భువనేశ్వరికి చంద్రబాబు అభినందనలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపాకు ప్రాణం, బలం కార్యకర్తలేనని... తమ కుటుంబం కంటే పార్టీకి ప్రాధాన్యమిచ్చే కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిర్వహించిన ‘నిజం గెలవాలి’ యాత్ర శనివారం విజయవంతంగా ముగియడంపై ఎక్స్‌ వేదికగా సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆరు నెలల్లో 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 9,079 కి.మీ. దూరం భువనేశ్వరి ప్రయాణించారు. సుమారు 203 కుటుంబాలను కలిశారు’ అంటూ యాత్ర విశేషాల్ని పోస్టు చేశారు.

కార్యకర్తల కుటుంబాలకు ‘నిజం గెలవాలి’ యాత్రతో భువనేశ్వరి అండగా నిలిచారని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ తెలిపారు. ‘గతేడాది అక్టోబర్‌ 25న చిత్తూరులో ప్రారంభమైన యాత్ర...శనివారం తిరువూరులో ముగిసింది. ఆరు నెలల్లో 14 విడతలుగా 47 రోజులు యాత్ర సాగింది. చనిపోయిన ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం, వారి పిల్లలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఉచితవిద్య హామీ ఇచ్చారు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని