తమిళనాట ధన ప్రవాహం

తమిళనాట ఎన్నికల వేళ నోట్ల కట్టలు నాట్యమాడుతున్నాయి. కట్టలకొద్దీ డబ్బు సంచులను అభ్యర్థులు తరలిస్తున్నారు. ఓటర్లకు పంచుతున్నారు. నిఘా బృందాల తనిఖీల్లో వందల కోట్ల డబ్బు పట్టుబడుతోంది. తిరునెల్వేలి స్థానంపై భాజపా గురిపెట్టింది.

Updated : 17 Apr 2024 06:16 IST

రూ.1361 కోట్ల డబ్బు, వస్తువుల సీజ్‌
భారీగా డబ్బు పంచుతున్న పార్టీలు

ఈనాడు, చెన్నై: తమిళనాట ఎన్నికల వేళ నోట్ల కట్టలు నాట్యమాడుతున్నాయి. కట్టలకొద్దీ డబ్బు సంచులను అభ్యర్థులు తరలిస్తున్నారు. ఓటర్లకు పంచుతున్నారు. నిఘా బృందాల తనిఖీల్లో వందల కోట్ల డబ్బు పట్టుబడుతోంది. తిరునెల్వేలి స్థానంపై భాజపా గురిపెట్టింది. ఇక్కడ గెలుపు ఖాయమనే ఉద్దేశంతో ప్రధాని మోదీ రెండు సార్లు ప్రచారం చేశారు. రాహుల్‌ గాంధీ సైతం ఇక్కడ సభ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నై నుంచి తిరునెల్వేలికి రైలులోని ఏసీ 2టైర్‌ కోచ్‌లో తరలిస్తున్న రూ.4 కోట్ల డబ్బు పట్టుబడింది. పక్కా సమాచారంతో తాంబరం రైల్వేస్టేషన్‌లో పోలీసులు ఈ నగదును పట్టుకున్నారు. ఆ డబ్బు తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌కు చెందిందని విచారణలో తేలడంతో రాజకీయంగానూ వేడి పుట్టింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నాగేంద్రన్‌కు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచారు. ఇదే కేసులో భాజపా పారిశ్రామిక విభాగ సభ్యుడు గోవర్ధన్‌కూ సమన్లు పంపారు. అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలనే డిమాండు ప్రతిపక్షాల నుంచి ఎన్నికల కమిషన్‌కు వెళ్లింది. ఆ డబ్బుకు, తనకు సంబంధం లేదని నాగేంద్రన్‌ ఖండించారు.

సరిహద్దు ప్రాంతాల్లో..

తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో 32 జనరల్‌ స్థానాలు, 7 ఎస్సీ స్థానాలున్నాయి. ఈనెల 19న పోలింగ్‌ జరగనుంది. కొన్ని లోక్‌సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ తనిఖీల కోసం 145 చెక్‌పోస్టులను పెట్టారు. వాటితో పాటు రాష్ట్రంలో అంతర్గతంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తిరుగుతున్నాయి. చాలాచోట్ల వారి కళ్లుగప్పి ఓటర్ల కోసం నగదు, మద్యం, ఉచితాల్ని తరలిస్తున్నారు. పంపిణీ చేయాల్సిన నియోజకవర్గాలకు దగ్గరగా గోదాములు, హోటళ్లు, దుకాణాల్లాంటి వాటిని నిల్వ ప్రాంతాలుగా ఎంపిక చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల తరలింపుపై పక్కా సమాచారంతో నిఘా వర్గాలు దాడులు నిర్వహిస్తున్నాయి. ఎన్నిక దగ్గర పడుతుండటంతో ప్రలోభాలపై ఎన్నికల కమిషన్‌కు ఆయా పార్టీల నుంచి ఫిర్యాదులు బాగా పెరిగాయి. ఇప్పటివరకూ రూ.1361 కోట్ల నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా శ్రీపెరంబుదూరులో రూ.900 కోట్ల విలువైన బంగారాన్ని సీజ్‌ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటంతో ఎన్నికల కమిషన్‌ విచారణలో వేగం పెంచింది. అధికారుల సమాచారం ప్రకారం.. పట్టుబడిన వాటిలో డబ్బు, విలువైన వస్తువులు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత ఉచితాలు, మద్యం ఉన్నాయి. కొన్నిచోట్ల మత్తు పదార్థాల్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రూ.952 కోట్ల విలువైన డబ్బు, ఇతర వస్తువుల్ని తమిళనాడు వ్యాప్తంగా సీజ్‌ చేశారు.


కట్టలు కట్టలుగా..

తిరుచ్చి జిల్లాలో అన్నాడీఎంకే మద్దతుదారు పంచాయత్‌ యూనియన్‌ అధ్యక్షురాలు ఎ.దివ్య ఇంట్లోనే రూ.కోటి పట్టుకున్నారు. ఆమె భర్త ఓ మాజీ మంత్రికి సన్నిహితుడు. పొల్లాచ్చి లోక్‌సభ స్థానంలో ఓ పౌల్ట్రీ పరిశ్రమలో దాచిన రూ.32 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి 3 పెట్టెల్లో ఉన్నట్లు గుర్తించారు. ఓటర్లకు పంచేందుకే తెచ్చారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విరుదు నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మాణిక్కం ఠాగూర్‌ తాజాగా నిర్వహించిన సభలో ఓటర్లకు ఆ పార్టీ సభ్యులు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరలయ్యాయి. దీనిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. ఈరోడ్‌ లో ఏకంగా 24,150 చీరలు పట్టుకున్నారు. అవి అన్నాడీఎంకే అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు చెందినవిగా అధికారులు గుర్తించారు. ఎన్నికలకు ముందే తాను వాటిని కొనుగోలు చేశానని, పనివాళ్ల కోసం తెచ్చానని అశోక్‌ కుమార్‌ చెబుతున్నారు. ప్రత్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంలో వాటిని సీజ్‌ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని అభ్యర్థులందరిలోనూ అశోక్‌ కుమార్‌ ధనవంతుడు. కుటుంబ ఆస్తి రూ.662 కోట్లుగా అఫిడవిట్‌లో చూపారాయన. ఇదే నియోజకవర్గంలో వేర్వేరు దాడుల్లో రూ.4.28 కోట్ల డబ్బును పట్టుకున్నారు. హోరాహోరీ పోరు జరుగుతున్న కోయంబత్తూరు నియోజకవర్గంలో డీఎంకేకు చెందిన ఓ వ్యక్తి డబ్బులు పంచుతున్నారని అదుపులోకి తీసుకున్నారు. అరక్కోణంలో రూ.20 లక్షలు సీజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు