ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి?

ముఖ్యమంత్రి జగన్‌పై దాడి ఘటనలో కొందరు పోలీసుల పాత్ర ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సందేహం వెలిబుచ్చారు.

Published : 15 Apr 2024 05:10 IST

పోలీసుల పాత్రపై సందేహం
ఒక రాయి ఇద్దరి కళ్లు, ఒకరి కాలిని గాయపరిచిందా?
సునీత, షర్మిల, భాస్కరరెడ్డి జాగ్రత్తగా ఉండాలి
తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌పై దాడి ఘటనలో కొందరు పోలీసుల పాత్ర ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సందేహం వెలిబుచ్చారు. అప్పటివరకూ ఎగిరిన డ్రోన్లు దాడి సమయంలో ఏమైపోయాయని, విజువల్స్‌ ఎందుకు లేవని ప్రశ్నించారు. రెండంతస్తుల భవనం నుంచి రాయి విసిరితే అది జగన్‌కు తగిలి, తర్వాత వెలంపల్లి శ్రీనివాస్‌ వైపు వచ్చి ఆయన కంటి దగ్గర గాయం చేసిందా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం విలేకరులతో వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ‘ఎన్నికలు వచ్చాయంటే వైఎస్‌ కుటుంబంలో ఏదో ఒకటి జరుగుతుంది. జగన్‌ కుటుంబానికి ముప్పు ఉందని, భద్రత పెంచాలని వివిధ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలు నివేదికలు ఇచ్చినట్లు ప్రభుత్వమే చెప్పింది. మరి డీజీపీ ఏం చేస్తున్నారు? అంటే ఈ స్కెచ్‌లో ఆయనకూ భాగం ఉందా? డీజీపీ దిగజారిపోయారు కాబట్టే ఆయనపైనా మాట్లాడాల్సి వస్తోంది. కోడి కత్తి కేసులో శ్రీను బలయ్యాడు. ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో? రేపోమాపో తెదేపా కార్యకర్త ఒకరిని తెచ్చి హత్యాయత్నం కేసు పెట్టాలని పోలీసులు చూస్తున్నార’ని ఆనం ఆరోపించారు.

క్రియేటివ్‌ డైరెక్టర్‌ భార్గవ్‌రెడ్డి

‘ఐప్యాక్‌ స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు నిర్మాత విజయసాయిరెడ్డి. జగన్‌కు సంబంధించిన మద్యం డబ్బంతా ఆయన దగ్గరే ఉంది. హీరో జగన్‌, హీరోయిన్‌ భారతి. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి. విలన్‌ అవుతు శ్రీధర్‌రెడ్డి. సైడ్‌ యాక్టర్లు వెలంపల్లి శ్రీనివాస్‌, కేశినేని నాని, రహమతుల్లా, అవినాశ్‌. వీరంతా పక్కా ప్రణాళిక రూపొందించి అమలు చేశారు. అన్నీ స్కెచ్‌ ప్రకారమే చేసినా, ఒక తప్పు చేశారు. శ్రీధర్‌రెడ్డి వల్ల దొరికిపోయారు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటనలు జరిగే అవకాశముందని, అవి ఎన్నికల మూడ్‌నే మార్చేసే సంఘటనలని ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ప్రకారమే నాలుగో రోజు రాయి దాడి జరిగింది’ అని ఆనం వివరించారు. ‘వీరి పథకం ప్రకారమే రాత్రి 7 గంటలకు కరెంటు ఆగిపోయింది. ఎగిరే డ్రోన్లు కిందికి దిగిపోయాయి. సీఎంపై రాయిదాడికి సంబంధించి డ్రోన్‌ విజువల్స్‌ లేకుండా పోయాయి. సీఎం చుట్టూ ఉన్న 3 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ‘అంతా రాయి అనుకుంటున్నారు. రాయా? పిల్లెట్టా? ఎయిర్‌గన్‌ బుల్లెట్టా? ఏమైనా అయి ఉండొచ్చు అని సాక్షిలో రాశారు. బస్సుయాత్రలో ఉన్న జగన్‌ను పొద్దున్నే భారతి చేతులూపుతూ పలకరించారు. రాత్రికి దెబ్బ తగిలింది. ఎంత మంచి నటనో? విజయవాడలో వైకాపా గూండాలు తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీ కంట్లో రాడ్‌ దించి కన్ను లేకుండా చేసినా వారిపై హత్యాయత్నం కేసు పెట్టలేదు. జగన్‌పై రాయి వేస్తే హత్యాయత్నం అంటున్నారు’ అని విమర్శించారు.

జగన్‌ సానుభూతి డ్రామాలో.. వారికి ప్రాణహాని

‘2018 అక్టోబరులో కోడికత్తి దాడి విఫలమైంది కాబట్టి వివేకానందరెడ్డిని హత్య చేయాల్సిన అవసరం వచ్చింది. 2019 ఎన్నికల్లో గెలవడానికి, జగన్‌ సీఎం కావడానికి వివేకానందరెడ్డి బలయ్యారని ఆయన కుమార్తె సునీతారెడ్డి, జగన్‌ సొంత చెల్లెలు షర్మిల చెప్పారు’ అని ఆనం గుర్తుచేశారు. ‘ఈసారి రాయి దాడి డ్రామా విఫలమైంది. కాబట్టి వైఎస్‌ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. షర్మిల, సునీతారెడ్డి, అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిపైనా హత్యాయత్నం జరగొచ్చు. వారికీ ప్రాణహాని ఉంది. వీరిలో ఎవరికేం జరిగినా జగన్‌కే సానుభూతి వస్తుంది. చంద్రబాబే హత్య చేయించారని ప్రచారం చేసేందుకు ప్రణాళిక తయారవుతోంది’ అని ఆనం పేర్కొన్నారు.


3 నిమిషాల్లో ప్రచారం ఎలా సాధ్యం?

‘రాయి దాడి జరిగిన వెంటనే వాలంటీర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని, టీవీలు చూడాలని చెప్పారు. ఇదంతా మూడు నిమిషాల్లోనే ఎలా సాధ్యమైంది’ అని ఆనం ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని