ముఖ్యమంత్రికి కనీస భద్రత ఇవ్వలేరా?

రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రికే రక్షణ ఇవ్వలేని స్థితిలో పోలీస్‌ శాఖ ఉందని.. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 15 Apr 2024 06:42 IST

డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ రాజీనామా చేయాలి
కోడికత్తి కేసు డ్రామా రెండో వెర్షనే.. రాయితో దాడి
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రికే రక్షణ ఇవ్వలేని స్థితిలో పోలీస్‌ శాఖ ఉందని.. తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు విసురుతుంటే భద్రతా వలయం ఏమైందని ప్రశ్నించారు. సీఎం పర్యటన ప్రాంతానికి విద్యుత్తు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందని, చీకట్లో జగన్‌ రోడ్‌షోకు ఎలా అనుమతించారని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు రక్షణ కల్పించడంలో డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లు పూర్తిగా విఫలమయ్యారని.. వారు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. వందలమంది పోలీసుల వలయంలో ఉన్న జగన్‌కు రాయి ఎలా తాకిందని ప్రశ్నించారు. గతంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నట్లు.. ‘భావ ప్రకటన స్వేచ్చ’ అనుకోవాలా? లేక ప్రచార లబ్ధి, సానుభూతి కోసం పన్నిన కుట్ర అనుకోవాలా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులకు కట్టుదిట్టమైన భద్రత ఇవ్వగలిగే సమర్థులైన డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు వచ్చినపుడల్లా జగన్‌పైనే దాడులు జరుగుతుండడం చూసి దేశంలోని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. పోలీసుల ప్రాథమిక విచారణ అంశాలు బయటకు రాకముందే.. అధికార పార్టీ నాయకులు జరిగిన సంఘటనను చంద్రబాబునాయుడికి ఆపాదించడాన్ని ఉమా ఖండించారు. 2019లో కోడి కత్తి, బాబాయి గొడ్డలితో ప్రజలను మభ్యపెట్టినట్టే.. 2024లో మరో అంకానికి ఇది తొలి ప్రయత్నమా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కోడికత్తి కేసు డ్రామా రెండో వెర్షనే రాయితో దాడి అని దుయ్యబట్టారు. ఇది డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ నేతృత్వంలో రూపొందించిన డ్రామా అని అన్నారు. 2019లో విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడికి, ఈ గులకరాయి దాడికి పెద్దగా తేడా ఏమీ లేదన్నారు.

ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే పేర్ని నాని, అంబటి రాంబాబు లైవ్‌లోకి వచ్చి.. ఇదంతా తెదేపా చేయించిందంటూ మీ మీడియాలో ప్రచారం చేయడం.. ముందస్తు ప్రణాళిక కాదా అని ప్రశ్నించారు. ఎన్ని నాటకాలు ఆడినా.. ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ‘నాలుగు రోజుల్లో ఎన్నికల మూడ్‌ను మార్చేసే.. సంచలనమైన సంఘటన జరుగుతుందంటూ వైకాపా నేత అవుతు శ్రీధర్‌రెడ్డి చెప్పిన నాలుగోరోజే.. ఈ గులకరాయి సంఘటన జరగటం డ్రామాలో భాగం కాదా?’ అని బొండా ప్రశ్నించారు. ఘటన జరిగిన 4వ నిమిషానికే క్యాట్‌ బాల్‌ ఉపయోగించారని.. సాక్షి నీలి మీడియాకు, జగన్‌ సోషల్‌ మీడియాకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఘటన జరిగినపుడు అక్కడ ఉన్నదంతా వైకాపా కార్యకర్తలు, పోలీసులే అని.. మరి ఎందుకు నిందితుడిని పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. ఇది సీపీ వైఫల్యామా? లేక కుట్రలో భాగమా? వీటికి పోలీసు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


నేను అనని మాటల్ని అన్నట్టు ప్రచారం

‘కొండ మీద అమ్మవారు.. కొండ కింద కమ్మవారు’ అని నేను అనని మాటలు కూడా అన్నట్టు వైకాపా, సాక్షి మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అబద్ధపు పునాదులపై చేస్తున్న మీ పాలన కూలిపోవడం ఖాయం. ప్రజలు మీ దొంగ నాటకాలను నమ్మనుకాక నమ్మరు’ అంటూ బొండా ఉమా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని