బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా?

‘నిన్న జగన్‌పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను.

Updated : 15 Apr 2024 07:08 IST

గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా?
జగన్‌ ప్రభుత్వంలో అందరూ బాధితులే
గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం

ఈనాడు, విశాఖపట్నం: ‘నిన్న జగన్‌పై పడింది చీకట్లో గులకరాయి. ఇప్పుడు నాపై పడింది వెలుగులో రాయి. ముఖ్యమంత్రి వెళుతుంటే కరెంటు ఉండదా? ఎవరికి నేర్పిస్తారు ఈ డ్రామాలు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఆవలిస్తే పేగులు లెక్కపెడతా. నాకు రాజకీయాలు నేర్పిస్తారా జగన్‌? మీ సభలకు ప్రజలు రావడం లేదు, మీరంటే అసహ్యించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా అని బాధితులంతా ఒక్కటయ్యారు. రాష్ట్రంలో అందరం జగన్‌ బాధితులమే. నేనూ బాధితుడినే’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విశాఖ జిల్లా గాజువాకలో ప్రజాగళం సభ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ‘ఇక్కడ రాళ్లు వేశారు... చూశారా? రేయ్‌ మీ అందరినీ ఈ ప్రజలు వదిలిపెట్టరు. రేపటి నుంచి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌ ఇక్కడికీ వచ్చింది. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, ప్రజలు తిరగబడి కొడతారు’ అని చంద్రబాబు గట్టిగా హెచ్చరించారు. సీఎం జగన్‌పై విజయవాడలో రాయి విసిరిన తర్వాత జరిగిన పరిణామాలపై చంద్రబాబు తన ప్రసంగంలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు.

పరిపాలనంటే ఏమిటో చూపిస్తా

‘మొన్న ఒక ఘటన జరిగింది, దాన్ని అందరం వ్యతిరేకించాం. విమానాశ్రయంలో నాకు సమాచారం రాగానే జగన్‌పై జరిగిన దాడిని ఖండించా. కానీ జగన్‌ అరగంటలోపే అక్కడే నా ప్లకార్డులు చూపించి, నేనే రాయి వేయించానని, దోషినని ప్రచారం చేశారు. మీ మీద గులకరాయి వేయించామా? మీ పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యండి.. గంటలో పరిపాలన ఎలా చేయాలో చేసి చూపిస్తా. ఆ సత్తా, చేసి చూపించిన ట్రాక్‌ రికార్డు ఉన్నాయి. కోడి కత్తి డ్రామా చేసి, ఇప్పుడు ఎవరో గులక రాయి వేస్తే.. నేను వేయించానట. ఆ గులకరాయి వంకతో, నాపై రాళ్లు వేస్తారా? బాంబులు వేస్తేనే భయపడలేదు నేను. రాళ్లకు భయపడతానా?’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.

చర్యలు ఎందుకు తీసుకోలేదు?

‘గతంలో నేను విశాఖ వచ్చినప్పుడు బయటకు రాకుండా వైకాపా గూండాలు అడ్డుకుంటే పోలీసులు చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించి నన్ను తిప్పి పంపారు. అమరావతిలోని రైతుల సభకు సంఘీభావంగా వెళ్తే వైకాపా రౌడీలు చెప్పులు, రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఆ రోజు డీజీపీ సమాధానం చెబుతూ.. ‘చంద్రబాబు అంటే వ్యతిరేకత ఉంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపొచ్చు. రాళ్లతో దాడి చేయచ్చు’ అని సిగ్గులేకుండా మాట్లాడారు. మా ఇంటికి ఓ ఎమ్మెల్యే రాళ్లు, కర్రలతో దాడికి వస్తే దాన్ని అడ్డుకుంటే నాపైనే కేసులు పెట్టి ఆ ఎమ్మెల్యే నా అపాయింట్‌మెంట్‌ కోసం వచ్చారన్నారు. ఎక్కడికి వెళ్లినా నాపై రాళ్లదాడి చేశారు. పవన్‌ కల్యాణ్‌పైన, నాపైన రాళ్లు వేస్తేనో, ప్రధాని వచ్చినప్పుడు మైకులు కట్‌చేస్తేనో మేం భయపడిపోతామా? టవర్లు ఎక్కితే దిగాలని ప్రధాని కోరారు. పోలీసులకు బాధ్యత లేదా? ఎందుకు అప్పుడు అధికారులపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నా. నిన్న కరెంటు సరఫరా తీసేసిన వారిపై, గులకరాయి వేసిన వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? గులకరాయి ఎవరు వేశారో చెప్పాలి కదా? 24 గంటలు అయింది. సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌కు బాధ్యత లేదా? నాపై రాయి వేయించి పైశాచిక ఆనందం పొందుతారా? మీపై గులక రాయివేస్తే కొంపలు కూలినట్లు మాట్లాడతారా? రాయి వేయడాన్ని నేను సమర్థించను. అయినా జగన్‌ రోడ్డుపైకి రాగానే కరెంటు పోయిందట. ఇది ఎవరి వైఫల్యం? ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? బాధ్యత ఎవరిది?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రభుత్వ సహకారం లేకుండా జరుగుతుందా?

‘ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖను తెదేపా అభివృద్ధి చేస్తే ఇప్పుడు గంజాయి కేంద్రంగా వైకాపా మార్చేసింది. విశాఖ పోర్టు ద్వారా 25వేల కేజీల డ్రగ్స్‌ దిగుమతి అవుతూ పట్టుబడ్డాయి. ప్రభుత్వ సహకారం లేకుండా అంత ధైర్యంగా డ్రగ్స్‌ తెస్తారా? ఇందులో ఈ రాష్ట్రప్రభుత్వమే దోషి’ అన్నారు.

14 ఏళ్లు చేసిన అభివృద్ధిని అయిదేళ్లలో చూపిస్తా

‘14 ఏళ్లు సీఎంగా ఉన్న నాలో కసి, పట్టుదల పెరుగుతున్నాయి. 14 ఏళ్లలో చేసిన అభివృద్ధిని అయిదేళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటా. కూటమిలోని మూడు పార్టీలదీ ఒకటే మాట. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే లక్ష్యం. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమి నేను రద్దుచేయను. ఇప్పుడు రానివారికి రెండు సెంట్లు ఇస్తాం. ఇళ్లు పూర్తికాకపోతే పూర్తిచేయిస్తాం. విశాఖలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తాను. విశాఖ స్టీలుప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటా’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.


ఈ తప్పు ఎవరిది?

‘నా సెక్యూరిటీ సిబ్బంది ఒక విషయం చెప్పారు. విజయవాడలో ఓ చిన్న కుటుంబం. యజమాని సెలూన్‌ దుకాణం నిర్వహిస్తారు. ఆయన భార్య ప్రైవేటు కంపెనీలో పనిచేస్తారు. ఇద్దరూ కలిసి నెలకు రూ.25-30వేలు సంపాదిస్తారు. 8వ తరగతి చదువుతున్న వారి కుమారుడిని ఆ కాలనీలో కొందరు గంజాయికి బానిస చేశారు. ఆ బాబును హైదరాబాద్‌ తీసుకెళ్లి రూ.5లక్షలతో చికిత్స అందించినా లాభం లేకపోయింది. ఆ విద్యార్థి రోడ్డుపై పోయేవాళ్లపై దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కుంటూ దొరికి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో గంజాయి తీవ్రతను ముఖ్యమంత్రి నివారించి ఉంటే ఆ విద్యార్థి అలా తయారయ్యేవాడా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని