ఇది మరో సానుభూతి నాటకం: ఎంపీ రఘురామకృష్ణరాజు

రాష్ట్రంలో మరో సానుభూతి నాటకానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెర తీశారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Published : 15 Apr 2024 08:18 IST

ఈనాడు డిజిటల్‌, భీమవరం, కాళ్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మరో సానుభూతి నాటకానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెర తీశారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఆదివారం ఇక్కడి తన కార్యాలయంలో నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్‌పై రాయి దాడి ఘటన వెనుక ఎన్నో సందేహాలున్నాయన్నారు ‘యాత్ర సాఫీగా సాగుతున్న దశలో విద్యుత్తు ఎందుకు ఆగిపోయింది? ఆ క్షణంలో సాక్షి ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నిలిచింది? భద్రతా వలయం ఏమైనట్లు? ఘటన జరిగిన వెంటనే పంగలకర్ర ఉపయోగించినట్లు ఎలా చెప్పారు’ అని ప్రశ్నించారు. ‘సానుభూతి కోసం జరిగిన ముందస్తు నాటకంపై వారు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అయినా జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైకాపా సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో సానుభూతి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కోడికత్తి డ్రామా కథ ఇంకా సాగుతూనే ఉంది. వివేకా హత్య వ్యవహారంలో కడపలో మొదలైన వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతటా వీయడంతో స్వయంగా ఆయనే సానుభూతి కోసం ఇలాంటివి చేయించుకున్నారనే అనుమానాలున్నాయి. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి ఇలా జరగడం, జనాలు లేని ప్రాంతం చూసి గజమాలను ఏర్పాటు చేయడం, దానివెనుకే రాయి తగలడం అంతా సినీ ఫక్కీలో ఉంది. రాళ్లు విసిరితే కేవలం సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లికి మాత్రమే గాయాలవడం వెనుక మర్మమేంటో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు.


22న నామినేషన్‌ వేస్తున్నా..

‘ఈ నెల 22న నామినేషన్‌ వేస్తున్నా. అయితే ఎంపీనా, ఎమ్మెల్యేనా అనే దానిపై ఇంకా సందిగ్ధత నెలకొంది’ అని రఘురామ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని