జగన్‌ది విధ్వంసం.. కూటమిది నిర్మాణం

‘మొక్కకు నీరు పోసి పెంచితే పెరిగి పెద్దదై మహావృక్షమై ఫలాలు, నీడనిస్తుంది. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మీరు విజ్ఞతతో ఎన్డీయేకు ఓటేస్తే వృథా పోదు. మీ అభివృద్ధి, అభ్యున్నతికి బాటలు వేస్తుంది.

Updated : 16 Apr 2024 08:57 IST

ఎవరి పాలన కావాలో ప్రజలే ఆలోచించాలి
నాతో ఉంటే వాలంటీర్లకు భవిష్యత్తు
రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకే కష్టపడుతున్నా
జె‘గన్‌’రెడ్డీ.. గులకరాయి డ్రామాలు ఆపు
రాజాం, పలాస ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు- విజయనగరం, ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే - రాజాం, గరివిడి, రేగిడి, టెక్కలి: ‘మొక్కకు నీరు పోసి పెంచితే పెరిగి పెద్దదై మహావృక్షమై ఫలాలు, నీడనిస్తుంది. అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మీరు విజ్ఞతతో ఎన్డీయేకు ఓటేస్తే వృథా పోదు. మీ అభివృద్ధి, అభ్యున్నతికి బాటలు వేస్తుంది. మీ జీవితాలకు మాది భరోసా. రాష్ట్రంలో అందలం ఎక్కిన తొలిరోజు నుంచే రివర్స్‌ పాలనకు శ్రీకారం చుట్టిన జగన్‌ది అరాచకం.. విధ్వంసం. మా కూటమి విధానం నిర్మాణం.. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాం, శ్రీకాకుళం జిల్లా పలాసలలో సోమవారం ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. నవ్యాంధ్రప్రదేశ్‌ బాగుకు ఏనాడూ ఆలోచించని జగన్‌కు ఈ సభ నుంచే ‘జె-గన్‌ రెడ్డి’ అని నామకరణం చేస్తున్నానన్నారు. ‘ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీరు, రహదారులు, విద్యాలయాలు అవసరం. కానీ ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. రాజాం నుంచి పాలకొండ రోడ్డు ఆ పరిస్థితికి అద్దం పడుతోంది’ అని ఎద్దేవా చేశారు. ఈ రహదారిలో ఎంతమంది ప్రాణాలు విడిచారో అందరికీ తెలుసని.. ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. కూటమి సభలకు స్వచ్ఛందంగా వచ్చిన జనాలను చూసి వైకాపా నాయకులకు దడ పుడుతోందన్నారు.

‘అసాక్షి’లో అందమైన అబద్ధాలు..

రాష్ట్రాన్ని బాగు చేయాలన్న కమిట్‌మెంట్‌ ఉందా అని జగన్‌ను తెదేపా అధినేత ప్రశ్నించారు. తెదేపా పాలనలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని తీసుకొచ్చాం. రూ.రెండు వేల కోట్లు ఖర్చు చేశాం.. వైకాపా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో రూ.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.16 వేల కోట్లు వెచ్చించాం. ఆయన సొంత పత్రిక అసాక్షి తప్పుడు కథనాలు రాస్తోంది. ఆ పత్రికకు రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలిచ్చారు. ఈ సొమ్ముతో ఉత్తరాంధ్రలో జలవనరుల ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. రాష్ట్ర విభజన అనంతరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే రవాణా మార్గాలు మెరుగుపడాలని అప్పట్లో భావించాం. ఆ ఉద్దేశంతోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అవసరమైన భూములు సేకరించాం. నేను అధికారంలో ఉంటే భోగాపురం విమానాశ్రయం 2020 నాటికే పూర్తయ్యేది. తిక్కలోడు వచ్చి రివర్స్‌ చేశారు.

గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడుందో..

విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని పూర్తిచేయలేకపోయారని చంద్రబాబు మండిపడ్డారు. నేను శంకుస్థాపన చేశానన్న అక్కసుతో వేరే చోటుకు మార్చారు. విశాఖలో రూ.40 వేల కోట్ల ఆస్తులను హస్తగతం చేసుకున్నారు. విశాఖను మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చారు. విదేశాల నుంచి 25 వేల కిలోల డ్రగ్స్‌ సముద్ర మార్గంలో దిగుమతి అవడం ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతుందా. ఐటీ హబ్‌గా మార్చేందుకు ఎన్నో మల్టీ నేషనల్‌ కంపెనీలను తీసుకొస్తే వాటిని తరిమేశారు. నా హయాంలో మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటు చేసి పది వేలమందికి పైగా ఉద్యోగావకాశాలు కల్పించా. దాన్ని మూసే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటంతో కొనసాగిస్తున్నారు. ‘ఉత్తరాంధ్రలో ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం ఎక్కడ పాటించింది? నా బీసీలు, నా ఎస్టీలు అంటారు తప్ప వారికి ఏ రకంగానూ ఊతమివ్వలేదు. విశాఖలో విజయసాయిరెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి? మీ బోడి పెత్తనం ఇక్కడ ఏంటని వారిని నిలదీస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

భువనేశ్వరిని అభినందిస్తున్నా..

‘నన్ను వేధించారు.. రాళ్లతో దాడి చేశారు. చివరకు ఇంటి గుమ్మం దాటని నా భార్యపై విమర్శలు చేశారు. ఆమె ఆరు నెలలుగా ప్రజల ముంగిట తిరుగుతున్నారు. నా అక్రమ అరెస్టు వల్ల ప్రాణాలు విడిచిన 203 మంది కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. వారి పిల్లలను చదివిస్తానని భరోసా ఇచ్చారు. మీ అందరి తరఫున నా భార్య భువనేశ్వరిని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.

పవన్‌కు మహిళలంటే గౌరవం

పవన్‌ కల్యాణ్‌కు మహిళలంటే గౌరవం. రాష్ట్రాన్ని కాపాడటానికి నడుం కట్టారు. ఆయనను జె-గన్‌రెడ్డి మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బందికి గురి చేసినా.. మడమ తిప్పని నాయకుడిగా నిలిచారు. రాష్ట్రం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది’ అని అన్నారు.

అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు..

‘పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. రాష్ట్ర ప్రగతి కోసమే ఎన్టీయే, జనసేనతో కలిశా. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని అవుతారు. ఆయన ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. నేనూ సూపర్‌- 6 పథకాలు అమలు చేస్తా. వచ్చే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మెగా డీఎస్సీ, 25 వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తానని జె-గన్‌రెడ్డి రూ. 7,500 ఇచ్చి పచ్చి మోసం చేస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఏటా రూ. 20 వేలు ఇస్తాం. సామాజిక భద్రత పింఛను రూ. 4 వేలకు పెంచి ఏప్రిల్‌ నుంచే అందిస్తాం. వాలంటీర్ల వేతనాలను రూ. 10 వేలకు పెంచుతాం’ అని హామీ ఇచ్చారు. 

వారు ఇచ్చిందెంతో.. కొట్టేసిందెంతో లెక్కేయండి 

‘జగన్‌ ఇచ్చిందెంతో.. తిరిగి కొట్టేసిందెంతో ప్రజలు లెక్క కట్టాలి. విద్యుత్తు ఛార్జీల పెంపు, నిత్యావసర సరకులు, పెట్రోల్‌, మద్యం, ఇసుక, సిమెంటు, ఇనుము ధరలు భారీగా పెంచడంతో ఎంత ఆర్థిక భారం పడిందో తెలుసుకోవాలి. రూ. 10 లక్షల కోట్ల అప్పు చేయడంతో ప్రతి కుటుంబం పైనా రూ. ఆరు లక్షల చొప్పున భారం పడింది. ప్రతి వ్యక్తి రక్తాన్ని జలగలా తాగేశారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

నిద్ర లేని రాత్రులు గడిపాను

‘ఈ అయిదేళ్లలో నిద్ర లేని రాత్రులెన్నో గడిపాను. ఏ సమయంలో ఎవరిని అరెస్టు చేస్తారో తెలియదు. వారి కోసం కోర్టుకెళ్లాలి.. కాపాడుకోవాలి.. ఇలా ఎన్నో బాధలు పడ్డాం. రాత్రికి రాత్రే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. శుక్రవారం వస్తే పొక్లెయిన్‌ పంపుతారు. ఆస్తులను కూల్చడం వారికి అలవాటుగా మారింది. ఆర్థికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నించారు’ అని అన్నారు.

పలాసలో చంద్రబాబు హెలికాప్టర్‌ తనిఖీ 

చంద్రబాబు ప్రయాణించిన హెలికాప్టర్‌ను శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది తనిఖీ చేశారు. స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఆయన దిగిన వెంటనే ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ (పలాస) దుప్పల ఆశాలత హెలికాప్టర్‌లో తనిఖీ చేశారు.


మంత్రి సీదిరిని అడవుల్లోకి పంపాలి

‘దేశంలోనే నంబర్‌ వన్‌ సంపన్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి. అదే సమయంలో దేశంలోనే పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. బిహార్‌కు మించిన నిరుద్యోగం ఇక్కడ ఉంది. రాష్ట్రంలో జనగణనతో పాటు నైపుణ్య గణన చేస్తాం. వారి ఆసక్తి మేరకు శిక్షణ అందిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని రానున్న అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 14 ఏళ్లలో సాధించిన ప్రగతి వచ్చే అయిదేళ్లలో చూపిస్తాం. 30 ఏళ్లలో చెప్పుకోవడానికి ఏం చేశారని వాళ్లు అడుగుతున్నారు. బాబు వస్తే జాబు వస్తుందనేది నా బ్రాండ్‌. గంజాయి, డ్రగ్స్‌ జగన్‌ బ్రాండ్‌. ముఖ్యమంత్రి రుషికొండకు బోడి గుండు చేస్తే, పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు నాలుగు కొండలను అక్రమంగా కబ్జా చేశారు. అడవుల్లోని ఎలుగుబంట్లు గ్రామాల మీద పడి మనుషుల్ని చంపేస్తున్నాయి. మంత్రి అప్పలరాజును అడవుల్లోకి పంపాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు ప్రతిభా భారతి, విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల తెదేపా అభ్యర్థులు గౌతు శిరీష, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్‌, కోండ్రు మురళీమోహన్‌, బెందాళం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని