పిచ్చోడి చేతిలో రాయి.. జగన్‌ చేతిలో అధికారం.. రెండూ ఒక్కటే

పిచ్చోడి చేతిలో రాయి, జగన్‌ చేతిలో అధికారం రెండూ ఒక్కటేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని జగన్‌పై ధ్వజమెత్తారు.

Updated : 15 Apr 2024 06:43 IST

వైకాపా పాలనలో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారు
స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో నందమూరి బాలకృష్ణ

ఈనాడు డిజిటల్‌, అనంతపురం, న్యూస్‌టుడే, శింగనమల: పిచ్చోడి చేతిలో రాయి, జగన్‌ చేతిలో అధికారం రెండూ ఒక్కటేనని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అరాచక పాలనతో రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు అని మండిపడ్డారు. స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో భాగంగా ఆదివారం ఆయన శింగనమల, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గాల్లో పర్యటించి మాట్లాడారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రసంగించే జగన్‌.. ఆ వర్గాలకు చేసిందేమి లేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను, సీపీఎస్‌ రద్దు చేయకుండా ఉద్యోగులను మోసం చేశారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. వైకాపా హయాంలో వ్యవసాయశాఖను నిర్వీర్యం చేశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. జగన్‌ మళ్లీ గెలిస్తే ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజల్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తెస్తారేమో! అందుకే ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు విరిచేయాలి’ అని బాలకృష్ణ పిలుపునిచ్చారు.


దళితులకు రెండెకరాల సాగుభూమి

‘వైకాపా పాలనలో దళితులపై దాడులు పెరిగాయి. జగన్‌ దళితుల ద్రోహిగా మిగిలిపోయారు. తెదేపా అధికారంలోకి రాగానే దళితులకు రెండెకరాల సాగుభూమి అందిస్తాం. ఎస్సీ వర్గీకరణ చేసి దళితులకు న్యాయం చేస్తాం. అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకాన్ని మళ్లీ తీసుకొస్తాం. ముస్లింల కోసం దుల్హాన్‌ పథకం ద్వారా రూ.లక్ష సాయం చేస్తాం. ఉర్దూ పాఠశాలలు, గురుకులాలు నెలకొల్పుతాం’ అని బాలకృష్ణ హామీలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని