భారాస బలహీనపడింది.. భాజపాపై పోరాడండి

ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని.. ఇక్కడా అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు.

Updated : 15 Apr 2024 06:54 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో గెలవాలి
పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ దిశానిర్దేశం
లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జులు, అభ్యర్థులతో సమీక్ష
కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తరాదిలో భాజపా గత పక్షం రోజులుగా బలహీనపడిందని, అందుకే దక్షిణ భారతంపై దృష్టి పెట్టిందని.. ఇక్కడా అవకాశం ఇవ్వవద్దని కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవడం పార్టీకి అత్యంత కీలకమని, 15 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహంపై లోక్‌సభ స్థానాల ఇన్‌ఛార్జులు, అభ్యర్థులతో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు, 14 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారంపై నేతలకు అధిష్ఠానం తరపున వేణుగోపాల్‌ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందువల్ల ఇప్పుడూ గెలుస్తామనే భ్రమపడవద్దని, కష్టపడి పనిచేయాలని స్పష్టం చేశారు. భారాస పూర్తిగా బలహీనపడిందని.. ఆ పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టవద్దని, భాజపాపైనే పోరాడాలని ఉద్బోధించారు. భాజపా, భారాసలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి ముందుకొస్తే క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. భారాస నేతలు, కార్యకర్తలను స్థానిక కారణాలతో పార్టీలోకి రాకుండా అడ్డుకుంటే.. వారు భాజపాలోకి వెళ్తారన్నారు. తద్వారా ఆ పార్టీ బలం పెరుగుతుందని, అలా జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. భారాస బలహీనం కావడం వల్ల ఆరేడు నియోజకవర్గాల్లో బలం పుంజుకోవడానికి భాజపా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని కేసీ వేణుగోపాల్‌ అన్నట్లు సమాచారం. జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షణికావేశంలో పార్టీని వీడినవారిని తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎవరికైనా ఏమైనా అనుమానాలుంటే వాటిని మంత్రులు నివృత్తి    చేయాలని తెలిపారు.

సీఎం సహా అందరూ ప్రచారానికి వెళ్లాలి..

కొందరు అభ్యర్థులు ప్రచారంలో వెనకబడ్డారని, వారంతా ఇకనుంచి చురుగ్గా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు. అంతకుముందు అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, అభ్యర్థుల అభిప్రాయాలను వేణుగోపాల్‌ అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం ఎలా సాగుతోందో ఆరా తీశారు. మంత్రులందరూ తమ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, అభ్యర్థులు సోమవారం నుంచి నియోజకవర్గాల్లోనే ఉండాలని, హైదరాబాద్‌లో కనిపించవద్దని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యనేతలు అన్ని నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేయాలని చెప్పారు. పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన గ్యారంటీ హామీలు, మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కొందరు నేతల తీరు బాగా లేదని, మారాలని సున్నితంగా హెచ్చరించినట్లు తెలిసింది.

నేతలంతా కష్టపడితే 15 సీట్లు గెలుస్తాం: రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నేతలంతా కష్టపడి పనిచేస్తే 15 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. గత నాలుగు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలు, ఇతర పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పారు. ఉద్ధృతంగా ప్రచారం చేయాలని, మండల స్థాయిలో, పోలింగ్‌ బూత్‌ స్థాయికెళ్లి ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. పార్టీ విజయం కోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. సోమవారం నుంచి పెద్దఎత్తున ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు విమానాశ్రయం నుంచి హోటల్‌కు వచ్చిన వేణుగోపాల్‌కు రేవంత్‌రెడ్డి, భట్టి, దీపా దాస్‌మున్షీ స్వాగతం పలికారు. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న 3 నియోజకవర్గాలపై సీఎం, నేతలతో వేణుగోపాల్‌ చర్చించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని