కమలం కల నెరవేరేనా?

తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది.

Updated : 15 Apr 2024 06:27 IST

అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కన్ను
గత లోక్‌సభలో నాలుగు స్థానాల్లో గెలుపు
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్‌సభ స్థానం పరిధిలోనూ దక్కని మెజారిటీ
‘పార్లమెంటు’కు సానుకూలత ఉంటుందని ఆశలు  
కాంగ్రెస్‌, భారాసల్లో ఎవరి ఓట్లకు గండి?
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా కసరత్తు చేస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా లోక్‌సభ విషయంలో ఓటర్ల నుంచి భాజపాకు సానుకూలత ఉంటుందన్న అంచనాతో ముందుకు కదులుతోంది. తమకు వచ్చే ఓట్లకు తోడు.. అధికార కాంగ్రెస్‌, విపక్ష భారాసల ఓట్లు చీలితేనే కమలానికి విజయావకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎవరి ఓట్లకు గండి పడనుందనే అంశం చర్చనీయాంశమవుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో భాజపా నాలుగు స్థానాలు సాధించి, మహబూబ్‌నగర్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్నా.. ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోనూ ఆధిక్యం సాధించలేకపోయింది. కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎజెండా భిన్నమని, అది తమకే లాభిస్తుందని భాజపా ఆశిస్తోంది.

ఓట్లు చీలేనా? భాజపాకు లాభించేనా?

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌.. తొమ్మిది లోక్‌సభ సీట్ల పరిధిలో ఆధిక్యం సాధించగా, విపక్ష భారాసకు ఏడు స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం పరిధిలో మెజార్టీ దక్కింది. భాజపాకు సిటింగ్‌ ఎంపీలున్న నాలుగు లోక్‌సభ స్థానాల్లో.. మూడు చోట్ల మూడో స్థానం, ఆదిలాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రెండో స్థానం మాత్రమే దక్కాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో.. 2019లో గెలిచిన నాలుగింటితో పాటు మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్‌, నాగర్‌కర్నూల్‌ తదితర స్థానాలపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని సెగ్మెంట్లలో భాజపాకు మూడో స్థానాలు.. అది కూడా చాలా తక్కువ శాతం ఓట్లు దక్కాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం సాధించడంతో ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సంస్థల నాయకులు, ఇతర పార్టీల్లోని ముఖ్యులు ‘హస్తం’ గూటికి చేరారు. విపక్ష భారాస.. కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి గట్టి ప్రయత్నాలే ప్రారంభించింది. ఈ స్థితిలో కాంగ్రెస్‌, భారాస పార్టీల ఓట్లు చీలతాయా? అవి భాజపాకు లాభిస్తాయా అనేది చర్చనీయాంశమవుతోంది.

కరీంనగర్‌లో పోటాపోటీ

కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాజపాకు 43.77 శాతం, భారాసకు 35.87 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు కేవలం 15.73 శాతమే వచ్చాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలో కాంగ్రెస్‌, భారాసలకు ఐదేసి లక్షలకు పైగా ఓట్లు రాగా, భాజపాకు 2.5 లక్షల ఓట్లు మాత్రమే దక్కాయి. కరీంనగర్‌, హుజూరాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపాకు రెండో స్థానం రాగా, మరో మూడు స్థానాల్లో పది శాతం లోపు, రెండు చోట్ల 15 నుంచి 17 శాతం ఓట్లు వచ్చాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అనూహ్యంగా 25.55 శాతం ఓట్లు రావడంతో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ 30.49 శాతం ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ను భాజపా తిరిగి గెలుచుకోవాలంటే రెండు లక్షలకు పైగా ఓట్లను అదనంగా సాధించాల్సి ఉంటుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలో కాంగ్రెస్‌, భారాసలకు 37 శాతం చొప్పున ఓట్లు వస్తే భాజపాకు 18 శాతం మాత్రమే దక్కాయి. ఇప్పుడు ఈ లోక్‌సభ సీటు పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌ వారే. వీరంతా తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయనున్నారు. భారాస నుంచి ఆ పార్టీ ముఖ్యనాయకుడు వినోద్‌కుమార్‌ పోటీలో ఉండగా, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కూడా ఈ లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. ఈ పోటాపోటీ స్థితిలో భాజపా సిటింగ్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు.

నిజామాబాద్‌ అండ ఎవరికి?

నిజామాబాద్‌ స్థానంలో గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 6.53 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. భాజపాకు 45.31 శాతం, భారాసకు 38.62 శాతం ఓట్లు వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ సీటు పరిధిలో భాజపా మూడో స్థానానికి వెళ్లినా, ఓట్ల పరంగా కాంగ్రెస్‌, భారాసలకు దగ్గరగానే ఉంది. భారాసకు 33.4 శాతం, కాంగ్రెస్‌కు 32.7 శాతం, భాజపాకు 29.27 శాతం ఓట్లు వచ్చాయి. ఏడు సెగ్మెంట్లలో భారాసకు మూడు.. కాంగ్రెస్‌, భాజపాలకు రెండేసి చొప్పున దక్కాయి. భాజపా గెలిచిన రెండు చోట్ల భారాస మూడో స్థానంలో ఉంది. కాంగ్రెస్‌ గెలిచిన రెండు స్థానాల్లో భాజపాకు మూడో స్థానం వచ్చింది. 2019 ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌ ఇప్పుడు బలపడడంతో త్రిముఖ పోటీ వాతావరణం నెలకొంది.

మహబూబ్‌నగర్‌లో మార్పులు..

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో 2019లో 34.85 శాతం ఓట్లతో భాజపా రెండో స్థానంలో నిలిచింది. అప్పుడు కాంగ్రెస్‌కు 19.88 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 46.35 శాతం, భారాసకు 38.74 శాతం ఓట్లు వస్తే.. భాజపా 8.57 శాతం ఓట్ల వద్దే ఆగిపోయింది. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. భాజపాకు అన్ని చోట్లా మూడో స్థానమే మిగిలింది. మూడు నియోజకవర్గాల్లో 10 వేల లోపు, మరో మూడుచోట్ల 20 వేల లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. ఒక్క మక్తల్‌లో మాత్రమే 45 వేల ఓట్లు రాగా.. ఇక్కడ ఉన్న ముఖ్యనేత ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో భాజపా ఆశిస్తున్న స్థానాల్లో ఎన్నిచోట్ల విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

 


సికింద్రాబాద్‌ బరిలో సీనియర్లు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పోటీ చేస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 2019 నాటి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ 19.12 ఓట్లకు పరిమితమై.. మూడో స్థానానికి పడిపోయింది. భాజపా 42.47 శాతం, భారాస 35.61 శాతం ఓట్లు సాధించాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 43.76 శాతం వస్తే.. కాంగ్రెస్‌కు 26.4, భాజపాకు 20.4 శాతం ఓట్లు దక్కాయి. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో భాజపాకు మూడో స్థానం లభించింది. భారాస తరఫున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌ నాయకుడు దానం నాగేందర్‌ ప్రస్తుతం కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో నిలిచారు. హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మాజీ మేయర్‌ సహా అనేక మంది కాంగ్రెస్‌లో చేరారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాలను గెల్చుకొన్న భారాస.. పార్టీ సీనియర్‌ నాయకుడు, సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా రంగంలోకి దించింది. నాంపల్లి అసెంబ్లీ స్థానంలో భాజపాకు మొన్నటి ఎన్నికల్లో కేవలం 7.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అంబర్‌పేటలో మినహా ఎక్కడా 30 శాతం ఓట్లు దాటలేదు. ఇక్కడ బరిలో ఉన్న ముగ్గురు సీనియర్‌ నాయకుల్లో గెలుపెవరిదన్నది ఆసక్తి రేపుతోంది.


ఆదిలా‘బాద్‌షా’ ఎవరు?

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని 2019లో త్రిముఖ పోటీ ఉన్నా భాజపా గెలుచుకుంది. ఈ పార్టీకి 35.92 శాతం, భారాసకు 30.34, కాంగ్రెస్‌కు 29.91 శాతం ఓట్లు లభించాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారాసకు 35.62 శాతం ఓట్లు వస్తే, భాజపాకు 34.32 శాతం, కాంగ్రెస్‌కు కేవలం 19.26 శాతం ఓట్లు దక్కాయి. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగు భాజపా, రెండు భారాస, ఒకటి కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. సిర్పూరు, ముథోల్‌లలో భారాస రెండో స్థానంలో నిలవగా.. ఈ పార్టీ నుంచి ఓడిపోయిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌లో త్రిముఖ పోటీ ఛాయలు కనిపిస్తున్నా.. పోలింగ్‌ దగ్గర పడే సమయానికి పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని