చంద్రబాబుపై ఐదేళ్లలో అనేక రాళ్ల దాడులు

విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఆగంతుకులు రాళ్లు విసిరారు.

Updated : 15 Apr 2024 09:24 IST

భద్రతా సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
సీఎస్‌వో, ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌లకు తీవ్రగాయాలు
అంగళ్లులో వైకాపా బీభత్సం..
ఉల్టా చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసు
ఒక్కసారీ స్పందించని సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఆగంతుకులు రాళ్లు విసిరారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు లక్ష్యంగా రాళ్లదాడి జరగడం ఇదే తొలిసారి కాదు. ప్రతిపక్ష నేతగా ప్రజాసమస్యలపై పోరాడే క్రమంలో ఆయన జనంలోకి వెళ్లిన పలు సందర్భాల్లో వైకాపా ప్రేరేపిత దుండగులు రాళ్లు, కర్రలతో విరుచుకుపడిన ఉదంతాలెన్నో. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత గల ప్రతిపక్ష నేతపై ఈ తరహా దుశ్చర్యలు రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. అన్నిసార్లూ ఘటనల వెనుక వైకాపా నాయకులే ఉన్నారని స్పష్టమవుతున్నా సీఎం జగన్‌ ఒక్కసారీ ఖండించలేదు. బాధ్యులపై కఠిన చర్యలూ తీసుకోలేదు. పైగా చంద్రబాబు కావాలనే దాడులు చేయించుకుంటున్నట్లుగా మంత్రులు, వైకాపా నాయకులు ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో తనను చంపేందుకు వైకాపా మూకలు ప్రయత్నించాయని, ఎన్‌ఎస్‌జీ కమాండోల రక్షణలో బయటపడ్డానని 2023 ఆగస్టు 13న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. 9 పేజీల లేఖతో పాటు తనపై దాడులకు ఆధారంగా 75 పేజీల డాక్యుమెంట్లు పంపించారు.

అమరావతిలో... ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛట!

వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి విధ్వంసానికి తెరలేపగా, అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి, రైతులకు భరోసానిచ్చేందుకు 2019 నవంబరు 29న చంద్రబాబు రాజధానిలో పర్యటించారు. ఆయన రాకను నిరసిస్తూ వైకాపా ప్రోద్బలంతో కొందరు ఆందోళన చేపట్టారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్‌లో నల్ల బ్యానర్లు కట్టారు. చంద్రబాబుతో పాటు సీనియర్‌ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపైకి రాళ్లు, చెప్పులు విసిరారు. బస్సు ముందుభాగం, నాయకులు కూర్చున్న వైపు అద్దాలు పగిలాయి. ఈ అరాచకానికి బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా, నాటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అది వారికి రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛని వ్యాఖ్యానించారు.

తిరుపతిలో... ఉపఎన్నిక సందర్భంలోనూ..

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా 2021 ఏప్రిల్‌ 12న చంద్రబాబు తిరుపతిలో ప్రసంగిస్తుండగా, దుండగులు ఆయనే లక్ష్యంగా రాళ్లు విసిరారు. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణ వలయంలో ఉన్న తనకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ఆనాడు బాబు మండిపడ్డారు. పోలీసులు దుండగులను పట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ అక్కడే నేలపై బైఠాయించారు. చివరకు కాలినడకన ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.

అంగళ్లులో... బాధితులపైనే హత్యాయత్నం కేసు

సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చంద్రబాబు 2023 ఆగస్టు 4న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో పర్యటించారు. ఆరోజు ఉదయం నుంచే వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. తెదేపా జెండాలు, ఫ్లెక్సీలు చించేసి దాడులకు దిగిన దుండగులు.. చంద్రబాబు వచ్చాక ఏకంగా రాళ్ల దాడికి తెగబడ్డారు. పలువురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. చంద్రబాబు అంగళ్లు నుంచి వెళ్లిపోయాక, వైకాపా శ్రేణులు మళ్లీ రెచ్చిపోయి తెదేపా నేతల కార్లను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ, ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు.

భీమవరంలో... యువగళం పాదయాత్రపైనా..

నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రపై పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరులో 2023 సెప్టెంబరు 5న వైకాపా శ్రేణులు కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. అడ్డుకోబోయిన తెదేపా కార్యకర్తలను చితకబాదాయి. పోలీసులు యువగళం వాలంటీర్లను నియంత్రించారే తప్ప వైకాపా శ్రేణులను అడ్డుకోలేదు. ఈ దాడిలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో పాటు పలువురు నాయకులు గాయపడ్డారు. ఓ కానిస్టేబుల్‌ తలకూ బలమైన గాయమైంది.

యర్రగొండపాలెంలో.. మంత్రి చొక్కా విప్పి మరీ బెదిరించినా..

ప్రకాశం జిల్లాలో 2023 ఏప్రిల్‌ 22న చంద్రబాబు పర్యటించిన సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ సమక్షంలోనే రాళ్లదాడి జరిగింది. బాబు యర్రగొండపాలేనికి రాకుండా అడ్డుకోవాలని మంత్రి ముందుగానే వైకాపా కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఆయన తన క్యాంప్‌ కార్యాలయం వద్దకు నల్లదుస్తులతో వచ్చి, చొక్కా విప్పి మరీ సవాల్‌ చేశారు. బాబు వాహనం వచ్చే సమయానికి దాదాపు 200 మంది రోడ్డు వెంట నిల్చొని గోబ్యాక్‌ అంటూ ప్లకార్డులు, నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ప్రదర్శించారు. చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. భద్రతా సిబ్బంది బుల్లెట్‌ ప్రూఫ్‌ షీట్‌లను అడ్డుపెట్టి, ఆయనకు రక్షణగా నిలవడంతో ముప్పు తప్పింది. ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌కుమార్‌ తలకు రాయి తగిలి బలమైన గాయమైంది. మంత్రి సురేష్‌ దుశ్చర్యను సీఎం జగన్‌ ఖండించలేదు. దోషులపై చర్యలూ లేవు. పైగా తెదేపా నేతలపైనే ఎదురు కేసులు పెట్టారు.


నందిగామలో... భద్రతాధికారి అడ్డుకోవడంతో తప్పిన ముప్పు

న్టీఆర్‌ జిల్లా నందిగామలో 2022 నవంబరు 4న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా రోడ్డుషోలో పాల్గొన్న చంద్రబాబుపై ఓ దుండగుడు భవనంపై నుంచి పూలతో పాటు పదునైన రాయి విసిరాడు. పూలను బలంగా విసురుతున్నట్లు గమనించిన ముఖ్య భద్రతాధికారి మధుసూదనరావు అప్రమత్తమై చంద్రబాబుకు అడ్డుగా నిలిచారు. మధు గవదపై దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఇది జరిగి ఏడాదవుతున్నా నిందితులెవరో గుర్తించలేదు. హత్యాయత్నం కేసు పెట్టాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేయగా, పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 324 కింద సాధారణ కేసు పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని