నామినేషన్లలోపే తొలి విడత ప్రచారం

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు భాజపా.. తొలివిడత ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. నామినేషన్ల ప్రారంభానికి ముందే ఒక విడత కీలక ప్రచార కార్యక్రమాలను ముగించేలా కార్యాచరణను అమలు చేస్తోంది.

Updated : 15 Apr 2024 06:18 IST

భాజపా ముఖ్యనేతల కసరత్తు
క్షేత్రస్థాయి కార్యాచరణ, సమావేశాలు, భేటీలకు ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు భాజపా.. తొలివిడత ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. నామినేషన్ల ప్రారంభానికి ముందే ఒక విడత కీలక ప్రచార కార్యక్రమాలను ముగించేలా కార్యాచరణను అమలు చేస్తోంది. అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ఇందుకు అనుకూలంగా మారింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా అనుబంధ విభాగాలతో పార్టీ ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలను దాదాపు పూర్తి చేసింది. మిగిలిన చోట్ల ఒకటి రెండు రోజుల్లో ముగించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. గత నెల ప్రధాని నరేంద్రమోదీ బహిరంగసభలు నిర్వహించారు. మరో అగ్రనేత అమిత్‌షా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. అభ్యర్థులు క్షేత్రస్థాయి ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ,  ముఖ్యనేత ఈటల రాజేందర్‌లు అభ్యర్థులుగా బరిలో ఉండటంతో వారివారి లోక్‌సభ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. జాతీయ నాయకత్వం ఇచ్చిన వివిధ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు ప్రధానంగా ఇంటింటికీ వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. బూత్‌ సమావేశాలను నిర్వహిస్తున్నారు. చేరికలకు ప్రాధాన్యం ఉంటోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారుల జాబితాలు ఇప్పటికే అందడంతో వారందర్నీ కనీసం ఒక్కసారైనా కలసి మాట్లాడి మద్దతు కూడగట్టే బాధ్యతను బూత్‌ స్థాయి కమిటీలకు అప్పగించారు.

కాంగ్రెస్‌, భారాసలే లక్ష్యంగా...

భాజపా ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించిన అభయ్‌పాటిల్‌ పార్లమెంట్‌ స్థానాల వారీగా ఎన్నికల కమిటీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. నేతలు రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం, గత భారాస ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ ఆ పార్టీలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదనే అంశాన్ని ప్రధానంగా భాజపా ప్రచారంలో ప్రస్తావిస్తోంది. రాష్ట్రంలో కరవు పరిస్థితుల నేపథ్యంలో రైతు సమస్యలే ముఖ్య ఎజెండాగా రైతు దీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో దీక్షలు పూర్తికాగా సోమవారం రాష్ట్ర స్థాయి రైతు దీక్ష నిర్వహించనుంది. పార్టీ క్రియాశీల కార్యకర్తలతో వేర్వేరు కార్యక్రమాలను అమలు చేస్తోంది. అనుబంధ విభాగాలను ఎన్నికలకు సమాయత్తం చేసింది. రాష్ట్ర స్థాయిలో కీలకమైన మహిళా, కిసాన్‌, ఓబీసీ తదితర మోర్చాల సమావేశాలను నిర్వహించింది. కుల సంఘాల వారితో నేతలు రాష్ట్ర స్థాయిలో సమావేశాలు పెట్టారు. అభ్యర్థులు లోక్‌సభ నియోజకవర్గాల్లో వివిధ వర్గాలతో ప్రత్యేకంగా సమావేశమవుతూ మద్దతుకోసం ప్రయత్నం చేస్తున్నారు. అత్యధిక ఓట్లు ఉన్న వర్గాలతో సమావేశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటింటికి భాజపా, టిఫిన్‌ బైఠక్‌, స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లతో యాత్రలను నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని