‘సీఎం జగన్‌పైకి రాయి.. అవుతు శ్రీధర్‌రెడ్డికి ముందే ఎలా తెలుసు?’

‘సీఎంపై దాడి అంటే ఆషామాషీ విషయం కాదు.. దాన్ని మేము ఖండిస్తున్నాం. అయితే తెదేపా వారే దాడి చేయించారనడం వైకాపా సిగ్గు మాలిన చర్యలకు ప్రతీక’ అని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు.

Published : 15 Apr 2024 06:53 IST

ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌

ఉరవకొండ, న్యూస్‌టుడే: ‘సీఎంపై దాడి అంటే ఆషామాషీ విషయం కాదు.. దాన్ని మేము ఖండిస్తున్నాం. అయితే తెదేపా వారే దాడి చేయించారనడం వైకాపా సిగ్గు మాలిన చర్యలకు ప్రతీక’ అని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొన్న కోడి కత్తి.. నిన్న గొడ్డలి పోటు.. నేడు గులకరాయితో దాడి.. ఇవన్నీ సీఎం జగన్‌ ముందస్తు కార్యాచరణలో భాగంగా జరిగినవేనని ఆరోపించారు. నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలన ఘటన జరుగుతుందని, అది ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మారుతుందని వైకాపా సామాజిక మాధ్యమ విభాగాన్ని నడిపించే వారిలో ప్రముఖ వ్యక్తి అయిన అవుతు శ్రీధర్‌రెడ్డి నాలుగు రోజుల క్రితమే సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారని చెప్పారు. ఆ పోస్టును కేశవ్‌ విలేకరులకు చూపించారు. సరిగ్గా ఆయన చెప్పిన విధంగానే నాలుగో రోజు సీఎం జగన్‌పై దాడి జరిగిందన్నారు. ఇది చూస్తే దాడి వారి ముందస్తు ప్రణాళికలో భాగమేనన్న విషయం స్పష్టం అవుతుందన్నారు. దీనిని సిగ్గు లేకుండా తెదేపాపై రుద్దడం సబబు కాదని పేర్కొన్నారు. దమ్ముంటే ఈ ఘటనపై సీబీఐ విచారణకు వైకాపా కోరాలని సవాల్‌ విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని