‘మేమంతా సిద్ధం’ కాదన్న గుడివాడ!

బస్సులు పెట్టారు. మద్యం తాగించారు. బిర్యానీ పెట్టారు. తలా రూ.300 ఇచ్చారు. కృష్ణా జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ బస్సులు పంపి మరీ జనాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అయినా ‘మేమంతా సిద్ధం’గా లేమంటూ ప్రజలు పెద్దగా స్పందించలేదు.

Updated : 16 Apr 2024 07:34 IST

జనాలు లేక వెలవెలబోయిన జగన్‌ సభ
ఏలూరు జిల్లా బస్సుయాత్రలోనూ అదేతీరు

ఈనాడు, అమరావతి: బస్సులు పెట్టారు. మద్యం తాగించారు. బిర్యానీ పెట్టారు. తలా రూ.300 ఇచ్చారు. కృష్ణా జిల్లాతో పాటు పక్క జిల్లాలకూ బస్సులు పంపి మరీ జనాన్ని తరలించేందుకు ప్రయత్నించారు. అయినా ‘మేమంతా సిద్ధం’గా లేమంటూ ప్రజలు పెద్దగా స్పందించలేదు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్‌ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ వెలవెలబోయింది. రోడ్డు షోలోనూ అదే పరిస్థితి. విజయవాడలో జగన్‌పై రాయి దాడి ఘటన తర్వాత ఏర్పాటుచేసిన తొలి సభ కావడంతో సానుభూతి వెల్లువలా వస్తుందని వైకాపా వర్గాలు భావించాయి. కానీ ఎక్కడా ఆ స్పందన కనిపించలేదు. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, నూజివీడు, పామర్రు, గన్నవరం, విజయవాడ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారు. సోమవారం కృష్ణా జిల్లాలో యాత్ర చేపట్టారు. ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి బయల్దేరాల్సిన బస్సు.. జనాలు సిద్ధంగా లేరని 11 గంటలకు ప్రారంభమైంది.

గన్నవరంలో విమానాశ్రయానికి భూములు కోల్పోయిన నిర్వాసితులు సీఎంకు వినతి పత్రమిచ్చారు. వారితో కాసేపు మాట్లాడిన జగన్‌.. దారిలో ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. యాత్ర హైవేలో వెళ్తుండగా, పోలీసులు గన్నవరం, హనుమాన్‌ జంక్షన్‌లలో దుకాణాలు మూయించారు. మధ్యాహ్నం జొన్నపాడు మీదుగా బయల్దేరి సాయంత్రం గుడివాడ శివారు నాగవరప్పాడు సభాస్థలికి చేరుకున్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాటు చేయగా, అందులో ర్యాంపు, వేదిక పోనూ సభికులకు కొద్ది స్థలమే మిగిలింది. అది కూడా నిండలేదు. జనాన్ని తరలించిన వాహనాలను రోడ్లపైనే నిలపడంతో గుడివాడ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలెదురయ్యాయి. తొలుత ప్రకటించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం ఈ సభ తర్వాత గుడ్లవల్లేరు, పెడన, కృత్తివెన్ను మీదుగా భీమవరం వెళ్లాలి. కానీ ఆదివారం ప్రణాళికను మార్చి, కృష్ణా జిల్లాలో గుడివాడకే పరిమితం చేశారు. అక్కడి నుంచి హనుమాన్‌ జంక్షన్‌కు వచ్చి హైవే మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించారు.

అబద్ధాల ప్రవాహం

సీఎం జగన్‌ తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారు. బందరు పోర్టు నిర్మాణానికి తెదేపా హయాంలోనే శంకుస్థాపన చేసి, ముడా ఏర్పాటు చేయగా, తానే శంకుస్థాపన చేసినట్లు జగన్‌ చెప్పారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేశామన్నారు. వాస్తవానికి బందరు కారిడార్‌లో ఒక్క పరిశ్రమా రాలేదు.


ఏలూరు జిల్లాలో అభివాదాలతో సరి

ఈనాడు, ఏలూరు: కలపర్రు టోల్‌గేటు వద్ద బస్సుయాత్ర సోమవారం రాత్రి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లోని ఆశ్రం కూడలి, గుండుగొలను, భీమడోలు, కైకరం, చేబ్రోలు మీదుగా నారాయణపురం వరకు దాదాపు 60 కిమీ ప్రయాణించిన జగన్‌.. ఎక్కడా ప్రసంగించలేదు. అభివాదం చేస్తూ, చేతులూపుతూ ముందుకు సాగారు. కూడళ్లలో ప్రజలు పల్చగా ఉండటంతో జగన్‌ బస్సులోంచి బయటకు రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని