నాగ్‌పుర్‌లో హ్యాట్రిక్‌పై గడ్కరీ గురి

సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నియోజకవర్గం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపాలో ప్రధానమంత్రి పదవి విషయంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది భావించే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇక్కడ పోటీ చేస్తుండటమే అందుకు ప్రధాన కారణం.

Updated : 15 Apr 2024 06:17 IST

అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమా

నాగ్‌పుర్‌: సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ నియోజకవర్గం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. భాజపాలో ప్రధానమంత్రి పదవి విషయంలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా ఎక్కువ మంది భావించే కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇక్కడ పోటీ చేస్తుండటమే అందుకు ప్రధాన కారణం. గత రెండు ఎన్నికల్లోనూ నాగ్‌పుర్‌లో 2 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన ఆయన ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ఆధిక్యంతో హ్యాట్రిక్‌ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెస్‌కు ఒకప్పుడు కంచుకోట

విదర్భ ప్రాంతంలోని అతిపెద్ద నగరం నాగ్‌పుర్‌. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఇక్కడే బౌద్ధమతాన్ని స్వీకరించారు. భాజపాకు సైద్ధాంతిక మార్గదర్శి అయిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)కు నాగ్‌పుర్‌తో బలమైన బంధం ఉంది. ఈ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఇప్పటివరకు ఇక్కడ 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. 13 సార్లు ఆ పార్టీ విజయం సాధించింది. గత రెండు దఫాలు గడ్కరీ ఇక్కణ్నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో ఏడుసార్లు ఎంపీ విలాస్‌ ముత్తేవార్‌ను 2.84 లక్షల ఓట్ల తేడాతో ఓడించిన ఆయన.. 2019లో ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలెపై 2.16 లక్షల మెజార్టీతో గెలుపొందారు.

అభివృద్ధి పనులపై భరోసాతో..

నాగ్‌పుర్‌లో గడ్కరీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను తీసుకొచ్చారు. గత పదేళ్లలో నియోజకవర్గ ప్రగతికి చేసిన కృషే తనను మళ్లీ గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు. తాను ఎవరి దగ్గరికీ వెళ్లి ఓట్లు అడగనని.. అయినా అయిదు లక్షల మెజార్టీతో విజయం సాధిస్తానని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. ఆరెస్సెస్‌కు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరు కావడం, ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా చాలామంది చూస్తుండటం, ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వంటివి కూడా ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం ప్రతికూలతలు

మౌలిక వసతుల ప్రాజెక్టులు బాగానే ఉన్నా.. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం వంటివి గడ్కరీకి కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. నియోజకవర్గంలో దళిత, కున్బి, హల్బ, ముస్లిం వర్గాల ఓటర్లు దాదాపు 12 లక్షల వరకూ ఉన్నారు. వారి మద్దతును దక్కించుకోవడం ఆయనకు చాలా కీలకం. ప్రస్తుతం గడ్కరీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ తరఫున వికాస్‌ ఠాక్రే ఎన్నికల బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన నానా పటోలెకు 4.5 లక్షల ఓట్లు వచ్చాయి. ఆయన స్థానికేతర నేత. ఇప్పుడు బరిలో ఉన్న వికాస్‌ ఠాక్రే స్థానికుడు కావడంతో.. విజయం కోసం గడ్కరీ శ్రమించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు