ఖర్సయిపోతున్నాం..!

‘శాసనసభ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు తిరగకముందే లోక్‌సభ పోరుకు సిద్ధం కావాల్సి రావడంతో నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి.

Updated : 16 Apr 2024 03:34 IST

ప్రచార పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు
అసెంబ్లీ వెంటే లోక్‌సభ ఎన్నికలు రావడమే కారణం
పార్టీ కార్యక్రమాలతో జేబులు గుల్లవుతున్నాయని ఆవేదన
ప్రచారం జోరందుకుంటున్న తరుణంలో పార్టీలకు సంకట పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: ‘శాసనసభ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు తిరగకముందే లోక్‌సభ పోరుకు సిద్ధం కావాల్సి రావడంతో నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ద్వితీయశ్రేణి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టలేక లబోదిబోమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనాన్ని తరలించినంత ఉత్సాహంగా.. లోక్‌సభ ఎన్నికల్లో కిందిస్థాయి నాయకులు స్పందించడంలేదని పలు పార్టీల పెద్ద నాయకులు చెబుతున్నారు. ఇటీవల రెండు ప్రధాన పార్టీలు నిర్వహించిన సభలకు జనసమీకరణ కోసమని.. పలు జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి నాయకులకు ఒకటికి పదిసార్లు ఫోన్లు చేసి గట్టిగా చెబితే గానీ పని కాలేదని ఆ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలు పడి మరీ జనసమీకరణ చేసిన కొందరు నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. డబ్బులు సమకూరిస్తేనే ఏ పనైనా చేయగలమని.. లేదంటే తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నట్లు సమాచారం.

భవిష్యత్తేమిటో అర్థం కాక..

‘లోక్‌సభ ఎన్నికలతో మాకేం ఒరుగుతుంది? పోయిన ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులే మాకు వెనక్కి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఖర్చు చేయలేం.. కార్యక్రమాలకు రాలేం..’ అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు దూరంగా ఉంటున్నారని దక్షిణ తెలంగాణ జిల్లాకు చెందిన ఓ పార్టీ నేతలు వాపోయారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోవాల్సిన ఈ తరుణంలో కింది నాయకులు చేతులెత్తేస్తుండడం అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. పార్టీలో ప్రాధాన్యం కోసం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీపడి డబ్బులు ఖర్చు చేసినవారు.. ఇప్పుడు ప్రత్యర్థులు పలువురు పార్టీలో చేరుతుంటే తమ పరిస్థితి ఏమిటని తలలు పట్టుకుంటున్నారు. రాజధాని పరిధిలో పలువురు తమ భవిష్యత్తేమిటో అర్థం కాక.. మరోసారి ఖర్చు చేసేందుకు ముందుకు రావడంలేదని సమాచారం.

  • ఇటీవల తమ పార్టీ సభకు ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించిన ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఓ నాయకుడికి రూ.7 లక్షలు ఖర్చయింది. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మళ్లీ మరోసభకు జనాన్ని తరలించాలని ఓ కీలక నేత చెప్పడంతో ఆ చోటా నాయకుడు ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికే రూ.అర కోటి పెట్టుబడి పెట్టగా.. ప్రత్యర్థులు పార్టీలో చేరడంతో కష్టంగా మారిందని ఒక నాయకుడు చెప్పారు.
  • మొన్నటి ఎన్నికల్లో రూ.కోటిన్నర వరకు పెట్టుబడి పెట్టిన ఓ పార్టీ ద్వితీయశ్రేణి నాయకుడు.. లోక్‌సభ ఎన్నికల్లో తన వల్ల కాదని తప్పించుకుంటున్నారు. మళ్లీ మంచి రోజులొస్తాయని నాయకులు బుజ్జగించినా.. పార్టీ కార్యక్రమాలకు ఆయన పైసలు తీయడం లేదని సమాచారం.
  • జిల్లాలో సభ అంటే కనీసం మూడు వేల మందినైనా తీసుకురావాలని నాయకులకు పలు పార్టీలు సూచిస్తున్నాయి. లారీలు, వ్యాన్లకు అద్దెలు పెరగడం, బిర్యానీ, మద్యం, నగదు.. ఇలా మొత్తం ఖర్చు ఒక్కో సభకు రూ.20 లక్షలకు తగ్గడం లేదని పలువురు నాయకులు చెబుతున్నారు.
  • ఎండలు తీవ్రంగా ఉండటంతో ఆర్టీసీ బస్సులే పెట్టాలని కార్యకర్తలు కోరుతుండడం.. ఛోటా నాయకులకు మరో భారమవుతోంది. ప్రైవేటు వాహనాలైతే ఎవరో ఒకరిని బతిమిలాడి.. డీజిల్‌ పోసి తెచ్చుకోవచ్చని, కానీ ఆర్టీసీ బస్సులో ముందే ఛార్జీ చెల్లించాల్సి రావడం, నిర్దిష్ట గంటలు దాటితే అదనపు చెల్లింపులు తట్టుకోవడం కష్టంగా ఉందని వాపోతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని