ఎన్నికల బాండ్లు దోపిడీయే

ఎన్నికల బాండ్ల పథకం.. దోపిడీకి మరో రూపమని, కొంతమంది వ్యాపారులను బెదిరించి భాజపాకు సొమ్ములు రాబట్టే యత్నమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు.

Updated : 17 Apr 2024 06:18 IST

కేరళలో భాజపాపై విరుచుకుపడ్డ రాహుల్‌గాంధీ

కోజికోడ్‌, వయనాడ్‌: ఎన్నికల బాండ్ల పథకం.. దోపిడీకి మరో రూపమని, కొంతమంది వ్యాపారులను బెదిరించి భాజపాకు సొమ్ములు రాబట్టే యత్నమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. మంగళవారం కేరళలోని కోజికోడ్‌, మలప్పురం జిల్లాల పరిధిలోకి వచ్చే వయనాడ్‌ నియోజకవర్గ ప్రాంత సభల్లో ప్రసంగించారు. ఎన్నికల బాండ్లను రద్దుచేస్తే దేశంలోకి మళ్లీ నల్లధనం వస్తుందంటూ ప్రధాని చెప్పడాన్ని రాహుల్‌ తప్పుబట్టారు. ‘‘ప్రతిచోటా కొంతమంది ఉంటారు. వారు వీధుల్లో పడి, ప్రాణహాని తలపెడతామని బెదిరించి డబ్బు దండుకుంటారు. మోదీ మాత్రం వీటిని ఎన్నికల బాండ్లుగా పిలుస్తారు. ఓ చిన్నదొంగ వీధుల్లో చేసేపనిని మోదీ అంతర్జాతీయస్థాయిలో చేస్తుంటారు. కేంద్రంలో భాజపా నేతృత్వంలోని సర్కారు అధునాతన పద్ధతుల్లో వ్యాపారస్థుల్ని బెదిరిస్తోంది. మొదట ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు వస్తారు. విచారణ చేస్తారు. చివర్లో ఓ సలహా ఇస్తారు. ఈ వ్యాపారాన్ని మీరు అదానీకి ఎందుకు ఇవ్వకూడదని అడుగుతారు. ముంబయి విమానాశ్రయం ఇలాగే అదానీ చేతికి దక్కింది. ఇలాంటి బెదిరింపులతోనే బాండ్ల రూపంలో చాలామంది వ్యాపారవేత్తలు భాజపాకు డబ్బులిచ్చారు.  భాజపా రూ.వేల కోట్లు రాబట్టుకుంది దీనిద్వారానే’’ అని ఆరోపించారు.

అస్మదీయులకు ఆర్థిక ప్రయోజనం

‘దేశంలో కొందరు అత్యంత సంపన్న పారిశ్రామికవేత్తలకు మోదీ సాయపడుతున్నారు. వారికి ఇప్పటివరకు రూ.16 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేయించారు. రైతు సమస్యలపై ఆయన మాట్లాడరు. ధరల పెరుగుదల వంటివి ప్రస్తావించరు. ప్రజాదృష్టి మళ్లించి, ధనిక వ్యాపారులకు ఆయన ప్రజాధనాన్ని ఇచ్చేస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పేదలకు ఆ డబ్బంతా అందిస్తాం’ అని రాహుల్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని