నిమిషాల్లో ప్లకార్డులు ఎలా వచ్చాయి?

ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని తెదేపా, భాజపా, జనసేన (ఎన్డీయే) నేతలు డిమాండ్‌ చేశారు.

Published : 15 Apr 2024 05:08 IST

సంచలన సంఘటనలు జరగనున్నాయన్న శ్రీధర్‌రెడ్డి ట్వీట్‌ను పట్టించుకోరేం?
ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి?
సీఈఓకు ఎన్డీయే నేతల ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని తెదేపా, భాజపా, జనసేన (ఎన్డీయే) నేతలు డిమాండ్‌ చేశారు. వేల మంది పోలీసుల సమక్షంలో జగన్‌ను హత్య చేయడానికి ఎవరైనా సాహసిస్తారా? అదీ చిన్న గులకరాయితో? అని ప్రశ్నించారు. ఎక్కడైనా రాయి తగిలి కిందపడుతుంది కానీ.. జగన్‌ పక్కనే ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగిలి గాయమవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన సంఘటనలు జరిగే అవకాశం. ఎన్నికల మూడ్‌ను మార్చేసే సంఘటనలు’ అంటూ వైకాపా నాయకుడు అవుతు శ్రీధర్‌రెడ్డి చేసిన ట్వీట్‌ను పోలీసులు ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. శ్రీధర్‌రెడ్డి ఓ సంఘ విద్రోహశక్తి అని.. గతంలో న్యాయమూర్తుల్ని దూషించిన కేసులో అతను 90 రోజులు జైల్లో కూడా ఉన్నాడని గుర్తుచేశారు. అతను చెప్పినట్లే జగన్‌పై హత్యాయత్నం అనే సంచలనాత్మక డ్రామా జరిగిందన్నారు. జగన్‌కు గాయమైన నిమిషాల వ్యవధిలో ‘నారారూప రాక్షసుడి పని’ అని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ  వైకాపా వాళ్లు ధర్నాలు ఎలా చేశారని నిలదీశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, భాజపా మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, జనసేన నేత గౌతమ్‌ నేతృత్వంలోని ఎన్డీయే బృందం ఆదివారం ఫిర్యాదు చేసింది.  బృందంలో తెదేపా బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్‌, ఎన్నారై విభాగం అధ్యక్షుడు కోమటి జయరాం తదితరులు ఉన్నారు.


ఎన్నికలయ్యే వరకు షర్మిల జాగ్రత్తగా ఉండాలి

-వర్ల

ఎన్నికలు పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలను వర్ల రామయ్య హెచ్చరించారు. నాడు వైఎస్‌ వివేకానందరెడ్డికి జరిగినట్టే ఆమెకూ జరగవచ్చేమోననే అనుమానం వెలిబుచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ పెద్ద నటుడు. అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి.. తనకు పెద్ద దెబ్బ తగిలినట్టు డ్రామా ఆడారు. అప్పుడు దెబ్బ కనిపించలేదు. తెల్లారేసరికి డాక్టర్‌ ఆయన కంటికి పెద్ద బ్యాండేజ్‌ వేశారు. గతంలో కోడికత్తి శ్రీనును బలి చేసినట్టు.. ఇప్పుడు సీఎంను చంపాలని చూసింది వీడే అని మరో అమాయకుడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చీకట్లో జగన్‌ ఒక్కర్నే నిల్చోబెట్టి భద్రతా సిబ్బంది అంతా కూర్చుంటారా? ఇదంతా డ్రామా కాకపోతే ఏంటి’ అని నిలదీశారు. దీనిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా స్పందించాలని వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు.  గతంలో అంగళ్లు, నందిగామ, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనల్లో రాళ్ల దాడి జరిగితే.. బాధ్యులపై బెయిలబుల్‌ కేసులు కట్టి పోలీసులే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని