దళితుల జీవన ప్రమాణాలు పెంచింది తెదేపా.. వారిని అణచివేసింది వైకాపా

దళితులు అణచివేతకు గురవకుండా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వారిని పైకి తీసుకువస్తే.. ఎన్నికల ముందు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా ఆయా వర్గాలవారిని నిండాముంచారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు.

Published : 15 Apr 2024 05:41 IST

ఎన్డీయే నేతలు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దళితులు అణచివేతకు గురవకుండా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వారిని పైకి తీసుకువస్తే.. ఎన్నికల ముందు వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిన జగన్‌ అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకుండా ఆయా వర్గాలవారిని నిండాముంచారని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ధ్వజమెత్తారు. దళితులతో తనకు బంధుత్వముందని 2019 ఎన్నికల ముందు నమ్మబలికి ఓట్లను కొల్లగొట్టి, తెదేపా హయాంలోని పథకాలన్నింటినీ రద్దు చేశారని మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్డీయే నేతలతో కలిసి ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో దళితుల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి వారి జీవన ప్రమాణాలు పెంచింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆయా వర్గాల వారిని ఆదుకోవడం పక్కనపెట్టి అణచివేతకు గురిచేసింది’ అని మాణిక్యరావు దుయ్యబట్టారు. ‘సీఎం జగన్‌ నమ్మినవారిని నట్టేటముంచే వ్యక్తి. ఆయన తల్లి, చెల్లిని సైతం అలాగే మోసం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారిమళ్లించిన ఏకైక సీఎం జగన్‌. భూమి కొనుగోలు పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు’ అని భాజపా నేత ఆర్‌డీ విల్సన్‌ విమర్శించారు. ‘అంబేడ్కర్‌ పై గౌరవమున్నట్లు వైకాపా నాయకులు నటిస్తూ వారి సొంత మీడియాలో ప్రకటనలు వేసుకుంటున్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన వైకాపా ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసింది. అయిదేళ్ల పాలనలో దళితుల జీవితాలతో జగన్‌ చెలగాటమాడారు. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు దారిమళ్లించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి’ అని జనసేన నేత పెదపూడి విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని