‘స్పెషల్‌ స్టేటస్‌ విస్కీ’ తెచ్చి.. అదే ప్రత్యేక హోదా అంటున్నారు

‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని, రాజధాని కడతానని చెప్పిన జగన్‌.. చివరకు ‘స్పెషల్‌ స్టేటస్‌’, ‘క్యాపిటల్‌’ పేరున్న మద్యం బ్రాండ్లను తెచ్చి సర్కారీ దుకాణాల్లో అమ్ముతున్నారు.

Updated : 15 Apr 2024 07:04 IST

పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విసుర్లు

ఈనాడు, తిరుపతి: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని, రాజధాని కడతానని చెప్పిన జగన్‌.. చివరకు ‘స్పెషల్‌ స్టేటస్‌’, ‘క్యాపిటల్‌’ పేరున్న మద్యం బ్రాండ్లను తెచ్చి సర్కారీ దుకాణాల్లో అమ్ముతున్నారు. మద్య నిషేధం హామీని ఇలా నిలబెట్టుకున్నార’ని ముఖ్యమంత్రి జగన్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యంగ్యోక్తులు విసిరారు.‘కుంభకర్ణుడు ఆరు నెలలు మేల్కొని, ఆరు నెలలు నిద్రపోతాడు. జగన్‌ మాత్రం నాలుగున్నరేళ్లు నిద్రపోయి ఎన్నికలు రావడంతో నిద్ర లేచారు. 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే నాడు చంద్రబాబు ఏడు వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించిన జగన్‌.. ఇప్పుడు ఎన్నికల ముందు ఆరు వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ ఇచ్చార’ని మండిపడ్డారు. ఆదివారం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరుల్లో నిర్వహించిన న్యాయ యాత్రలో షర్మిల ప్రసంగించారు. 2019 ఎన్నికల ముందు వైకాపా మేనిఫెస్టోలో 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా, ఈ రోజుకూ అవన్నీ ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. మళ్లీ మళ్లీ మోసగించే వారికి ఓటు వేయొద్దని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలిచాక ఉద్యోగాల భర్తీపై మొదటి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు.

మట్టి చెంబు ఇచ్చి.. వెండి చెంబు లాక్కొని..: ‘ఇంట్లో ఇద్దరు బిడ్డలు చదువుకుంటుంటే ఒక్కొక్కరికీ రూ.15 వేల చొప్పున అమ్మఒడి సొమ్ములు ఇస్తామని గత ఎన్నికల ముందు చెప్పిన జగన్‌.. కేవలం ఒక్కరికే ఇస్తున్నారు. సగం బడ్జెట్‌ కోత పెట్టారు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రేషన్‌ దుకాణాల్లో 11 రకాల సరకులు ఇస్తే ఇప్పుడు రెండే ఇస్తున్నారు. ఆర్టీసీ, విద్యుత్తు ఛార్జీలు, ఇంటి పన్నులు మాత్రం పెంచారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి, మరో చేత్తో వెండి చెంబు లాక్కుంటున్నారు. బటన్‌ నొక్కుతున్నట్లు చెబుతున్నారే కానీ, ప్రజల జేబుల్లో ఏమీ మిగలట్లేదు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు, జగన్‌.. ఇద్దరూ నిజమైన ఉద్యమం చేయలేదు. జగన్‌ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని భాజపాకు తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రాజధానితో సహా ఏపీకి ఏమీ లేకుండా చేశార’ని షర్మిల మండిపడ్డారు. రాహుల్‌ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తారని చెప్పారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, లేకుంటే మీ బిడ్డలను బానిసలు చేసినట్లే’నని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని