జగన్‌పై దాడి ప్రభుత్వ వైఫల్యమే

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెదేపా రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. పలాసలో విలేకరులతో ఆయన మాట్లాడారు.

Published : 15 Apr 2024 05:48 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు

ఈనాడు, న్యూస్‌టుడే, యంత్రాంగం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని తెదేపా రాష్ట్ర అద్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. పలాసలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సీఎం బస్సు యాత్ర తుస్సుమంది. 3,500 బస్సుల్లో జనాలను తరలించి బిర్యానీ, డబ్బులు ఇచ్చినా విఫలమవడంతో జగన్‌ కొత్త డ్రామాకు తెర లేపారు. రాయితో దాడి జరిగితే మూడు గంటల అనంతరం ఆసుపత్రికి వెళ్లడమేంటి? ముఖ్యమంత్రి పాల్గొన్న యాత్రలో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, దాడి జరిగిన ఒక్క నిమిషానికే రాయి కాదు క్యాట్‌ బాల్‌తో దాడి జరిగిందంటూ ప్రచారం చేయించడం.. ఘటనకు చంద్రబాబే కారణమని వైకాపా శ్రేణులు ప్లకార్డులతో ధర్నాలు చేయడం వెనుక కుట్ర దాగి ఉంది. జగన్‌పై దాడి ప్రభుత్వ వైఫల్యమే. పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడే ఉండి ఏం చేస్తున్నారు? దాడి చేసిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారు? 2019 ఎన్నికల ముందు విశాఖపట్నంలో కోడి కత్తి, వివేకానందరెడ్డి హత్యను అడ్డు పెట్టుకుని సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారు. మరోసారి సానుభూతి ఓట్ల కోసం రాయి డ్రామా ఆడుతున్నారు. జగన్‌పై దాడి జరిగితే చంద్రబాబు స్పందించలేదని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం విడ్డూరంగా ఉంది. దాడి జరిగిన సమయంలో ఆయన విమాన ప్రయాణంలో ఉన్నారు. దిగిన వెంటనే స్పందించారు. అయిదేళ్లలో చంద్రబాబుపై ఎన్నోసార్లు దాడులు జరిగినా ఎవరైనా స్పందించారా? గతంలో జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు పెట్టి జైలుకెళ్లిన వ్యక్తి త్వరలో సంచలన సంఘటన జరుగుతుందంటూ ఎక్స్‌లో ట్వీట్‌ చేసిన నాలుగు రోజుల్లో ఈ దాడి జరిగింది. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని అచ్చెన్నాయుడు అన్నారు.  


ఓటమి భయంతోనే.. గులకరాయి డ్రామా!

మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిని ఖండిస్తున్నాం. కానీ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఈ డ్రామాకు తెరదీశారని అర్థమవుతోంది. దాడికి పాల్పడిన వారిని వదిలేసి.. మంత్రులంతా చంద్రబాబుపై ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని సీఎస్‌, డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌లను ఈసీ తక్షణమే విధుల నుంచి తప్పించాలి. జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగినప్పటి నుంచి ప్రతిక్షణం మంత్రులు, వైకాపా నాయకులు చంద్రబాబునాయుడి కుట్ర, ప్రతిపక్షాల కుట్ర అనడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రిపై దాడి జరుగుతుంటే డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, చీఫ్‌ సెక్రటరీ ఏం చేస్తున్నారు. ముందుకు వారిపై చర్యలు తీసుకోండి. ఇదంతా చంద్రబాబు కుట్ర అని మాట్లాడుతున్న హోమంత్రి.. దాడి చేసిన వారిని పట్టుకోకుండా ఏం చేస్తున్నారు? గతంలో విశాఖలో పిన్నీసు గుచ్చుకున్నంత గాయమైతే.. ఏపీలో చికిత్స చేసే వైద్యులు లేరని, హైదరాబాద్‌ వెళ్లారు. ఏపీలో పోలీసులను చేతకానివాళ్లుగా చూపి, ఎన్‌ఐఏ దర్యాప్తు కోరారు. వారు విచారణ జరిపి.. అందులో కుట్రలు, కుతంత్రాలు లేవని తేల్చారు. శ్రీనును అయిదేళ్లు అన్యాయంగా జైలులో ఉంచారు. వివేకానందరెడ్డి చనిపోతే మొదట గుండెపోటు అని మీరే చెప్పారు. తర్వాత చంద్రబాబు చంద్రబాబు అంటూ పాటెత్తుకున్నారు. ఇప్పుడు ఆ కేసులో నిందితులు ఎవరో ముఖ్యమంత్రి చెల్లెళ్లే చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా, మా చిన్నాయన్ని చంపేశారు, ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరలేపారు’


మీకే భద్రత లేదంటే.. అది మీ చేతగానితనమే

- మాజీమంత్రి, తెదేపా నేత నక్కా ఆనందబాబు

‘జగన్‌పై రాయి దాడి నూటికి నూరు శాతం పథకం ప్రకారం జరిగిందే. మరో కోడికత్తి డ్రామాకు తెర తీసి అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యారు’.. ఈ తరహా కుటిల రాజకీయాలకు కాలం చెల్లింది. పదేపదే చేస్తుంటే ఇలాంటివి ఎవరూ నమ్మరు. రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన సీఎంకే భద్రత లేదంటే.. అది చేతగానితనానికి నిదర్శనం. రోడ్‌షోలో ప్రతిసారీ కరెంట్ తీసి నాటకాలాడారు. భద్రతా సిబ్బంది మోకాళ్లపై కూర్చుని తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను రక్తి కట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. దీనిని అడ్డుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ప్రజలకు అర్థమై అసహ్యించుకుంటున్నారు. మీ కార్యకర్తల్లోనే ఈ పని ఎవరు చేశారో గుర్తించి వాళ్లను అరెస్టు చేయాలి. అలా కాకుండా ఎస్సీనో, బీసీనో బలి చేయొద్దు. బాబాయ్‌ వివేకా హత్య రక్తపు పునాదులపై జగన్‌ ప్రభుత్వం ఏర్పడిందని చెల్లెమ్మలు చెబుతున్నారు. సొంత చెల్లెళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నా జగన్‌ ఎందుకు స్పందించడం లేదు? గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడి దళిత యువకుణ్ని జైల్లో మగ్గేలా చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే ఈ దాడి ఘటనపై విచారణ చేయించి దోషుల్ని శిక్షిస్తాం’


రాయి జగన్‌కే ఎలా తగిలింది?

- కేంద్ర మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత పి.అశోక్‌గజపతిరాజు

‘జగన్‌ ముందు అంతమంది రక్షణగా ఉన్నా రాయి ఆయనకే ఎలా తగిలింది? పుంగనూరులో చంద్రబాబుపై ప్రణాళిక ప్రకారం రాళ్లు విసిరినా రక్షణ సిబ్బంది అడ్డుగా ఉండటంతో ఆయనకు తగలలేదు. జగన్‌ బస్సు యాత్రలో అంతమంది రక్షణ సిబ్బంది ఉండగా ఆయనకే రాయి ఎలా తగిలిందో వారే చెప్పాలి’


ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

- మాజీమంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ

‘జగన్‌ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో రక్తపాతం జరుగుతుందేమో. జగన్‌ పాలనలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు నశించాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరముంది. తనను తాను రక్షించుకోలేని జగన్‌.. ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తారు? ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలి. భద్రతా వైఫల్యం వల్లే రాయి దాడి జరిగింది. డీజీపీని తక్షణమే విధుల నుంచి తప్పించాలి’  


ఈ దాడిపై అనేక అనుమానాలు

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

‘ఈ దాడిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అత్యంత రక్షణ వలయంలో ఉండే సీఎంపైనే దాడి అమానుషం. రాజకీయాల్లో విమర్శలు, ఆత్మవిమర్శలు ఉండాలే తప్ప, భౌతిక దాడులు సరికాదు. ఈ ఘటనపై అధికార, విపక్ష నేతలు ఒకరిపై ఒకరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని నివృత్తి చేయాలంటే ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా విచారణ చేయాలి’


సీఎంపై దాడి..హేయమైన చర్య!

- భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి  

‘సీఎం జగన్‌పై జరిగిన దాడి హేయమైన చర్య. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’  


ప్రజల సానుభూతి కోసం డ్రామా ఇది

- తెదేపా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

‘ఎన్నికల్లో ప్రజల సానుభూతి కోసం వైకాపా గులకరాయి డ్రామా మొదలుపెట్టింది. జగన్‌రెడ్డి ప్రచారంలో తీవ్ర ప్రజావ్యతిరేకత రావడంతో కొత్త నాటకం ఆడుతున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో జగన్‌రెడ్డి చెప్పుకోడానికి ఒక్క మంచి పనీ చేయలేదు. అనుభవరాహిత్యం, అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అయిదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ తేలేదు. ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. రాష్ట్ర పురోగతిని బలి పెట్టి అరాచకత్వంతో ఏపీని అంధకారంలోకి నెట్టారు. ‘రాష్ట్రంలో సంచలన సంఘటన జరుగుతుంది ఎన్నికల వాతావరణాన్ని మార్చేస్తుందంటూ’ వైకాపా నేత అవుతు శ్రీధర్‌రెడ్డి చెప్పిన నాలుగో రోజే గులకరాయి సంఘటన జరగడం ఈ డ్రామాలో భాగం కాదా? విజయవాడలో జగన్‌ ప్రచారం సాగే ప్రాంతంలో రాత్రి 7 గంటలకు కరెంటు తీయడం 8.10కి దాడి, 11 గంటలకు కుటుంబ సమేతంగా ఆసుపత్రికి వెళ్లడం మీ సానుభూతి నాటకాలు కావా?’


డీజీపీ అసమర్థత వల్లే ఈ పరిణామం..

- భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

‘అసమర్థ డీజీపీ వల్లనే సీఎం జగన్‌పై దాడి జరిగింది. సీఎంకి భద్రత ఇవ్వలేని డీజీపీ, నిఘా విభాగం ముఖ్య అధికారి ప్రతిపక్ష నేతలకు ఎలా ఇస్తారు. వారిని వెంటనే విధుల నుంచి తొలగించి సమర్థులైన అధికారులను నియమించాలని రాష్ట్ర భాజపా తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాం. ‘బెంగాల్‌లో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రంలో జగన్‌పై ఎన్నికల సమయంలోనే దాడులు జరగడం విస్మయకరం. ఆ దాడి చంద్రబాబే చేయించారని వైకాపా ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 2019లో కోడికత్తి, బాబాయి హత్యతో ప్రజలను మభ్యపెట్టినవాళ్లు 2024లోనూ అదే తరహా ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో భారీ ఓటమి తప్పదని తెలిసి వైకాపా ఇలాంటి డ్రామాలు ఆడుతోంది.’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని