అభివృద్ధి, సంక్షేమం కళ్లుగా.. సంకల్ప పత్రం

అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తూ.. ప్రజాకర్షక, వివాదాస్పద అంశాలకు దాదాపు దూరంగా భాజపా తమ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది.

Updated : 15 Apr 2024 06:28 IST

వచ్చే అయిదేళ్లూ పేదలకు ఉచిత రేషన్‌
70 ఏళ్లు పైబడిన వారికి రూ.5 లక్షల వైద్యం
పేదలకు ఉచిత విద్యుత్తు
పైప్‌లైన్‌ ద్వారా రాయితీ ధరల్లో వంటగ్యాస్‌
దక్షిణాదికీ బుల్లెట్‌ రైలు.. త్వరలో సర్వే
భాజపా మ్యానిఫెస్టో విడుదల చేసిన ప్రధాని
ప్రజాకర్షక, వివాదాస్పద అంశాలకు దూరం

ఈనాడు, దిల్లీ: అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తూ.. ప్రజాకర్షక, వివాదాస్పద అంశాలకు దాదాపు దూరంగా భాజపా తమ లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం (వికసిత్‌ భారత్‌)గా నిలిచేలా ప్రధానమైన హామీలతో ‘మోదీ కీ గ్యారంటీ’ పేరుతో ఓటర్ల ముందుకు వచ్చింది. 10 సామాజిక సమూహాలు, 14 ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌లతో కలిసి మ్యానిఫెస్టో(సంకల్ప పత్రం)ను ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తల్ని, ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో 80 కోట్ల మందికిపైగా పేదలకు ఉచిత రేషన్‌ను మరో ఐదేళ్లు కొనసాగిస్తామని ప్రకటించారు. పేద, గొప్ప భేదం లేకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులందర్నీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కిందికి తీసుకొచ్చి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..

చెప్పినవన్నీ చేసి చూపించాం

‘‘భాజపా సంకల్పపత్రం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గత పదేళ్లలో మ్యానిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలుచేసి చూపడమే దీనికి కారణం. మ్యానిఫెస్టోకున్న గౌరవాన్ని భాజపా పెంచింది. జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి సారించాం. ఈ మ్యానిఫెస్టో యువ ఆకాంక్షలకు ప్రతిబింబం. ప్రతి రంగంలో భారత్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలన్నదే మా సంకల్పం. హరిత ఇంధనం, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌, సెమీ కండక్టర్లు, నవకల్పనలు, లీగల్‌ ఇన్సూరెన్స్‌ వంటి రంగాలకు కేంద్రంగా మనం మారే రోజు ఎంతో దూరం లేదు. అంతరిక్ష రంగంలోనూ గొప్పశక్తిగా ఎదుగుతాం.

సుస్థిర ప్రభుత్వం అవసరం

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితి ఉంది. ఇలాంటి సంకట సమయంలో భారత్‌లో సంపూర్ణ మెజార్టీతో బలమైన, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం అత్యవసరం. దేశ హితం కోసం కఠిన చర్యలు తీసుకోవడానికి భాజపా ఎప్పుడూ వెనకడుగు వేయదు. పార్టీ కంటే దేశం గొప్పది. దేశంలో డిజిటల్‌, డేటా, సుపరిపాలన కోసం మౌలిక వసతులు కల్పిస్తాం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్తాం. అవినీతిపరులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే వెయ్యేళ్ల భవిష్యత్తును నిర్ణయించే సమయమిదే. ఫలితాలు వచ్చిన వెంటనే మ్యానిఫెస్టో అమలుకు వేగంగా చర్యలు తీసుకుంటాం. దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అని మోదీ పేర్కొన్నారు.

మ్యానిఫెస్టోలో మరిన్ని ముఖ్యాంశాలు

పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం. పైప్‌లైన్‌ ద్వారా రాయితీ ధరలో వంటగ్యాస్‌ సరఫరా. జన్‌ఔషధి దుకాణాలు పెంపు. పేద కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్తు. పంటలకు ఎరువులు పిచికారీచేసే డ్రోన్లు 3 కోట్లమంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందించి ఆదాయం పొందేలా చేయూత.

 • స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాలు కల్పించి ఐటీ, ఆరోగ్య రక్షణ, విద్య, రిటైల్‌, పర్యాటక రంగాలతో అనుసంధానం చేసి వారి ఆదాయాన్ని పెంచడం
 • క్రీడాకారిణులకు ప్రత్యేక పథకం. ముద్ర యోజన రుణ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
 • నగరాల్లో తోపుడుబండ్లపై పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే వారికి రుణాలిచ్చే స్వనిధి యోజన- చిన్న పట్టణాలు, గ్రామాలకు విస్తరణ. రూ.50వేల రుణ పరిమితి పెంపు

చిరు ఉత్పత్తులకు మార్కెటింగ్‌

 • దివ్యాంగులకు పీఎంఆవాస్‌యోజన ఇళ్లలో ప్రాధాన్యం.
 • స్వయం సహాయక సంఘాలను ఒక జిల్లా-ఒక ఉత్పత్తి, రైతు ఉత్పత్తి సంఘాలు, ఏక్తామాల్‌, ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌), జీఈఎం, ఒక స్టేషన్‌-ఒక ఉత్పత్తి పథకాలతో అనుసంధానం చేసి, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లభ్యతను పెంచడం
 • పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలకు సమీపంలో మహిళలకు అనుకూలంగా వసతి గృహాలు, శిశు సంరక్షణ కేంద్రాల నిర్మాణం
 • మహిళల్లో రక్తహీనత, రొమ్ముకేన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, ఆస్టియోపొరాసిస్‌ లాంటి సమస్యలను నివారించడానికి వైద్య ఆరోగ్యసేవల విస్తరణ. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ

అర్హులందరికీ పౌరసత్వం

 • జాతీయ సగటు వేతనాలపై ఎప్పటికప్పుడు సమీక్ష
 • సీఏఏ కింద అర్హులైనవారందరికీ పౌరసత్వం
 • ఆటో, ట్యాక్సీ, ట్రక్‌, ఇతర డ్రైవర్లను ఈ-శ్రమ్‌ పోర్టల్‌తో అనుసంధానం చేసి 100% డ్రైవర్లందరికీ బీమా కవరేజి, ఇతర సంక్షేమ పథకాల వర్తింపు
 • ‘ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌’ ద్వారా చిన్న వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు సాంకేతికతను ఉపయోగించుకుని తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు బాటలు
 • గిరిజన చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నిర్మూలన. గిరిజన ప్రాంతాల్లో సమగ్ర వైద్యఆరోగ్య సౌకర్యాల కల్పన. సికిల్‌సెల్‌ అనీమియా నిర్మూలన దిశగా కార్యాచరణ
 • సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, రైల్వే, టెలికాం టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌, విద్యుత్తు నెట్‌వర్క్‌ నిర్మాణం. ఇండో-చైనా, పాకిస్థాన్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో బలమైన మౌలిక వసతుల నిర్మాణం
 • భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారుచేయడం
 • తయారీ, సేవలు, గ్రామీణ పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి రంగాలపై ప్రత్యేక దృష్టిసారించి.. స్వనిధి, ముద్ర యోజన కింద రుణ వసతి కల్పించి.. యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించడం
 • 2030కల్లా భారత్‌ను గ్లోబల్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా తయారుచేసి ఈ రంగంలో ఉద్యోగావకాశాలు పెంపొందించడం.

ఉమ్మడి పౌరస్మృతితోనే సమాన హక్కులు

ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని ఆదేశిక సూత్రాలు చెబుతున్నాయి.తద్వారానే మహిళలకు సమాన హక్కులు లభిస్తాయని భాజపా నమ్ముతోంది. ఈ పౌరస్మృతి విషయంలో తన విధానాన్ని భాజపా పునరుద్ఘాటిస్తోంది. ఉత్తమ సంప్రదాయాలను రూపొందించి, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలుచేస్తుంది.

 • దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణపై రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫార్సుల అమలు దిశగా కార్యాచరణ
 • సరిహద్దు రాష్ట్రాల్లో దశలవారీగా ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం’ (ఏఎఫ్‌ఎస్‌పీఏ) తొలగింపు
 • అటవీ ఉత్పత్తులకు మార్కెట్‌ పెంపు
 • 700 ఏకలవ్య పాఠశాలల నిర్మాణం
 • ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణం. పురాతన తమిళ భాష ప్రతిష్ఠను పెంచేందుకు చర్యలు
 • ట్రక్కు డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల్లో మౌలిక వసతుల నిర్మాణం. హైవే, రైల్వే, ఎయిర్‌పోర్టుల ఆధునికీకరణ, విస్తరణ. నాలుగో దశ పారిశ్రామికీకరణకు డిజిటల్‌ వ్యవస్థ ఆధునికీకరణ.
 • కొత్త శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం. పౌర విమానయాన రంగం విస్తరణ
 • దేశం నలుమూలలకూ వందేభారత్‌ స్లీపర్‌, ఛైర్‌కార్‌, మెట్రోరైళ్ల విస్తరణ
 • ఉత్తర, దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోనూ బుల్లెట్‌ రైలు కారిడార్ల నిర్మాణానికి త్వరలో సర్వే
 • శ్రీరాముడి గొప్పతనాన్ని చాటేలా ప్రపంచవ్యాప్త కార్యక్రమాలు. అయోధ్య సమగ్రాభివృద్ధి
 • ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి ట్రాన్స్‌జెండర్లు

క్రమబద్ధంగా మహిళా రిజర్వేషన్లు

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు కోసం తెచ్చిన ‘నారీశక్తి వందన్‌ అధినియమ్‌’ క్రమబద్ధంగా అమలు

 • దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ పారదర్శకత.  ప్రశ్నపత్రాల లీకేజీ నివారణకు చట్టం
 • పోస్టల్‌, డిజిటల్‌ నెట్‌వర్క్‌ను విస్తృతంగా ఉపయోగించుకొని సీనియర్‌ సిటిజన్లకు ఇంటివద్దకే ప్రభుత్వ ప్రయోజనాల అందజేత
 • పీఎం కిసాన్‌కింద రూ.6వేల సాయం కొనసాగింపు
 • పంటనష్టాన్ని కచ్చితంగా అంచనావేసి, రైతులకు వేగంగా పరిహారం చెల్లించి, ఫిర్యాదులను పరిష్కరించేలా పీఎం ఫసల్‌బీమా యోజన బలోపేతం
 • పంటలకుఎప్పటికప్పుడు కనీస మద్దతు ధర పెంపు
 • వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, నాణ్యత ప్రకారం విభజన, శీతల గిడ్డంగులు, ఆహారశుద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు ‘కృషి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌’ ప్రారంభం
 • వ్యవసాయ అవసరాలకోసం ప్రత్యేక శాటిలైట్‌ ప్రయోగం. పంటల దిగుబడి అంచనా, పురుగుమందుల అవసరం, సాగునీరు, భూసారం, వాతావరణ ముందస్తు అంచనా, ఇతర అవసరాలకోసం దీని వినియోగం

ఆ 4 స్తంభాలపై..

పేదలు, యువత, రైతులు, మహిళలు అనే కీలకమైన నాలుగు స్తంభాలపై ‘సంకల్ప పత్రం’ తయారు చేశాం. యువత ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుంది. అంబేడ్కర్‌ జయంతి రోజున దీనిని విడుదల చేస్తుండడం సంతోషంగా ఉంది. మ్యానిఫెస్టో కోసం రాజ్‌నాథ్‌ నేతృత్వంలోని కమిటీ కృషి అభినందనీయం. సలహాలు, సూచనలు పంపినవారికి కృతజ్ఞతలు.

ప్రధాని నరేంద్రమోదీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని