ఇక్కడ తంతే దిక్కెవర్రా!.. వైకాపా ఎమ్మెల్యే జోగారావు దౌర్జన్యకాండ

‘ఇక్కడ తంతే నీకు దిక్కెవర్రా? నువ్వు ఎక్కడోడివి? నా ఇంటికి రావాల్సిన పనేంటి’ అంటూ పార్వతీపురం వైకాపా ఎమ్మెల్యే అలజంగి జోగారావు.. తెదేపా అభ్యర్థి విజయచంద్రను బెదిరించారు.

Updated : 15 Apr 2024 08:12 IST

వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహణ
అడ్డుకోవడానికి వెళ్లిన తెదేపా అభ్యర్థి విజయచంద్రకు బెదిరింపులు

పార్వతీపురం, పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఇక్కడ తంతే నీకు దిక్కెవర్రా? నువ్వు ఎక్కడోడివి? నా ఇంటికి రావాల్సిన పనేంటి’ అంటూ పార్వతీపురం వైకాపా ఎమ్మెల్యే అలజంగి జోగారావు.. తెదేపా అభ్యర్థి విజయచంద్రను బెదిరించారు. జోగారావు ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేట పరిధిలోని తన క్యాంపు కార్యాలయంలో వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించి డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు తెదేపా నాయకులకు తెలిసింది. ఈ క్రమంలో విజయచంద్రతో పాటు ఆ పార్టీ నాయకుడు సంతోష్‌, జనసేన నాయకుడు రమేశ్‌ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. తెదేపా నాయకులు వచ్చినట్లుగా సమాచారం తెలుసుకున్న వాలంటీర్లు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఈ దృశ్యాలను రమేశ్‌, సంతోష్‌ వీడియో తీస్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బయటికి వచ్చి వీరంగం సృష్టించారు. వారి సెల్‌ఫోన్లు లాక్కొని దాడికి పాల్పడ్డారు. విజయచంద్ర వాహనాన్ని అడ్డుకుని అతనితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతలోనే ఏఎస్పీ సునీల్‌షరోన్‌, సీఐ కృష్ణారావు అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. వాలంటీర్లతో సమావేశం నిర్వహించినట్లు సాక్ష్యాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలంటూ విజయచంద్రను పంపించారు. ఈ ఘటనపై తెదేపా, వైకాపా నాయకులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుశ్చర్యలను అడ్డుకుంటాం: ‘పార్వతీపురం తన సొంత జాగీరులా జోగారావు భావిస్తున్నారు. ఆయన దౌర్జన్యాలు సాగనిచ్చేది లేదు’ అని విజయచంద్ర విలేకరుల సమావేశంలో అన్నారు. వాలంటీర్లతో సమావేశమైనట్లు తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్తే ఎమ్మెల్యే దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని