తుక్డే ముఠాల సుల్తాన్‌ కాంగ్రెస్‌

దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ముఠాలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం (తుక్డే తుక్డే గ్యాంగ్‌ సుల్తాన్‌) వహిస్తోందని భాజపా అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Updated : 15 Apr 2024 06:13 IST

కర్ణాటక నుంచి ఆ పార్టీకి భారీగా నల్లడబ్బు
మైసూరు సభలో ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు

మైసూరు, న్యూస్‌టుడే: దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న ముఠాలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం (తుక్డే తుక్డే గ్యాంగ్‌ సుల్తాన్‌) వహిస్తోందని భాజపా అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో తన అభ్యర్థులకు ఇక్కడి నుంచే పెద్ద మొత్తంలో నల్లధనాన్ని తరలిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దిల్లీలో కాంగ్రెస్‌ నేతలకు ‘కర్ణాటక ఏటీఎం’గా మారిందని దుయ్యబట్టారు. రాచనగరి మైసూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల విజయసంకల్ప ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్యారంటీ పథకాల పేరిట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కాంగ్రెస్‌ లూటీ చేస్తోందన్నారు. ‘భారత్‌ మాతాకీ జై’ అనేందుకూ కాంగ్రెస్‌ అనుమతి తీసుకోవాలా అని ఓటర్లను ప్రశ్నించారు. ‘తుక్డే తుక్డే పార్టీ’కి దేశాన్ని విభజించడమే ఏకైక లక్ష్యంగా మారిందని దుయ్యబట్టారు. వారికి ప్రజలు గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉందంటూ నిప్పులు చెరిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారిని అధికార పీఠం నుంచి దూరంగా ఉంచాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, కుమారస్వామి తదితరులు సభలో పాల్గొన్నారు. మోదీకి భాజపా నాయకులు రెండున్నర అడుగుల ఎత్తైన సీతా రామలక్ష్మణుల దారు శిల్పాన్ని, మైసూరు తలపాగా, పట్టువస్త్రం, హారాన్ని బహూకరించారు.

మంగళూరులో భారీ రోడ్‌ షో

కర్ణాటకలోని మంగళూరులో ప్రధాని మోదీ భారీ రోడ్‌ షో నిర్వహించారు. మైసూరు నుంచి నేరుగా అక్కడకు వెళ్లిన ఆయన ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిలుచుని ప్రజలకు అభివాదం చేశారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు బిగ్గరగా నినాదాలు చేయడంతో నగర వీధులు ప్రతిధ్వనించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని