డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, పోలీస్‌ కమిషనర్లను బదిలీ చేయాలి

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై దాడి జరిగినట్లు చెబుతున్న ఘటనపై సీబీఐ, ఎన్‌ఐఏ లాంటి సంస్థలతో దర్యాప్తు జరిపించి నిజమైన కుట్రదారులను కనిపెట్టాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

Published : 15 Apr 2024 05:12 IST

ఎన్నికల సంఘానికి తెదేపా మాజీ ఎంపీ కనకమేడల లేఖ

ఈనాడు, దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై దాడి జరిగినట్లు చెబుతున్న ఘటనపై సీబీఐ, ఎన్‌ఐఏ లాంటి సంస్థలతో దర్యాప్తు జరిపించి నిజమైన కుట్రదారులను కనిపెట్టాలని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం సీఈసీ రాజీవ్‌కుమార్‌కు మూడు పేజీల లేఖ రాశారు. డీజీపీ, ఇంటెలిజెన్స్‌ డీజీ, పోలీస్‌ కమిషనర్లున్న  విజయవాడ నగరంలోనే ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో పోలీసుశాఖ పూర్తిగా విఫలమయిందన్నారు. తెదేపా నాయకులపై ఎన్నో చోట్ల దాడులు చేసిన రౌడీమూకలు స్వేచ్ఛగా తిరుగుతున్నా అరెస్టు చేయకుండా వదిలిపెట్టిందన్నారు. పోలీసులను వెన్నెముక లేని పరాన్నజీవులుగా, పార్టీ కార్యకర్తలుగా మార్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష నేతపై ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు.శాంతిభద్రతల నిర్వహణలో ఘోరంగా విఫలమైన పోలీసు అధికారులు తమ సొంత వైఫల్యాలపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తారన్న నమ్మకం లేదన్నారు. అందువల్ల ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో విఫలమైన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీజీపీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటాలను బదిలీ చేసి మొత్తం ఘటనపై సీబీఐ, ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని