రాజ్యాంగానికి రుణపడి ఉంటా

నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగేందుకు తనకు తోడ్పడిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగానికి రుణపడి ఉంటానని ప్రధాని మోదీ అన్నారు.

Updated : 17 Apr 2024 06:18 IST

బిహార్‌ ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ

గయా, పూర్ణియా: నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగేందుకు తనకు తోడ్పడిన బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగానికి రుణపడి ఉంటానని ప్రధాని మోదీ అన్నారు. బిహార్‌లోని గయా, పూర్ణియాల్లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. భాజపా రాజ్యాంగాన్ని రద్దు చేసే యోచన చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను దీటుగా తిప్పికొట్టారు. అమృతకాల్‌ ఉత్సవాల తరహాలో భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన వేడుకను సైతం ఈ ఏడాది జరుపుకోబోతున్నట్లు తెలిపారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగాన్ని తాకట్టు పెట్టి, దాని స్వరూపాన్ని మార్చాలని చూసినవారికి రాజ్యాంగమంటే చిన్నచూపే ఉంటుంది’’ అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. బిహార్‌కు జంగిల్‌రాజ్‌ నుంచి ఎన్డీయే విముక్తి కల్పించిందని, ఆర్జేడీ నేతల అవినీతిపై విచారణ కొనసాగుతుందన్నారు.

గూండాల లీజులో బెంగాల్‌

రాయ్‌గంజ్‌ : మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌ను చొరబాటుదారులు, గూండాలకు లీజుకు ఇచ్చిందని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్‌లోని బాలుర్‌ఘాట్‌, రాయ్‌గంజ్‌లలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం నివ్వెరపోయిందన్నారు. అవినీతి, నేరాలు నిత్య వ్యవహారంగా మారిన  టీఎంసీ పాలనలో దర్యాప్తునకు వచ్చిన కేంద్ర ఏజెన్సీలపై కూడా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ‘‘రాష్ట్ర జనాభాను ప్రభావితం చేసేలా దేశంలోకి అక్రమంగా ప్రవేశించే రోహింగ్యాలు, చొరబాటుదారులకు టీఎంసీ మద్దతు ఇచ్చి.. శాంతిభద్రతల సమస్యలకు దోహదం చేస్తుంది. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ‘సీఏఏ’ను మాత్రం వ్యతిరేకిస్తోంది’’ అని మోదీ విస్మయం వ్యక్తం చేశారు. 

మంగళవారం సాయంత్రం అస్సాంకు చేరుకున్న ప్రధాని రద్దీగా ఉండే గువాహటి - షిల్లాంగ్‌ రోడ్డుపై 2 కి.మీ.ల మేర రోడ్‌ షో నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని