అంబేడ్కర్‌ను అవమానిస్తే ఊరుకుందామా..?

‘భారాసకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లు, సీట్లు ఎందుకు అని కొంతమంది తెలివి లేనివాళ్లు అంటున్నారు.. ఇప్పుడే భారాసకు సీట్లు కావాలి.

Updated : 17 Apr 2024 06:25 IST

అతిపెద్ద విగ్రహం మేం నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారా?
ఈ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలి
అప్పుడప్పుడు లిల్లీపుట్లకు కూడా అధికారం వస్తుంది..
రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమం
భారాస ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం
ఆ పార్టీ అధినేత కేసీఆర్‌

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: ‘భారాసకు ఇప్పుడు పార్లమెంటు ఓట్లు, సీట్లు ఎందుకు అని కొంతమంది తెలివి లేనివాళ్లు అంటున్నారు.. ఇప్పుడే భారాసకు సీట్లు కావాలి. ఆనాడు కరీంనగర్‌ ఎంపీగా నన్ను గెలిపించి ఉండకపోతే, తెలంగాణ కావాలని పార్లమెంటులో గర్జించి ఉండకపోతే, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేదా?’ అని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ శివారులో మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలంటే భారాస బిడ్డలు పార్లమెంటులో ఉండాలని పేర్కొన్నారు. ‘రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు జరుగుతుంది. లిల్లీపుట్‌లకు కూడా అధికారం వస్తుంది. గత ప్రభుత్వం కంటే మంచి పనులు చేయాలని ప్రజలు అధికారం ఇస్తారు తప్ప, అడ్డదిడ్డంగా వ్యవహరించడానికి కాదు.

రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3ని అంబేడ్కర్‌ చేర్చడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఆ మహనీయుడిని గౌరవించుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. విగ్రహం నెలకొల్పాక వచ్చిన తొలిజయంతి రోజున ఈ ప్రభుత్వం ఒక్క పూలమాల కూడా వేయలేదు. నివాళి అర్పించలేదు. అంబేడ్కర్‌ను అవమానిస్తే మౌనం పాటిద్దామా.. దళితబంధు పథకాన్ని బంద్‌ చేస్తే నోరు మూసుకుందామా?.. అని దళిత సోదరులను అడుగుతున్నా. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రజలు దర్శించుకునేందుకు వీలు లేకుండా తాళం వేశారు. ఇది అహంకారమా, అజ్ఞానమా? భారాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహమైనందునే అలా ప్రవర్తించారు. మరి సచివాలయం, యాదగిరి గుట్ట ఆలయాన్ని కూడా మా ప్రభుత్వమే నిర్మించింది కదా. ఎమ్మెల్యేలు ఉంటున్న క్యాంపు కార్యాలయాలు కూడా మేం నిర్మించినవే. వాటిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండడం లేదా? ఆ లెక్కన మిషన్‌ కాకతీయ చెరువులను కూడా పూడ్చేస్తారా? ఉద్యోగులు, ఉపాధ్యాయులను మా ప్రభుత్వ హయాంలో ఎంతో గౌరవించాం. అవన్నీ మరిచిపోయి ఆగమాగం అయితే వారే నష్టపోతారు. అందుకే ఆలోచించి ఈ ప్రభుత్వానికి  ముకుతాడు వేయాలి. 

హామీల అమలేదీ?

ప్రత్యేక రాష్ట్రం కోసం 15 ఏళ్లు పోరాటం చేశాను. తెలంగాణ వచ్చాక పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను. రైతులకు అండగా ఎన్నో పథకాలు అమలు చేశాం. డిసెంబరు 9న రైతు రుణ మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. రైతుబంధు సాయం కూడా అందరికీ అందలేదు. పంట ఉత్పత్తులకు రూ.500 బోనస్‌ ప్రకటన బోగసేనా? రూ.2 లక్షల రుణ మాఫీ, ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం, వడ్లు వెంటనే కొనుగోలు తదితర డిమాండ్లతో సిద్దిపేట రైతుల మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టాలి. బోనస్‌ ఇచ్చేందుకు ఎన్నికల కోడ్‌ అడ్డు వస్తుందనుకుంటే.. హామీపత్రం ఇవ్వాలి. ఎన్నికల తర్వాత నగదు ఇవ్వాలి’ అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

పోలీసులూ జాగ్రత్త.. అన్నీ రికార్డు చేస్తున్నాం

కరీంనగర్‌ జిల్లాలో భారాస కార్యకర్త సర్వాజీ మాధవరావుపై కేసు పెట్టడంపై కేసీఆర్‌ స్పందిస్తూ.. ‘పోలీసు సోదరులారా జాగ్రత్త.. అన్నీ రికార్డు చేస్తున్నాం. మీ విధులు మీరు నిర్వహించండి. డీజీపీ తీరు మారాలి. వ్యవస్థపై ఆయనకు గౌరవం ఉంటే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారితో విచారణ జరిపించాలి. దౌర్జన్యానికి పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు. దౌర్జన్యాలను తాను ఏనాడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ ప్రభుత్వం ఏడాదైనా ఉంటుందో.. ఉండదో..

‘ఈ ప్రభుత్వంపై తెలంగాణ జనం అప్పుడే తిరగబడుతున్నారు. కాంగ్రెస్‌కు రెండు పార్లమెంటు సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రిలో వణుకు మొదలైంది. మొన్న నారాయణపేటలో ఆయన ప్రసంగంలో భయం చూస్తే.. ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో, ఉండదో అనిపిస్తోంది. కాంగ్రెసోళ్లు ఎవరెప్పుడు భాజపాలో చేరతారో.. ముఖ్యమంత్రే దూకేస్తారో చెప్పలేం’

సుల్తాన్‌పూర్‌ సభలో కేసీఆర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని