దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తాం

‘‘దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్తాం. అవినీతిపరులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటాం.

Published : 15 Apr 2024 05:43 IST

మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ

ఈనాడు, దిల్లీ: ‘‘దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్తాం. అవినీతిపరులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటాం. వచ్చే వెయ్యేళ్ల భవిష్యత్తును నిర్ణయించే సమయమిదే. ఫలితాలు వచ్చిన వెంటనే మేనిఫెస్టో అమలుకు వేగంగా చర్యలు తీసుకుంటాం. దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి మరోసారి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా’’ అని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం (వికసిత్‌ భారత్‌)గా నిలిచేలా ‘మోదీ కీ గ్యారంటీ’ పేరుతో ఆదివారం భాజపా మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశాలు..

చిరు ఉత్పత్తులకు మార్కెటింగ్‌

  • స్వయం సహాయక సంఘాలను ఒక జిల్లా-ఒక ఉత్పత్తి, రైతు ఉత్పత్తి సంఘాలు, ఏక్తామాల్‌, ఓఎన్‌డీసీ (ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌), జీఈఎం, ఒక స్టేషన్‌-ఒక ఉత్పత్తి పథకాలతో అనుసంధానం చేసి, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లభ్యతను పెంచడం
  • పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలకు సమీపంలో మహిళలకు అనుకూలంగా వసతి గృహాలు, శిశు సంరక్షణ కేంద్రాల నిర్మాణం
  • మహిళల్లో రక్తహీనత, రొమ్ముకేన్సర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, ఆస్టియోపొరాసిస్‌ లాంటి సమస్యలను నివారించడానికి వైద్య ఆరోగ్యసేవల విస్తరణ. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ
  • పంటనష్టాన్ని కచ్చితంగా అంచనావేసి, రైతులకు వేగంగా పరిహారం చెల్లించి, ఫిర్యాదులను పరిష్కరించేలా పీఎం ఫసల్‌బీమా యోజన బలోపేతం
  • పంటలకు ఎప్పటికప్పుడు కనీస మద్దతు ధర పెంపు
  • వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, నాణ్యత ప్రకారం విభజన, శీతల గిడ్డంగులు, ఆహారశుద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు ‘కృషి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌’ ప్రారంభం
  • వ్యవసాయ అవసరాలకోసం ప్రత్యేక శాటిలైట్‌ ప్రయోగం. పంటల దిగుబడి అంచనా, పురుగుమందుల అవసరం, సాగునీరు, భూసారం, వాతావరణ ముందస్తు అంచనా, తదితరాల కోసం దీని వినియోగం
  • ‘ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌’ ద్వారా చిన్న వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు సాంకేతికతను ఉపయోగించుకుని తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు బాటలు
  • గిరిజన చిన్నారుల్లో పౌష్టికాహారలోపం నిర్మూలన. గిరిజన ప్రాంతాల్లో సమగ్ర వైద్యఆరోగ్య సౌకర్యాల కల్పన. సికిల్‌సెల్‌ అనీమియా నిర్మూలన దిశగా కార్యాచరణ
  • సరిహద్దు ప్రాంతాల్లో రహదారులు, రైల్వే, టెలికాం టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌, విద్యుత్తు నెట్‌వర్క్‌ నిర్మాణం. ఇండో-చైనా, పాకిస్థాన్‌, మయన్మార్‌ సరిహద్దుల్లో బలమైన మౌలిక వసతుల నిర్మాణం
  • తయారీ, సేవలు, గ్రామీణ పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి రంగాలపై దృష్టిసారించి.. స్వనిధి, ముద్ర యోజన కింద రుణ వసతి కల్పించి.. యువతకు ఉద్యోగావకాశాలు పెంపొందించడం
  • సరిహద్దు రాష్ట్రాల్లో దశలవారీగా ‘సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం’ (ఏఎఫ్‌ఎస్‌పీఏ) తొలగింపు
  • అటవీ ఉత్పత్తులకు మార్కెట్‌ పెంపు
  • 700 ఏకలవ్య పాఠశాలల నిర్మాణం
  • ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల నిర్మాణం. పురాతన తమిళ భాష ప్రతిష్ఠను పెంచేందుకు చర్యలు
  • ట్రక్కు డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల్లో మౌలిక వసతుల నిర్మాణం. హైవే, రైల్వే, ఎయిర్‌పోర్టుల ఆధునికీకరణ, విస్తరణ. నాలుగో దశ పారిశ్రామికీకరణకు డిజిటల్‌ వ్యవస్థ ఆధునికీకరణ.
  • కొత్త శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం. పౌర విమానయాన రంగం విస్తరణ
  • దేశం నలుమూలలకూ వందేభారత్‌ స్లీపర్‌, ఛైర్‌కార్‌, మెట్రోరైళ్ల విస్తరణ
  • ఉత్తర, దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లోనూ బులెట్‌ రైలు కారిడార్ల నిర్మాణానికి త్వరలో సర్వే
  • ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి ట్రాన్స్‌జెండర్లు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని