యూపీ సీటు కాపాడుకోలేని యువరాజు

కాంగ్రెస్‌ యువరాజు ఉత్తర్‌ప్రదేశ్‌లో తన కుటుంబ స్థానాన్ని (అమేఠీ) కాపాడుకోవడం చేతకాక, కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

Updated : 16 Apr 2024 06:11 IST

కేరళలో రాహుల్‌ పోటీపై  ప్రధాని ఎద్దేవా

తిరువనంతపురం, త్రిశ్శూర్‌: కాంగ్రెస్‌ యువరాజు ఉత్తర్‌ప్రదేశ్‌లో తన కుటుంబ స్థానాన్ని (అమేఠీ) కాపాడుకోవడం చేతకాక, కేరళలో కొత్త స్థావరాన్ని ఏర్పరచుకున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. సోమవారం కేరళలో పర్యటించిన ప్రధాని త్రిశ్శూర్‌ జిల్లా కున్నమ్‌కులం ఎన్నికల సభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ పేరెత్తకుండా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.  ‘‘ఆయన కేరళలో ఓట్లు అడుగుతున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం గళమెత్తరు’’ అని దుయ్యబట్టారు. సహకార బ్యాంకుల కుంభకోణంలో సీపీఎం పేదల సొమ్మును దోచుకొందని, దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత మౌనం ఎందుకు పాటిస్తున్నారని నిలదీశారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి దేశంలో నిషేధించిన పీఎఫ్‌ఐ సంస్థ రాజకీయ విభాగమైన సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాతో కాంగ్రెస్‌ రహస్య ఒప్పందం చేసుకుందని మోదీ ఆరోపించారు. ‘‘త్రిపుర, పశ్చిమబెంగాల్‌ నుంచి కేరళ వరకు వామపక్ష ప్రభుత్వాలకు ఒక లక్షణం ఉంది. లెఫ్ట్‌ ప్రభుత్వాలు పాలించినచోట ఏమీ మిగలదు.. ఏదీ సరిగా జరగదు’’ అని వ్యాఖ్యానించిన ప్రధాని ‘నథింగ్‌ లెఫ్ట్‌ అండ్‌ నథింగ్‌ రైట్‌’ అనే పదజాలాన్ని వాడారు. ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్‌ రైళ్ల కోసం సర్వే ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. తిరువనంతపురం జిల్లాలోని అట్టింగల్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధి కట్టక్కడా పట్టణ ఎన్నికల సభలో మోదీ మాట్లాడారు. 


కాంగ్రెస్‌, డీఎంకే ‘కచ్చతీవు’ పాపులు

ఈనాడు, చెన్నై - తిరునల్వేలి: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా సోమవారం తిరునల్వేలి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఒక్కసారి ఎన్డీయేకు అవకాశమివ్వాలని ఓటర్లను కోరారు. ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తామన్న ప్రధాని.. కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిన కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలను ‘పాపులు’గా అభివర్ణించారు. తమిళనాడు నుంచి ఆ దీవిని విడగొట్టి మరో దేశానికి ఇచ్చేసిన ఈ రెండు పార్టీలు జాతి ప్రయోజనాలకు విరుద్ధమైనవిగా పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలపాటు వారు దాచిన ఈ నిజాన్ని భాజపా బట్టబయలు చేసిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని