దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న మోదీ

భాజపా వద్ద ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ ప్రణాళికలు లేవని, ఒకే దేశం, ఒకే అధ్యక్షుడు అంటూ దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

Updated : 16 Apr 2024 06:10 IST

 భాజపా ఎన్నికల ప్రణాళికలో పేదలకు పథకాల్లేవు
తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారాల్లో రాహుల్‌

సైదాపేట, న్యూస్‌టుడే; వయనాడ్‌: భాజపా వద్ద ప్రజల కోసం ఎలాంటి సంక్షేమ ప్రణాళికలు లేవని, ఒకే దేశం, ఒకే అధ్యక్షుడు అంటూ దేశాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రధాని మోదీ యత్నిస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. భాజపా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒలింపిక్స్‌ నిర్వహణ, చంద్రుడిపైకి మనుషులను పంపటం మాత్రమే ఉన్నాయని, పేదలకు ఎలాంటి పథకమూ లేదని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అతిపెద్ద పోరాటం జరుపుతున్నామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించారు. తొలుత కర్ణాటకలోని మైసూరు నుంచి హెలికాప్టర్లో తమిళనాడులోని గూడలూరు తాలూరు ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలకు చేరుకున్నారు. అక్కడ నీలగిరి నియోజకవర్గ పరిధికి చెందిన తేయాకు తోటల కార్మికులు, రైతులతో ముచ్చటించారు. భాజపా మళ్లీ పాలనలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు. తమిళుల భాష, సంస్కృతిని నాశనం చేసేందుకు ఆ పార్టీ యత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం ఆయన తాను పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్‌లో ప్రచారానికి వెళ్లారు. అక్కడ పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌ షోల్లో రాహుల్‌ ప్రసంగించారు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలు దిల్లీ, నాగ్‌పుర్‌లో ఉండే భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు.

వయనాడ్‌ భూమ్మీద సుందర ప్రాంతం

‘రాజ్యాంగ సంస్థలు ప్రధాని మోదీకి వ్యక్తిగత ఆస్తులు కావు. అవి ప్రతి భారతీయ పౌరుడికి చెందుతాయి. దేశంలో ఉన్న రాజ్యాంగ సంస్థల్ని నిర్వీర్యం చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలు రాజ్యాంగాన్ని కాపాడేవారికి, నాశనం చేయాలనుకునే వారికి మధ్య జరగనున్నాయి. దేశానికి ఒకే నాయకుడు ఉండాలనే భాజపా ఆలోచన దేశ ప్రజలకు అవమానకరం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. వయనాడ్‌ భూమ్మీద అత్యంత సుందరమైన ప్రాంతమని, దీన్ని తిలకించేందుకు, కొన్ని రోజులు గడిపేందుకు తన తల్లి సోనియాను ఇక్కడకు ఆహ్వానిస్తానని తెలిపారు. 


రాహుల్‌ హెలికాప్టర్‌లో ఈసీ తనిఖీలు

నీలగిరిలో రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ను అధికారులు సోమవారం తనిఖీ చేశారు. సుమారు 10 నిమిషాల పాటు తనిఖీలు నిర్వహించగా, ఇందులో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని