ప్రతిపక్ష నేతపై దాడి భావప్రకటనా స్వేచ్ఛా?

తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించినప్పుడు, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయనపై వైకాపా ప్రేరేపిత అల్లరి మూకలు దాడులకు దిగినప్పుడు వైకాపా నాయకులు,  మాజీ డీజీపీ బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలివి..

Published : 15 Apr 2024 05:18 IST

ముఖ్యమంత్రిపై రాయి విసిరితే హత్యాయత్నమా?
అప్పట్లో ఏం మాట్లాడారో వైకాపా నేతలు మర్చిపోయారా?

తెదేపా అధినేత చంద్రబాబు రాజధాని అమరావతిలో పర్యటించినప్పుడు, ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయనపై వైకాపా ప్రేరేపిత అల్లరి మూకలు దాడులకు దిగినప్పుడు వైకాపా నాయకులు,  మాజీ డీజీపీ బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలివి..

ఆయన పిట్టా.. పావురమా..?

- కొడాలి నాని, అప్పట్లో మంత్రి

‘‘పోలీసు కాపలాతో యాత్ర నడుస్తుంటే... ఆయనపైకి ఎవరో చీకట్లో రాయి విసిరారట. ఆయనను చంపేద్దామని చెప్పి.. ఇంత గులకరాయి విసిరారట. ఆయనేమైనా పావురమా... పిట్టా.. గులకరాయితో కొడితే పోవడానికి? ఎవరు విసురుతారు రాయి? ఆయనే సొంత పార్టీ కార్యకర్తలతో గులకరాళ్లు వేయించుకున్నారు.’’  


ఎవరో తుంటర్ల పని..

- అంబటి రాంబాబు, ప్రస్తుత మంత్రి, అప్పట్లో ఎమ్మెల్యే

‘‘ఓడిపోతున్నామని తెలిసి నాటకం ఆడే పరిస్థితికి దిగజారిపోయిన మాట వాస్తవమా.. కాదా? మీరు అన్యాయంగా, అక్రమంగా కేసులు పెట్టి అందర్నీ వేధించారు కాబట్టి... మీరు వస్తున్నప్పుడు వారు నిరసన చేపట్టారు. ఎవరో తుంటరివాళ్లు రాళ్లు వేసి ఉండొచ్చు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదు.’’  


మోసం చేస్తే.. రాళ్లే పడతాయి..

  - పేర్ని నాని, అప్పట్లో మంత్రి

‘‘వారి కలల్ని కల్లలు చేసి వాళ్లని భ్రమల్లో ఉంచి, కల్పన కలగజేశారు. అవన్నీ వాస్తవరూపం దాల్చకపోయేసరికి ఆ కసి, కోపంతో తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులిచ్చి పువ్వులైతే వేయించుకోగలరు గానీ... ప్రజల్ని మోసం చేస్తే చెప్పులు, రాళ్లే పడతాయి.’’   


మాకేం సంబంధం

- వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే

‘‘ఎమోషనల్‌ కనెక్టివిటీ అన్నది ఒకటుంటుంది. దేశంలో ఏ హింస జరిగినా నేరుగా సంబంధం ఉన్నవాళ్లే చెయ్యరు. వ్యక్తిగతంగా అభిమానించేవాళ్లు ఉంటారు. వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టేవాళ్లూ ఉంటారు. వాళ్లెవరైనా ఏదైనా చేయొచ్చు. మాకేం సంబంధం?’’


కడుపు తరుక్కుపోతే ఏం చేస్తారు?

 - బొత్స సత్యనారాయణ, మంత్రి

‘‘మోసపోయిన రైతులు, బాధతో ఉన్నవారు కడుపు తరుక్కుపోతే ఏం చేస్తారు?’’    


వాళ్లే రాళ్లేసుకుని ఉండొచ్చు కదా..

- తానేటి వనిత, మంత్రి

‘‘ఎంతోమందిని ఇబ్బంది పెట్టారు. కడుపు మండి వాళ్లు తిరగబడి ఉండొచ్చు కదా. వీళ్లకు వీళ్లే రాళ్లేసుకుని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ల కార్యకర్తల్ని వాళ్లే పురమాయించుకుని రాళ్లేసుకుని ఉండొచ్చు కదా...’’


రాళ్ల వర్షమంటూ నాటకం

- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి

‘‘ఇదంతా ఒక డ్రామా. ఒక నాటకం, బూటకం. రాళ్ల వర్షం అన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ చూస్తే అదేమీ కనిపించలేదు. రాళ్లు వెయ్యకపోయినా వేసినట్టు చూపించి, సానుభూతి పొంది... దాంతో ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచనే ఇది.’’


యాత్ర హైలైట్‌ కోసమే...

 - కురసాల కన్నబాబు, అప్పట్లో మంత్రి

‘‘యాత్రకు వెళ్లి హైడ్రామా క్రియేట్‌ చేస్తున్నారు. యాత్ర హైలైట్‌ కావాలంటే అక్కడేదో జరిగిపోతున్నట్టు, తన మీదేదో దాడులు చేస్తున్నట్టు చూపించాలని అక్కడో వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు.’’  


విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం

- జోగి రమేష్‌, అప్పట్లో ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి

‘‘నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విసిరించుకోవడం’’


అది భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగమే..

- అప్పటి డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

‘‘కొందరు రైతులు చెప్పులు విసిరారని, అల్లరి చేశారని, గ్లాస్‌ పగిలిందని... చెబుతున్నారు. వేసినవాళ్లు ఎవరు? ఎందుకు వేశారు? మనం మొన్ననే రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికీ నిరసన తెలియజేసే, భావాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. దానిలో భాగమే అది.’’


ఈనాడు, అమరావతి: ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. అది చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా కీలకమైన పదవుల్లో ఉన్నవారు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో స్పందించాలి. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేతపై రాళ్లదాడులు జరిగితే మంత్రులు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో చెప్పడానికి వారి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి. హింసాకాండను నివారించాల్సిన, దాడులకు దిగినవారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అప్పటి డీజీపీ కూడా తన కర్తవ్యాన్ని మర్చిపోయి, వైకాపా కార్యకర్తలా ఇష్టానుసారం మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే... అది భావప్రకటన స్వేచ్ఛని, నిరసన తెలిపే హక్కని, సానుభూతి కోసం వారి మనుషులతోనే దాడి చేయించుకున్నారని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసిన వైకాపా నాయకులు... ఇప్పుడు వారి నాయకుడు, సీఎం జగన్‌పై దాడి జరిగితే శివాలెత్తిపోతున్నారు. ప్రొటోకాల్‌ పరంగా రాష్ట్రంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ముఖ్యమంత్రిపై గుర్తుతెలియని వ్యక్తి రాయితో దాడి చేయడం ఘోర భద్రతా వైఫల్యానికి నిదర్శనం. దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని వైకాపా నేతలు... సీఎంపై దాడికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారు. సీఎంపై ఎప్పుడు దాడి జరుగుతుందా, ఎప్పుడు విపక్ష నేతలపై విరుచుకుపడదామా అని కాచుకుని కూర్చున్నట్టుగా... ఇలా ఆ ఘటన జరిగిందో లేదో మరుక్షణం ప్రతిపక్ష నాయకులపై విరుచుకుపడటం మొదలు పెట్టారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల ఫొటోలను చెప్పులతో కొట్టారు. ఫ్లెక్సీలు తగలబెట్టారు. రాస్తారోకోలు చేశారు. అంతా ముందే సిద్ధం చేసుకున్నట్టుగా... సీఎంపై దాడి జరిగిన కొద్దిసేపటికే ఇవన్నీ జరిగిపోయాయి. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే అది భావప్రకటన స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేయడమా? అదే ముఖ్యమంత్రిపై దాడి జరిగితే అది హత్యాయత్నమా? మంత్రులకు, వైకాపా నాయకులకు వారేం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భద్రతా వైఫల్యంపై మాట్లాడరేం?

సీఎం అంటేనే వివిధ అంచెల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆయన ఏ సభలో పాల్గొన్నా ఎవరైనా ఎటునుంచైనా దాడి చేస్తారేమోనని భద్రతా అధికారులు డేగకళ్లతో పర్యవేక్షిస్తుంటారు. జగన్‌ భద్రత గురించి చెప్పాల్సిన పనేలేదు. ఆయన రోడ్డుపైకి వస్తున్నారంటేనే పరదాలు కట్టేస్తారు, బారికేడ్లు పెట్టేస్తారు, చివరకు పచ్చటి చెట్లూ కొట్టేస్తారు. అలాంటిది శుక్రవారం రాత్రి ఆయనపై జరిగిన దాడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నా వైకాపా నాయకులెవరూ దాని గురించి మాట్లాడలేదు. సీబీఐ, ఎన్‌ఐఏ లాంటి సంస్థలతో దర్యాప్తునకు డిమాండ్‌ చేయాల్సింది పోయి... విపక్షాలపై ఆరోపణలు చేయడమేంటనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. విజయవాడలో జగన్‌ పర్యటిస్తున్న సమయంలో ప్రతి సెంటర్‌లో కరెంటు ఎందుకు తీసేశారు? సీఎంకి రాయి తగిలిందని చెబుతున్న సమయంలో భద్రతా సిబ్బంది ఎందుకు కూర్చుని ఉన్నారు? ఆ సమయంలో సాక్షి ఛానల్‌లో లైవ్‌ ఎందుకు ఇవ్వలేదు? అది ప్రధాన కూడలి కానప్పుడు, అక్కడ పెద్దగా జనం కూడా లేనప్పుడు జగన్‌ బస్సుపైకి ఎందుకు ఎక్కారు? ప్రొటోకాల్‌ పరంగా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉండే సీఎంపైకి రాయి విసిరారంటే... దుండగుడు అక్కడకు సమీపంలోనే ఉంటాడు. వందల సంఖ్యలో ఉండే భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే ఆ దుండగుడిని గుర్తించి ఎందుకు పట్టుకోలేదు? రాయి విసిరిన వారెవరో ఇప్పటికీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఇలాంటి ప్రశ్నలెన్నో ప్రజల నుంచి వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని