భాజపా కనుసన్నల్లో పనిచేస్తున్న ఈసీ

భాజపా ఆదేశాలకు లోబడి కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Updated : 16 Apr 2024 06:06 IST

 అల్లర్లు జరిగితే ఈసీ ఎదుట నిరాహారదీక్ష చేస్తా
నేను పిరికిదాన్ని కాదు.. పోరాడటం తెలుసు
 పోలీసు డీఐజీ తొలగింపుపై మమత మండిపాటు

కూచ్‌బిహార్‌, అలీపుర్‌ద్వార్‌ (పశ్చిమ బెంగాల్‌): భాజపా ఆదేశాలకు లోబడి కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని, దానిలో భాగంగానే ముర్షీదాబాద్‌ పోలీసు డీఐజీని తొలగించిందని చెప్పారు. సోమవారం పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బిహార్‌, అలీపుర్‌ద్వార్‌లలో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ‘‘అల్లర్లు, హింసను రెచ్చగొట్టడానికే పోలీసు అధికారుల్ని మార్చాలని భాజపా కోరుకుంటోంది. ముర్షీదాబాద్‌, మాల్దాలలో ఎక్కడైనా ఒక్కచోట అల్లర్ల ఘటన చోటు చేసుకున్నా దానికి ఈసీయే బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాంతిభద్రతల్ని ఈసీయే చూస్తోంది కాబట్టి నేను ఈసీ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు దిగుతా. రైతుల కోసం 26 రోజులపాటు దీక్ష చేసినదాన్ని నేను. ఇప్పుడు అవసరమైతే ఈసీ ఎదుట 55 రోజులపాటు దీక్ష కొనసాగిస్తా. విపక్షాన్ని జైల్లో వేస్తామని బెదిరిస్తారా? ఎన్ని జైళ్లు మీకు ఉన్నాయో నేనూ చూస్తా. ఎందరు పోలీసులు మీకున్నారు? ఎందరిని మీరు కొడతారు? నాపైనా చాలాసార్లు దాడులు జరిగాయి. ఎలా పోరాడాలో నాకు తెలుసు. నేనేమీ పిరికిదాన్ని కాను’’ అని తెగేసి చెప్పారు. అల్లర్లను నిలువరించడంలో తగిన పర్యవేక్షణ లేదంటూ డీఐజీ ముకేశ్‌ను, మరికొందరిని ఈసీ సోమవారం ఉదయమే తొలగించింది.

వారి హెలికాప్టర్లను తనిఖీ చేయగలరా?

ఆదాయపుపన్ను అధికారులకు దమ్ముంటే.. ప్రచారం నిమిత్తం భాజపా నేతలు వాడుతున్న హెలికాప్టర్లను తనిఖీ చేయగలరా అని మమత ప్రశ్నించారు. ఎన్నికల ముందు టీఎంసీ నేతలపైకి దర్యాప్తు సంస్థల్ని పంపించి, కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. తమ పార్టీ నేత అభిషేక్‌ బెనర్జీ హెలికాప్టర్‌ను ఐటీ అధికారులు తనిఖీ చేసినా ఏమీ పట్టుకోలేకపోయారని గుర్తుచేశారు. తొలిదశ ఎన్నికలకు ముందు ఎన్‌ఐఏను కూడా భాజపా వాడుకుని అరెస్టులు చేయిస్తుందని చెప్పారు. నిజాయతీపరులు, కష్టపడి పనిచేసే ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారుల్ని ఈసీ ద్వారా సాగనంపించి.. కళంకితులను, కాషాయానికి విధేయులైనవారిని, పక్షపాతంతో వ్యవహరించేవారిని భాజపా తీసుకువస్తోందన్నారు. నిజాయతీపరుల్ని నిష్క్రియాపరులుగా చేసి ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు.

‘చెత్త మోదీ’ని ఇంటికి పంపాల్సిందే

‘అటల్‌ బిహారీ వాజ్‌పేయీ వంటి మంచి నేతల్ని మనం చూశాం. ఇప్పుడు మోదీని చూస్తున్నాం. ఆయనో చెత్తవ్యక్తి. బ్యాలెట్ల ద్వారా మోదీని సాగనంపాల్సిందే’ అని మమత అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు