Congress: ఆ మూడు చోట్ల ఎవరు?.. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులపై ఉత్కంఠ

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ఇంకా రెండు రోజులే సమయముంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ఆరంభం కానుంది.

Updated : 16 Apr 2024 07:57 IST

కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ అభ్యర్థులను నేడు ప్రకటించనున్న కాంగ్రెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ఇంకా రెండు రోజులే సమయముంది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ఆరంభం కానుంది. శుభ ఘడియలున్నాయని తొలి రెండు రోజుల్లోనే నామినేషన్ల దాఖలుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకూ కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఇంకా ప్రకటించలేదు. ఈ లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో తెలియక ప్రచారం అంతంతమాత్రంగా ఉంది. కరీంనగర్‌లో భాజపా కీలక నేత బండి సంజయ్‌, భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరిని ఢీకొనే అభ్యర్థిని ఇంకా కాంగ్రెస్‌ ప్రకటించలేదు. వచ్చే నెల 11వ తేదీతో ముగిసే ప్రచారానికి ఇంకా కేవలం 25 రోజులే గడువుంది.

ఖమ్మంలో ప్రియాంక పోటీ లేనట్టే..

మూడు స్థానాల అభ్యర్థుల పేర్లపై ఈ నెల 14న హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ చర్చించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని సీఎం ఇంతకుముందే కోరారు. అయితే ఆమె ఖమ్మం బరిలో దిగే అవకాశాలు లేవని కేసీ వేణుగోపాల్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి లేదా రఘురామిరెడ్డిలలో ఒకరిని ఖమ్మం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల అంచనా. ఖమ్మం సంగతి తేలితేనే కరీంనగర్‌ పేరు ఖరారు కానుంది. వీరిద్దరిలో ఒకరికి టికెట్‌ ఇస్తే కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు లేదా ప్రవీణ్‌రెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇక హైదరాబాద్‌ టికెట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సమీర్‌కే ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను సోమవారం ప్రకటిస్తామని కేసీ వేణుగోపాల్‌ ఈ నెల 14నే రాష్ట్ర నేతలకు సమాచారమిచ్చినా జాబితా వెలువడలేదు. ఆ పేర్లను మంగళవారం ప్రకటించే అవకాశాలున్నాయని నేతలు చెబుతున్నారు. అభ్యర్థులు ఖరారు కాగానే ఈ నియోజకవర్గాల్లో పెద్దయెత్తున ప్రచారం నిర్వహించడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఖమ్మంలో ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఉన్నందున వీరు ఇప్పటికే కొంతమేర ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్‌లో పార్టీ టికెట్‌ ఎవరికిచ్చినా నేతలందరం కలసికట్టుగా పనిచేసి గెలిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‘ఈనాడు’కు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని