ఈ ఎన్నికలు ముగియగానే భాజపాలోకి రేవంత్‌రెడ్డి

‘అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెడతారనే భయంతోనే పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌ కొత్త కథకు తెరలేపారు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Updated : 17 Apr 2024 06:21 IST

20, 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి చేరటం ఖాయం
ఓటమి భయంతోనే సీఎం రైతు రుణమాఫీ ప్రకటన
అందరి దేవుడైన శ్రీరాముడిని మొక్కుతాం.. భాజపాను తొక్కుతాం
ఆదిలాబాద్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌

ఈటీవీ - ఆదిలాబాద్‌: ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెడతారనే భయంతోనే పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌ కొత్త కథకు తెరలేపారు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రాష్ట్రంలో చాలా మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. 20 లేదా 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి రేవంత్‌రెడ్డి భాజపాలో చేరటం ఖాయమనేది అందులో ఒకటని అన్నారు. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చేలా భారాస బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తుంది. భారాసను భాజపా బీ టీంగా ప్రచారం చేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు రేవంత్‌రెడ్డిది ఎవరి మార్గమో తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రధానిని రాహుల్‌గాంధీ చోర్‌గా అభివర్ణిస్తే.. రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌ సభలో మోదీని పెద్దన్నయ్య అంటూ కీర్తించారు. అదాని ఫ్రాడ్‌ అని, గుజరాత్‌ రాష్ట్రం మోడల్‌ ఫేక్‌ అని రాహుల్‌ చెబుతుంటే.. అదానీని ఫ్రెండ్‌ అని, గుజరాత్‌ రాష్ట్రం మాకు మోడల్‌ అని సీఎం పేర్కొంటున్నారు. కాబట్టి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ బాటలో వెళ్తున్నారో... మోదీ మార్గంలో నడుస్తున్నారో కాంగ్రెస్‌ నేతలు గమనించాలి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి పాత్ర లేని నాయకులే మా పార్టీ వీడుతున్నారు. అలాంటి వారితో భారాసకు నష్టం లేదు. భాజపాతో దేశానికి ప్రమాదం పొంచి ఉంది. అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు. భాజపా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ వెసులుబాటు ఉండదు. శ్రీరాముడు అందరికీ దేవుడే. ఆయనతో పార్టీలకు ఎలాంటి పంచాయితీ లేదు. అందుకని రాముడిని మొక్కుతాం. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును విస్మరించిన భాజపాను కాళ్ల కింద వేసి తొక్కుతాం.

దక్షిణాదికి నష్టం

దేశంలో 70, 80వ దశకంలో ‘మేం ఇద్దరం, మాకిద్దరు’ అనే కేంద్ర పెద్దల నిర్ణయంతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పద్ధతిని పాటించి జనాభా పెరగకుండా చూశాయి. ఉత్తరాదిలోని ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటించలేదు. ఈ పరిస్థితుల్లో 2026లో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తామంటే ఎవరికి లాభం? అందుకే లోక్‌సభలో మన గళం వినిపించాలంటే ఆదిలాబాద్‌ భారాస అభ్యర్థి ఆత్రం సక్కును ఎంపీగా గెలిపించండి’’ అని కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల పార్టీని వీడి భాజపాలో చేరిన ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్‌ తిరిగి కేటీఆర్‌ సమక్షంలో భారాసలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని