తిక్కలోడి మూడు ముక్కలాటకు రాష్ట్రం బలైంది

‘రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరు. జగన్‌ లాంటి రాక్షసులు వందమంది వచ్చినా ఒక్క ఇటుకనూ తొలగించలేరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ముమ్మాటికీ అమరావతే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Updated : 14 Apr 2024 07:04 IST

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ముమ్మాటికీ అమరావతే
అమరావతికి మద్దతిచ్చిన వారికే ఓటు అని నినదించాలి
తాడికొండ, ప్రత్తిపాడు ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరు. జగన్‌ లాంటి రాక్షసులు వందమంది వచ్చినా ఒక్క ఇటుకనూ తొలగించలేరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ముమ్మాటికీ అమరావతే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాజధాని ప్రాంతంలోని తాడికొండ, ప్రత్తిపాడు ప్రజాగళం సభల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలకు హాజరైనవారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ‘ఇది తాడికొండ కాదు. రాష్ట్ర రాజధాని  అమరావతికి వచ్చి రాష్ట్రం నడిబొడ్డు నుంచి, అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నాను. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆశ అమరావతి. అమరావతి రాజధానిగా ఉంటుందని తాడికొండలో ప్రకటిస్తున్నాను. మరో 30 రోజుల్లో పోలింగ్‌ జరుగుతుంది. మీరు లిఖించబోయే చరిత్ర కళ్లముందు కనిపిస్తోంది. ప్రజాభిమానం చూస్తుంటే జగన్‌రెడ్డికి సింగిల్‌ డిజిట్‌ దాటే పరిస్థితి లేదు. జూన్‌ 4న సగర్వంగా అమరావతే రాజధాని అని మీరు ఉత్సవాలు చేసుకోండి. అదేరోజు జగనాసుర వధ జరుగుతుంది. ప్రజలు గెలవాలి.. జగన్‌ పోవాలి అనే నినాదంతో జనం ముందడుగు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

జగన్‌రెడ్డి అరాచకానికి ప్రజలంతా బాధితులే

‘రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? అదే రాజధాని అమరావతి వచ్చి ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందేది. జగన్‌రెడ్డి అరాచకానికి ప్రజలంతా బాధితులే. మీ పొట్ట కొట్టిన ఫ్యాన్‌ని చిత్తు చిత్తు చేసి చెత్త కుప్పలో పడేయాలి. రాజధాని అమరావతికి కట్టుబడి ఉండని పార్టీల అభ్యర్థులను బహిష్కరించాలి. అమరావతి ద్రోహుల్ని తరిమికొడదాం’ అని పిలుపునిచ్చారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, కర్నూలును అభివృద్ధి చెందిన నగరంగా చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

కూటమి అభ్యర్థులను గెలిపించాలి

తనకు జతగా పట్టుదల, తపన ఉండే పవన్‌కల్యాణ్‌, కేంద్రంలో అధికారంలోకి రానున్న ఎన్డీయే ప్రభుత్వం కలిసి వస్తుంటే జగన్‌ నిలుస్తారా? అని ప్రశ్నించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ‘ప్రజాగళం సభలకు వస్తున్న జనాలను చూస్తే జగన్‌కు నిద్ర రాదు. నేను సీఎంగా కొనసాగితే 2020లో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. పెన్నా, గోదావరి అనుసంధానం చేయాలని భావించాను. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతు లాంటి జగన్‌రెడ్డిని గెలిపించుకున్నారు. ఇప్పుడు ప్రజలంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు’ అని వ్యాఖ్యానించారు.

భవనాలకు రంగులేస్తే చదువు వస్తుందా?

‘విద్యావ్యవస్థను జగన్‌ పూర్తిగా నాశనం చేశారు. పాఠశాల భవనాలకు రంగులేస్తే చదువొస్తుందా? రాష్ట్ర విభజన సమస్యలున్నా ఉద్యోగులకు 43% పీఆర్సీ ఇచ్చాం. జగన్‌ మాత్రం ఉద్యోగులకు పీఆర్సీ డీఏ, టీఏలు ఇవ్వలేదు. దాచుకున్న పీఎఫ్‌ డబ్బులు వచ్చాయా? 26వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇచ్చారా? మెజారిటీ పోలీసులు మనస్సు చంపుకొని పనిచేశారు. మళ్లీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. 6లక్షల మంది విద్యార్థులకు బోధన రుసుం చెల్లించలేదు. పీజీ విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిపివేశారు. అమరావతిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రూ.4-5లక్షల కోట్లను జగన్‌ దూరం చేశారు. మన ఆలోచనలు, కష్టం నుంచే సంపద వస్తుంది. సంపద సృష్టించి పేదలకు పంచి ప్రజల ఆదాయాలు పెంచే విధానాన్ని తీసుకొస్తా’ అని తెలిపారు.

జగన్‌ విఫల సీఎం

‘సీఎం జగన్‌ అయిదేళ్ల పాలనలో 99% సమస్యలు పరిష్కరించానంటున్నా, ప్రజలు మాత్రం సున్నా మార్కులు వేశారు. జగన్‌ విఫల సీఎం. రాష్ట్రాభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రజాగళం సభకు రోడ్డుపై కారులో వస్తుంటే ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఉంది. జన్మభూమి మీద ప్రేమ, భవిషత్తుపై ఆశ ఉంటే ప్రజలంతా వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేసి ఎన్డీయే అభ్యర్థులను గెలపించాలి’ అని చంద్రబాబు కోరారు.

ప్రజావేదిక నిర్మాణంతోనే పాలన ప్రారంభిస్తా

‘అయిదేళ్లలో ఏనాడైనా జగన్‌ ఏసీ బస్సులో నుంచి బయటకు దిగారా? ప్రజలను కలిశారా? ఎన్నికల ముందు బస్సుయాత్ర అంటూ ఏసీ బస్సుకు అడ్డు వస్తున్నాయని చెట్లన్నీ నరికేస్తున్నారు. రాష్ట్రంపై కక్ష తీర్చుకోవడానికే జగన్‌ సీఎం అయ్యారు. నేను నిర్మాణాలు చేస్తే, జగన్‌ విధ్వంసకర పాలన చేశారు. నేను సీఎం అయిన తొలిరోజే ప్రజావేదిక నిర్మాణాన్ని ప్రారంభిస్తా. రాష్ట్రాన్ని పునర్నిర్మించి పూర్వ వైభవం తీసుకొస్తా. హైదరాబాద్‌, చెన్నైలోని మద్యం బ్రాండ్లు ఏపీలో దొరక్కపోవడానికి చిదంబర రహస్యం తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంది’ అని ఎద్దేవా చేశారు.

ప్రజలే ధర్మాన భరతం పడతారు

ఎన్నికల్లో గెలిచి తామే అధికారంలోకి వస్తామని, వాలంటీర్లు రాజీనామా చేయొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. వాలంటీర్లపై శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు బెదిరింపులకు దిగారని, ఆ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ధర్మాన భరతాన్ని ప్రజలు పడతారన్నారు. గుంటూరు వైకాపా ఎంపీ అభ్యర్థి మట్టి దొంగ అని ఆరోపించారు.

తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ

ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు చెందిన తన అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నిస్వార్థంగా వైకాపాకు సేవ చేసిన తనకు అక్కడ అన్యాయం జరిగిందన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, తాడికొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్‌కుమార్‌, ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.


సైబరాబాద్‌ తరహా అభివృద్ధి కోసం రూపకల్పన

‘1995లో హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ ప్రారంభించే సమయంలో అక్కడ ఎకరా రూ.లక్ష మాత్రమే. ఇప్పుడు ఎకరా రూ.100 కోట్లు పలుకుతోంది. ఏకంగా 10వేల రెట్లు పెరిగింది. అమరావతినీ అలాగే నిర్మించేందుకు రూపకల్పన చేస్తే మూడు ముక్కలాట అంటూ అమరావతిని నాశనం చేశారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలు ఉండగా సైబరాబాద్‌ని నిర్మించి ట్రై సిటీగా మార్చి అభివృద్ధి చేసి చూపించాను. అదే స్ఫూర్తితో విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి అమరావతి మహానగరాన్ని నిర్మించాలనుకున్నాను. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, విశ్వాసం. అమరావతి అభివృద్ధి కోసం చేసిన ప్రణాళికలను తిక్కలోడు జగన్‌ చెడగొట్టారు. రాజధాని కోసం తీసుకొచ్చిన మట్టి, ఇతర సామగ్రిని దొంగిలించారు. వారిలో ఓ ఎంపీ ఉన్నారు’ అని చంద్రబాబు ఆరోపించారు.


పాసుపుస్తకాలపై జగన్‌ ఫొటోలేంటి?

‘ప్రజల భూమిని జగన్‌ తన పేరు మీద రాసుకుంటున్నారు. రైతుల పాస్‌పుస్తకం, సరిహద్దు రాళ్లపై జగన్‌ ఫొటోలు ఏంటి?జగన్‌ ఏమైనా భూములు కొని ప్రజలకు ఇచ్చారా? వైకాపా ప్రభుత్వం తెచ్చిన భూమి హక్కు చట్టంలో భూముల యజమానులకు అప్పీలు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తి కూడా గోవిందా’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమని జగన్‌ ప్రకటించాలని సవాల్‌ విసిరారు. తెదేపా సూపర్‌-6 హామీలు ఎలా ఇస్తారని తనను జగన్‌ ప్రశ్నిస్తున్నారని, వంద సంక్షేమ పథకాలు తెదేపా ఇస్తే, వైకాపా నవమోసాలు, నకిలీ రత్నాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు