ఉత్తరీయం ఎవరికో?

అందమైన హిమాలయ పర్వత ప్రాంతాలకు ఆలవాలమైన ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ పోరు భాజపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.

Updated : 16 Apr 2024 07:40 IST

హోరాహోరీ పోరుకు ఉత్తరాఖండ్‌ సిద్ధం
యువత, మహిళలదే కీలకపాత్ర
జాతీయ అంశాలపై భాజపా స్థానిక అంశాలతో కాంగ్రెస్‌

దేహ్రాదూన్‌: అందమైన హిమాలయ పర్వత ప్రాంతాలకు ఆలవాలమైన ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ పోరు భాజపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో 5 లోక్‌సభ సీట్లున్నాయి. కుమావ్‌ డివిజన్‌లో 2, గడ్‌వాల్‌ డివిజన్‌లో 3 నియోజకవర్గాలున్నాయి. వీటికి తొలి విడతలోనే ఈనెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. భాజపా అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో గతానికి భిన్నంగా స్థానిక అంశాలు లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావితం చేసే పరిస్థితి నెలకొంది. యువత, మహిళల్లో నెలకొన్న అసంతృప్తి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందని స్థానికులు అంటున్నారు. భాజపా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి సారించింది. కాంగ్రెస్‌ స్థానిక అంశాలను ప్రధానాస్త్రాలుగా చేసుకుంది. భాజపాకు రామ మందిరం అంశం కలిసివచ్చే అవకాశం ఉంది.


అగ్నిపథ్‌పై వ్యతిరేకత

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం నుంచి సైన్యంలో చాలామంది చేరుతూ ఉంటారు. 2022లో తెచ్చిన అగ్నిపథ్‌ పథకం (సైన్యంలో తాత్కాలిక నియామకం) అక్కడి యువతకు విఘాతంగా మారింది. గడ్‌వాల్‌ యువత అగ్నిపథ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది భాజపాకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ‘స్థానికంగా ఇక్కడి యువత అంతా సైన్యాన్ని కెరీర్‌గా ఎంచుకుంటారు. అగ్నిపథ్‌ రావడంతో వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ప్రత్యేకించి గ్రామాలు, కొండ ప్రాంతాల్లోని వారికి ఇది ఆశనిపాతంగా మారింది’ అని ఛమోలీ జిల్లాకు చెందిన యువకుడొకరు తెలిపారు.

  •  భాజపా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎన్నికల ప్రణాళికలోనే ప్రస్తావించలేదు.   ఫలితంగా యువత భాజపాపై  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
  •  రెండేళ్ల కిందట అగ్నిపథ్‌ను ప్రకటించినప్పుడు ఉత్తరాఖండ్‌లో భారీగా   ఆందోళనలు జరిగాయి. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ఇక్కడి యువత తమ వ్యతిరేకతను తెలియజేశారు.

అంకిత హత్య

మహిళల భద్రతపైనా రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. అంకిత భండారీ అనే 19 ఏళ్ల యువతిని రిషీకేశ్‌లోని రిసార్టులో భాజపా మాజీ నేత కుమారుడు హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. 2022లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘అంకిత మా కుమార్తెలాంటిది. ఇప్పటివరకూ ఆమెకు న్యాయం జరగలేదు. ప్రతి పార్టీ ఎన్నికల సమయంలో మహిళల భద్రత గురించి మాట్లాడుతుంది. ఆ తర్వాత పట్టించుకోదు. ఇలాంటి పరిస్థితి మా కుమార్తెలకు, సోదరీమణులకు వస్తే ఏం చేయాలి’ అని గడ్‌వాల్‌లోని రుద్రప్రయాగ్‌కు చెందిన ఓ మహిళ ప్రశ్నించారు. అంకిత హత్యపై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్‌ డిమాండు చేస్తోంది. స్థానిక అంశాలకు ప్రాధాన్యమున్నా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు తమను గెలిపిస్తాయని భాజపా నేత హరీశ్‌ సాటి చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని